3 లక్షల మంది పౌరులను బందీలుగా చేసుకున్న రష్యా: ఉక్రెయిన్ ఆరోపణ

ABN , First Publish Date - 2022-03-09T01:02:48+05:30 IST

ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యా మరోమారు తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది.

3 లక్షల మంది పౌరులను బందీలుగా చేసుకున్న రష్యా: ఉక్రెయిన్ ఆరోపణ

కీవ్: ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యా మరోమారు తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, మరియుపోల్, ఖార్కివ్, సుమీ నగరాల నుంచి పౌరులు స్వేచ్ఛగా తరలివెళ్లే ఉద్దేశంతో యద్ధ విమానాలకు కొంతసేపు విశ్రాంతి ఇచ్చింది.


మరికొన్ని చోట్ల మాత్రం రష్యా సైన్యం నగరాలపై బాంబులు కురిపిస్తూనే ఉంది. రష్యాపై కఠిన అంతర్జాతీయ ఆంక్షలు, వాణిజ్య ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ మరోమారు అంతర్జాతీయ సమాజాన్ని వేడుకున్నారు. యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ పెట్టుకున్న దరఖాస్తుపై త్వరలోనే చర్చించనున్నట్టు యూరోయిన్ కౌన్సిల్ తెలిపింది. 


ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించారు. రష్యా సైన్యం చుట్టుముట్టిన మరియుపోల్‌ నగరంలో రష్యన్ సేలను 3 లక్షల మంది పౌరులను నిర్బంధించాయని ఆరోపించారు. చాలా రోజులు వారికి నీళ్లు, ఆహారం అందడం లేదని, దీంతో చిన్నారి డీహైడ్రేషన్‌తో మరణించినట్టు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే రష్యా యుద్ధ నేరాలకు పాల్పడతోందని, అది కూడా వారి వ్యూహంలో భాగమని ట్వీట్ చేశారు.  

Updated Date - 2022-03-09T01:02:48+05:30 IST