Indian Students: భారత మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త.. ఉక్రెయిన్ విశ్వవిద్యాలయాల నుంచి పిలుపు

ABN , First Publish Date - 2022-08-20T13:46:26+05:30 IST

ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. రష్యాతో యుద్ధం కారణంగా అర్ధంతరంగా భారత్‌కు వచ్చిన విద్యార్థులను ఆ దేశం మళ్లీ రమ్మని పిలుస్తోంది.

Indian Students: భారత మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త.. ఉక్రెయిన్ విశ్వవిద్యాలయాల నుంచి పిలుపు

భారత మెడికల్‌ విద్యార్థులకు ఉక్రెయిన్‌ పిలుపు

వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం

వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచనఆన్‌లైన్‌ తరగతులు, ఇతర దేశాల్లోని వర్సిటీల్లో చేరే అవకాశమూ ఇస్తున్నట్లు వెల్లడి

పుణె, ఆగస్టు 19: ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. రష్యాతో యుద్ధం కారణంగా అర్ధంతరంగా భారత్‌కు వచ్చిన విద్యార్థులను ఆ దేశం మళ్లీ రమ్మని పిలుస్తోంది. తదుపరి సెమిస్టర్‌ క్లాసులను సెపెంబరు 1న ప్రారంభించనున్నామని, విద్యార్థులు వచ్చే వారంలోగా నిర్ణయం తీసుకోవాలని మెడికల్‌ యూనివర్సిటీలు సూచించాయి. అయితే తరగతులకు హాజరు విషయంలో పలు ఆప్షన్లు కూడా ఇచ్చాయి. రిస్క్‌కు సిద్ధపడి క్యాంప్‌సకు రావడం, తాత్కాలికంగా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావడం, ఇతర దేశాల్లోని వర్సిటీల్లో చేరడం అనే ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని పేర్కొంది.


అయితే, రష్యా బాంబుదాడుల్లో సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్న యూనివర్సిటీలు మాత్రం చివరి ఆప్షన్‌నే ప్రధానంగా సూచించాయి. ఇందుకోసం యూర్‌పలోని జార్జియా, పోలండ్‌ వంటి దేశాల్లోని మెడికల్‌ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిపాయి. కాగా, భారత విద్యార్థులకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా తాము జాతీయ వైద్య మండలి(ఎన్‌సీఎం)కి, ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయానికి లేఖ రాశామని, కానీ.. తమకు తిరిగి ఎటువంటి సమాధానం రాలేదని పలు యూనివర్సిటీలు తెలిపాయి. ఈ మేరకు ఆయా విద్యార్థులకు సమాచారం అందించాయి. 

Updated Date - 2022-08-20T13:46:26+05:30 IST