
కీవ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆదివారం ఓ టెలివైజ్డ్ మెసేజ్‌లో ఓ విజ్ఞప్తి చేశారు. యుద్ధం అందరి ప్రయోజనాలకు వ్యతిరేకమేనని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు వివరించాలని కోరారు. సామాన్య భారతీయులు కూడా తమకు మద్దతివ్వాలని కోరారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం 11వ రోజు కూడా కొనసాగుతోంది.
ఓ ప్రశ్నకు సమాధానంగా దిమిత్రో కులేబా మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాము విజ్ఞప్తి చేశామని చెప్పారు. యుద్ధం అందరి ప్రయోజనాలకు వ్యతిరేకమేనని వివరించాలని కోరామని చెప్పారు. ఈ యుద్ధం పట్ల ఆసక్తి ఉన్నది ఈ భూమండలం మీద ఉన్న ఏకైక వ్యక్తి కేవలం వ్లదిమిర్ పుతిన్ మాత్రమేనని తెలిపారు. రష్యా ప్రజలకు ఈ యుద్ధం మీద ఆసక్తి లేదన్నారు. సామాన్య భారతీయులు కూడా తమకు మద్దతివ్వాలని కోరారు.
ఉక్రెయిన్ వ్యవసాయోత్పత్తులను వినియోగించుకునే అతి పెద్ద వినియోగదారు భారత దేశమని చెప్పారు. యుద్ధం కొనసాగితే కొత్త పంటలను వేయడం సాధ్యం కాదన్నారు. ప్రపంచ, భారత దేశ ఆహార భద్రత కోసమైనా యుద్ధాన్ని ఆపడం చాలా ముఖ్యమని తెలిపారు.
ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇదే విధంగా ఓ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆహార భద్రతకు హామీ ఇస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి అని తెలిపింది. తమ దేశంలో ఉత్పత్తి అయిన సన్‌ఫ్లవర్ ఆయిల్లో 55 శాతం మేరకు ప్రపంచానికి ఎగుమతి అవుతోందని తెలిపింది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో తయారు చేసిన రుచికరమైన పదార్థాలను ఈ క్షణంలో ప్రపంచంలో మిలియన్ల ప్రజలు ఆస్వాదిస్తూ ఉంటారని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మద్దతు పలకడం వల్ల ప్రపంచానికి ఆకలి, కరువు, కాటకాల నుంచి రక్షణ లభిస్తుందని వివరించింది.
ఇవి కూడా చదవండి