NATOలో చేరబోం : జెలెన్‌స్కీ

ABN , First Publish Date - 2022-03-09T20:58:37+05:30 IST

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్యత్వాన్ని కోరబోమని

NATOలో చేరబోం : జెలెన్‌స్కీ

కీవ్ : నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్యత్వాన్ని కోరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా అనుకూల ప్రాంతాల హోదాపై రాజీ పడేందుకు సిద్ధమేనని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను అంగీకరించడానికి NATO సిద్ధంగా లేదని తనకు అర్థమైన తర్వాత చాలా కాలం క్రితమే ఈ విషయంలో  తాను వెనుకకు తగ్గానని చెప్పారు. 


NATO కూటమి వివాదాస్పద అంశాలపైనా, రష్యాను ఎదుర్కొనడంపైనా భయపడుతోందని చెప్పారు. NATOలో చేరడం గురించి మాట్లాడుతూ, మోకరిల్లి బిచ్చమెత్తుకునే దేశానికి అధ్యక్షునిగా తాను ఉండాలనుకోవడం లేదని చెప్పారు. 


ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభ కాలంలో సోవియెట్ యూనియన్ నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం యూరోప్ దేశాలు NATOను ఏర్పాటు చేసుకున్నాయి. తమ పొరుగు దేశం ఉక్రెయిన్‌కు NATOలో సభ్యత్వం ఇవ్వాలనడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభించడానికి కారణంగా దీనినే చూపిస్తోంది. తన ముంగిట్లో పాశ్చాత్య దేశాల కూటమి సైనిక శక్తిని, NATO విస్తరణను తనకు ముప్పుగా రష్యా పరిగణిస్తోంది. 


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు డోనెట్‌స్క్, లుగాన్‌స్క్ ప్రాంతాలకు స్వతంత్ర గణతంత్ర దేశాలుగా రష్యా గుర్తింపునిచ్చింది. 2014 నుంచి ఈ ప్రాంతాలు ఉక్రెయిన్‌తో పోరాడుతున్నాయి. ఈ ప్రాంతాలను సార్వభౌమాధికారంగల స్వతంత్ర దేశాలుగా ఉక్రెయిన్ గుర్తించాలని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. తాను భద్రతాపరమైన హామీల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. 


Updated Date - 2022-03-09T20:58:37+05:30 IST