తెలంగాణలో చదువుకునే అవకాశం కల్పించండి!

ABN , First Publish Date - 2022-05-02T19:16:32+05:30 IST

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థులకు...

తెలంగాణలో చదువుకునే అవకాశం కల్పించండి!

  • భవిష్యత్‌కు బాట చూపండి
  • రాష్ట్రంలో సీట్లు కేటాయించాలి   
  • సంతకాలు సేకరించిన ఉక్రెయిన్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు 

హైదరాబాద్ సిటీ/చంపాపేట : యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రంలో చదువుకునే అవకాశం కల్పించాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ ఎంబీబీఎస్‌ స్టూడెంట్స్‌ కోరింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు న్యాయం చేయాలని అభ్యర్థించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీల్లో సదరు విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కోరింది.


ఈ మేరకు చంపాపేట డివిజన్‌ కర్మన్‌ఘాట్‌లో పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. రాష్ట్రం నుంచి సుమారు 720మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోని యూనివర్సిటీల్లో చేరారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతకాలను సేకరించారు. సంతకాల ప్రతులను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు.


విద్యా సంవత్సరం నష్టపోకుండా....

విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. యుద్ధం కారణంగా భారత్‌ రావడానికి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాం. ప్రభుత్వం మా భవిష్యత్‌కు బాటచూపాలి. - పి. వైతరుణి, మెడిసిన్‌ 4వ సంవత్సరం, కర్మన్‌ఘాట్‌ 


డబ్బులు చెల్లించడానికి సిద్ధం...

ఉక్రెయిన్‌ కాలేజీల్లో చెల్లించిన విధంగానే ఇక్కడ డబ్బులు చెల్లించి చదువుకోడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మాకు మెడికల్‌ కళాశాలల్లో సీట్లు కేటాయించి ఆదుకోవాలి. మా కెరీర్‌ పాడవకుండా ఆలోచించాలి. చదువు మానేసి ఇప్పటికే రెండు నెలలు అయింది. - నవనీత్‌, మెడిసిన్‌ ద్వితీయ సంవత్సరం, హైదరాబాద్‌. 


తగిన నిర్ణయం తీసుకోవాలి

మా అబ్బాయి ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ రెండో సంవత్సరం చదువుతూ యుద్ధం కారణంగా మధ్యలోనే భారత్‌కు తిరిగొచ్చాడు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోవాలి. వారికి మెడికల్‌ కాలేజీల్లో సీట్లను కేటాయించాలి. - ఆశన్న, విద్యార్థి తండ్రి, ఫిలింనగర్‌-హైదరాబాద్‌


ప్రభుత్వాలను వేడుకుంటున్నాం

విద్యార్థుల భవిష్యత్‌కు ఆటంకం ఏర్పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. మా అబ్బాయి ఉక్రెయిన్‌ మెడిసిన్‌ మొదటి సంవత్సరం కోర్సులో ఉన్నాడు. పిల్లల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. - సాయిదీప్తి, విద్యార్థి తల్లి, సైనిక్‌పురి-హైదరాబాద్‌.

Updated Date - 2022-05-02T19:16:32+05:30 IST