
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమర్థించలేని, క్షమార్హం కాని చర్య అని భారత్ ఎందుకు విస్పష్టంగా ప్రకటించలేదు? ఉక్రెయిన్ ప్రజలపై బాంబుదాడులను నిలిపివేయాలని రష్యాకు భారత్ ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదు? ఇజ్రాయెల్ ప్రధాని వలే మన ప్రధానమంత్రి స్వయంగా మాస్కో, కీవ్‌కు వెళ్ళి కాల్పుల విరమణకు ఎందుకు కృషి చేయరు? శాంతి స్థాపనకు చొరవ తీసుకోకుండా భారత్‌ను అడ్డుకుంటున్నదేమిటి? ఈ విషమ పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోవడం మనకు ప్రతిష్ఠాకరమా?
మనకాలం యుద్ధాలు ధర్మస్థాపనకే జరుగుతున్నాయా? ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నన్ను అపరిమిత ఆందోళనకు గురిచేస్తోంది (మీరీ కాలమ్ చదివే సమయానికి ఈ భయానక యుద్ధం 31వ రోజులోకి ప్రవేశించనున్నది). ప్రపంచ పరిణామాలపై నేను ఆసక్తి చూపడం ప్రారంభమయినప్పుడు ‘మంచి పోప్’గా సుప్రసిద్ధమైన 23వ పోప్ జాన్ వక్కాణించిన ఆరు మాటలు నన్ను ప్రగాఢంగా ప్రభావితం చేశాయి : ‘నో మోర్ వార్, నెవర్ ఎగైన్ వార్’.
ఆనాటి నుంచి ప్రపంచంలో చాలా యుద్ధాలు- పెద్దవీ, చిన్నవీ; స్వల్పకాలికమైనవీ, దీర్ఘకాలం కొనసాగినవీ; సరిహద్దుల్లో రగిలినవీ, సుదూర ప్రాంతాల్లో ప్రజ్వరిల్లినవీ; పరోక్ష యుద్ధాలు మొదలైనవెన్నో సంభవించాయి. 20, 21వ శతాబ్దాల యుద్ధాలు ఒక శాశ్వత సత్యాన్ని చాటుతున్నాయి. యుద్ధంలో విజేత ఎవరూ ఉండరనేదే ఆ సత్యం. జాతులను, సమాజాలను, అసంఖ్యాక ప్రజా శ్రేణులను సంక్షుభితపరుస్తోన్న ఏ సమస్యనూ యుద్ధం పరిష్కరించలేదు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని విజయం సాధించింది. అయినా ఒక ప్రాదేశిక వివాదంలో ఈ రెండు దేశాలూ ఇప్పటికీ శత్రువులుగానే ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం రష్యాలో కమ్యూనిస్టు వ్యవస్థ కూలిపోయింది.
‘ప్రజాస్వామ్య’ పాలన ప్రారంభమయింది. రష్యా ప్రస్తుత పాలకుడు వ్లాదిమిర్ పుతిన్ విచ్ఛిన్నమైన సోవియట్ యూనియన్ గూఢచార సంస్థలో ఉన్నతాధికారిగా ఉండేవారు. 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికైన నాటి నుంచీ ఆయన అసాధారణ అధికారాలను చెలాయిస్తున్నారు. పుతిన్ పాలనలో రష్యా తొలుత క్రిమియాను ఆక్రమించుకుని, ఆ తరువాత కలిపేసుకుంది. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో రెండు విడిపోయిన ‘రిపబ్లిక్’ (డొనెట్స్క్, లహన్స్క్)లను స్వతంత్ర రాజ్యాలుగా రష్యా అధికారికంగా గుర్తించింది. జార్జియా నుంచి రెండు ప్రాంతాల (అబ్ఖాజియా, సౌత్ అస్సేటియా)ను విలీనం చేసుకుంది. అంతర్యుద్ధాన్ని అణచివేసేందుకై సిరియాకు సైనిక సహాయం అందించింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగగలదని ప్రపంచం ముందుగా పసిగట్టలేకపోయింది. ఈ కారణంగానే ఈ యుద్ధ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోలేకపోతోంది. రష్యా గత రెండు దశాబ్దాలలో అంతర్జాతీయ రంగంలో చేసిన ప్రతి పనినీ పాశ్చాత్య దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా ఇరవయో శతాబ్దంలోనే చేశాయి.
ప్రభుత్వాలను మార్చడమనేది అమెరికా అధ్యక్షులకు ఒక కాలక్షేప వ్యవహారమైపోయింది. పౌరులలో అశాంతిని రగల్చడం, సైనిక తిరుగుబాట్లను ప్రోత్సహించడం, రాజకీయ హత్యలకు పన్నాగాలు పన్నడం, కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఆర్థిక ఆంక్షలు విధించడం... ఏదీ నిషిద్ధం కాదు సుమా! అమెరికా చేసిన యుద్ధాలలో అత్యంత గర్హనీయమైనదీ, ఏ మాత్రం సమర్థించలేనిది వియత్నాం యుద్ధం. అమెరికన్లు చివరకు ఆ దేశం నుంచి అవమానకరమైన రీతిలో నిష్క్రమించవలసివచ్చింది. సద్దాం హుస్సేన్ అణ్వాయుధాలు, జీవ, రసాయనాయుధాలను సమకూర్చుకున్నాడనే తప్పుడు ఆరోపణలతో 2003లో ఇరాక్‌ను అమెరికా ఆక్రమించుకుంది.
సరే, ఉక్రెయిన్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనలు హృదయ విదారక విషాదాలు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి మూల కారణం నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) విస్తరణే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన అనంతరం సమైక్య జర్మనీ, నాటి అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్ బేకర్లు ‘జర్మనీ సరిహద్దులకు ఆవల నాటో ఒక అంగుళం కూడా విస్తరించదని రష్యాకు హామీ ఇచ్చారు. రష్యాకు జర్మనీ సరిహద్దులు 5,439 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
1999 నుంచి 14 కొత్త సభ్య దేశాలతో నాటో విస్తరించింది. 30 సభ్య దేశాల నాటోలో చేరేందుకు జార్జియా, ఉక్రెయిన్ కూడా ఉబలాటపడ్డాయి. రష్యా వ్యతిరేకించింది. నాటో విస్తరణకు హద్దులు ఏర్పరిచింది జార్జియా, ఉక్రెయిన్లు నాటోలో చేరితే ఆ సైనిక కూటమి తన సైన్యాలను రష్యా సరిహద్దుల వెంబడి మొహరించడం అనివార్యమవుతుంది. జర్మనీ వెలుపల నాటో ఒక అంగుళం కూడా విస్తరించదన్న హామీకి భిన్నంగా రష్యాకు అంగుళం దూరంలో నాటో మొహరించే పరిస్థితులు ఆగమించాయి. రష్యా తన భద్రతపై సహజంగానే తీవ్ర ఆందోళనకు గురయింది. అమెరికా నుంచిగానీ, నాటో సభ్య దేశాల నుంచిగానీ ఎటువంటి విశ్వసనీయమైన హామీలు రష్యాకు ఇవ్వలేదు. అయితే నాటో విస్తరణకు రష్యా విధించిన హద్దులను అవి అత్రికమించలేదు వాస్తవానికి రష్యా, క్రిమియా (అప్పుడు ఉక్రెయిన్‌లో భాగంగా ఉండేది)ను కలుపుకున్నప్పుడు, జార్జియాలోని రెండు ప్రాంతాలను విలీనం చేసుకున్నప్పుడు అమెరికా, నాటోలు మౌనంగా సమ్మతించాయి.
ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా విధ్వంసకరమైన యుద్ధాన్ని రష్యా ప్రారంభించేందుకు సహేతుకమైన కారణమేమీ లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు అమానుషంగా ఉన్నాయి. భయంకరమైన విధ్వంసం సంభవిస్తోంది. ఉక్రెయిన్ జనాభా 4.40 కోట్లు కాగా 35 లక్షల మంది దేశం నుంచి పరారయ్యారు. 65 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పట్టణాలు నేలమట్టమయ్యాయి. ఓడరేవు నగరమైన మారియాపాల్ శిథిలాల కుప్పగా మారిపోయింది.
ఆహారం, తాగునీరు, మెడిసిన్స్ కొరవడి లక్షలాది కుటుంబాలు అల్లాడుతున్నాయి. వేలాది ప్రజలు హతమయ్యారు. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, ప్రజలు రష్యాకు లొంగిపోయేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగిసినా విజేత ఎవరూ ఉండరు. రష్యా ఎటువంటి పరిస్థితులలోనూ విజేత కాబోదు. ఉక్రెయిన్ను అది కలుపుకోవడమనేది కల్ల. పైగా పొరుగునే ఒక శత్రుపూరిత దేశం ఆవిర్భవిస్తుంది. అది, రాజీపడని శాశ్వత శత్రువుగా ఉంటుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్ళిన రష్యాకు భద్రత సమకూరే పరిస్థితి లేకపోగా, అంతర్జాతీయ సమాజంలో గౌరవ హాని మరింతగా వాటిల్లడం ఖాయం.
ఒక భారతీయుడుగా నేను నిస్సహాయంగా విలవిలలాడుతున్నాను. ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వ విధానమేమిటో నాకు ఎంతమాత్రం అవగతంకావడం లేదు. అసలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వెళ్ళడం సమర్థించలేని, క్షమార్హం కాని చర్య అని భారత్ ఎందుకు విస్పష్టంగా ప్రకటించలేదు? ఉక్రెయిన్ ప్రజలపై బాంబుదాడులు, గృహాల, పాఠశాలల, ఆసుపత్రుల విధ్వంసాన్ని నిలిపివేయాలని రష్యాకు భారత్ ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదు? ఇజ్రాయెల్ ప్రధాని వలే మన ప్రధానమంత్రి స్వయంగా మాస్కో, కీవ్‌కు వెళ్ళి కాల్పుల విరమణకు ఎందుకు కృషి చేయరు? శాంతి స్థాపనకు చొరవ తీసుకోకుండా భారత్‌ను అడ్డుకుంటున్నదేమిటి? ఈ విషమ పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోవడం మనకు ప్రతిష్ఠాకరమా? మన విదేశాంగ విధానాన్ని నిర్వహిస్తున్న తీరుతెన్నులపై విద్వత్పరమైన విశ్లేషణకు ఈ వ్యాసాన్ని ఉద్దేశించలేదు.
నా వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే ఇందులో వ్యక్తం చేశాను. ఆలోచనాపరులైన పలువురు పరిశీలకులు వ్యక్తం చేసిన ఒక సునిశ్చిత అభిప్రాయాన్ని పేర్కొంటే ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ‘ఉక్రెయిన్ సంక్షోభంతో తలెత్తిన నైతిక సవాళ్లను ఎదుర్కోవడంలో మౌనం వహించడం వల్ల, ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ అంశం ఓటింగ్‌కు వచ్చినప్పుడు గైర్హాజర్ అవ్వడం వల్ల భారత్ ప్రతిష్ఠ క్షీణించిపోయింది.’

పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)