రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను విధించండి : జెలెన్‌స్కీ

ABN , First Publish Date - 2022-03-04T22:09:22+05:30 IST

రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్

రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను విధించండి : జెలెన్‌స్కీ

కీవ్ : రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. జపొరిజ్జియా అణు విద్యుత్తు కర్మాగారంపై రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడలతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. 


జెలెన్‌స్కీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడతో మాట్లాడానని చెప్పారు. జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంటుపై రష్యా అణు ఉగ్రవాదం గురించి వివరించినట్లు తెలిపారు. ప్రపంచ భద్రతకు ఎదురయ్యే ముప్పు తీవ్రంగా ఉందని ఇరువురం అంగీకరించామన్నారు. ఉక్రెయిన్‌కు అనేక రకాలుగా సాయపడుతున్నందుకు, రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయాలని పట్టుబడుతున్నందుకు జపాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దురాక్రమణదారుడిని తామిద్దరం కలిసి వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 


ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన హామీలు లభించే విధంగా టర్కిష్ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సాయపడతారని జెలెన్‌స్కీ చెప్పారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లోని వోల్నోవాఖా వద్ద శుక్రవారం ఓ రష్యన్ Su-25 విమానాన్ని కూల్చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ విమానం నివాస గృహాలపైనా, ప్రజల మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసిందని తెలిపింది. 


ప్రపంచంలో అతి పెద్ద విమానం Antonov An-225 ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో రష్యా దళాల దాడిలో ధ్వంసమైంది. ధ్వంసమైన ఈ విమానం వీడియోలు నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చాయి. 


Updated Date - 2022-03-04T22:09:22+05:30 IST