Good News: భారత విద్యార్థులకు తీపి కబురు.. వెంటనే తిరిగి రావాలంటూ ఉక్రెయిన్ వర్శిటీల నుంచి పిలుపు

ABN , First Publish Date - 2022-08-19T19:12:44+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ వదిలి వచ్చిన భారతీయ విద్యార్థులకు (Indian students) ఆ దేశంలోని విశ్వవిద్యాలయాలు (universities) తీపి కబురు చెప్పాయి.

Good News: భారత విద్యార్థులకు తీపి కబురు.. వెంటనే తిరిగి రావాలంటూ ఉక్రెయిన్ వర్శిటీల నుంచి పిలుపు

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ వదిలి వచ్చిన భారతీయ విద్యార్థులకు (Indian students) ఆ దేశంలోని విశ్వవిద్యాలయాలు (universities) తీపి కబురు చెప్పాయి. ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయిన భారతీయ మెడిసిన్ విద్యార్థులు తిరిగి రావాలని అక్కడి యూనివర్శిటీలు తెలిపాయి. సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులతో పాటు పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఆఫ్‌లైన్ తరగతుల విషయమై భారతీయ విద్యార్థులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు ఈ సందర్భంగా వర్శిటీలు వెల్లడించాయి. చాలా ఉక్రేనియన్ విశ్వవిద్యాలయాలకు తదుపరి సెమిస్టర్ సెప్టెంబరు 1న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఫీజులను క్లియర్ చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి విద్యార్థులకు వచ్చే వారం వరకు గడువు ఇచ్చాయి. 


ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని తారాస్ షెచెన్కో నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్న అష్నా పండిత్ అనే భారత విద్యార్థినికి తాజాగా విశ్వవిద్యాలయం నుంచి సందేశం వచ్చింది. 'వచ్చే నెల 1 నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయి. మీ భద్రతకు గ్యారంటీ మాది' అనేది ఆ సందేశం సారాంశం. కాగా, ప్రస్తుతం ఆమె ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇక భారత్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. అయితే, అక్కడి యుద్ధం కారణంగా గత మార్చిలో విద్యార్థులంతా స్వదేశానికి తిరిగి వచ్చేశారు. చదువు మధ్యలో ఆగిపోవడంతో తమ భవిష్యత్ దృష్ట్యా భారత్‌లోనే తమకు మెడిసిన్ పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇప్పుడు తిరిగి అక్కడ తరగతులు ప్రారంభం అవుతుండడంతో సుమారు 20వేల మంది విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించింది.  

Updated Date - 2022-08-19T19:12:44+05:30 IST