రష్యా సైనికుల భయంతో జుత్తు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్ మహిళలు

ABN , First Publish Date - 2022-04-08T00:44:18+05:30 IST

యుద్ధం వల్ల అనేక నష్టాలు అనివార్యం అయినప్పటికీ, ఎన్నటికీ

రష్యా సైనికుల భయంతో జుత్తు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్ మహిళలు

కీవ్ : యుద్ధం వల్ల అనేక నష్టాలు అనివార్యం అయినప్పటికీ, ఎన్నటికీ కోలుకోవడం సాధ్యం కాని నష్టం మహిళలకు జరుగుతోంది. వారి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం దారుణంగా దెబ్బతింటున్నాయి. అందుకే వారు తమకు తోచిన పద్ధతుల్లో తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ మహిళలు రష్యన్ సైనికుల దాష్టీకాల నుంచి తప్పించుకోవడం కోసం తమ జుత్తును కత్తిరించుకుని అనాకారులుగా కనిపిస్తున్నారు. 


ఇవాన్‌కివ్ గ్రామం 35 రోజుల తర్వాత మార్చి 31న రష్యా సేనల నుంచి ఉక్రెయిన్ వశమైంది. ఇక్కడ రష్యన్ సైనికులు పాల్పడిన దురాగతాల గురించి స్థానికులు మీడియాకు వివరిస్తున్నారు. కీవ్ డిప్యూటీ మేయర్ మెరీనా తెలిపిన వివరాల ప్రకారం ఇవాన్‌కివ్ అనే శివారు గ్రామంలో 15, 16 సంవత్సరాల వయసుగల అక్కచెల్లెళ్ళపై రష్యన్ సైనికులు దారుణంగా అత్యాచారం చేశారు. బేస్‌మెంట్లలో ఉన్న మహిళలను జుత్తు పట్టుకుని సైనికులు లాక్కెళ్తున్నారు. దీంతో వికారంగా కనిపించడానికి, అదేవిధంగా జుత్తు సైనికులకు అందకుండా చేయడానికి ఉక్రెయిన్ మహిళలు తమ జుత్తును కత్తిరించుకుంటున్నారు. స్థానిక మహిళ ఎలెనా మాట్లాడుతూ, తన పన్నెండేళ్ళ కుమారుడు రష్యన్ సేనల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. 


రష్యా సేనలు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ నేరాలపై న్యూరెంబెర్గ్ తరహా యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రజలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్న చిత్రాలన్నీ బూటకపు వార్తలేనని కొట్టి పారేసింది. ఉక్రెయిన్ దళాలే ఈ విధంగా ఫోర్జరీ చేస్తున్నాయని ఆరోపించింది. 


Updated Date - 2022-04-08T00:44:18+05:30 IST