అమెరికా నుంచే అన్నపూర్ణలా ఆదుకుంటూ..

Jun 2 2021 @ 16:06PM

కొత్తగూడెం: స్పందించే మనసు.. చేయాలనే తపన.. సాయం చేయడానికి ముందడుగు వేసేలా చేస్తాయి. అమెరికాలోని యూజే బ్రాండ్స్ ఎంటర్‌పెన్యూర్ డిజైనర్ ఉమా జెర్రిపోతుల కూడా ఇదే కోవకి చెందిన వారు. పుట్టిన ఊరిపై మమకారం, నలుగురికి సాయపడాలనే ఆలోచన ఆమెను సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా చేసింది. గత కొంత కాలంగా కొత్తగూడెంలోని విద్యానగర్‌లో ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.


లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉంటున్న నిరుపేదలకు, భిక్షాటన చేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, అనాథాశ్రయం పిల్లలకు భోజన వసతి కల్పించారు. ఇదిలా ఉంటే, కరోనా వాక్సినేషన్ కేంద్రంలో పని చేస్తున్న ఏ అండ్ యం మెడికల్ సిబ్బంది, రామచంద్ర హైస్కూల్, కొత్తగూడెంలోని అర్బన్ పైమరీ సెంటర్‌లోని కోవిడ్ ఇంచార్జ్ పొన్నెకంటి సంజీవ రాజు ద్వారా సిబ్బందికి భోజనాలు అందించారు.


ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ఉమా జెర్రిపోతుల అన్ని రకాల సహాయాలు అందిస్తుండగా... స్థానికంగా రిటైర్డ్ పోలీస్ అధికారి బీడీ గుప్త, యూజే డిజైనర్ సిబ్బంది కల్యాణ్, జీవన్ పర్యవేక్షిస్తున్నారు. రోజూ ఓ ఆటోలో ఆహార పదార్థాలను తీసుకు వెళ్లి పంపిణీ చేశారు. రోజుకు 100 మందికి చొప్పున పది రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేశారు. ఉమా జెర్రిపోతుల సేవా కార్యక్రమాలపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Follow Us on: