కొలువులు కల్లలే..!

ABN , First Publish Date - 2021-06-21T05:41:54+05:30 IST

ఉద్యోగాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లాలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు శుక్రవారం విడుదలైన జాబ్‌ క్యాలెండర్‌తో ఒక్కసారిగా గల్లంతైపోయాయి.

కొలువులు కల్లలే..!

ఆశలు కూల్చిన జాబ్‌ క్యాలెండర్‌

నిరాశా, నిస్పృహల్లో యువత

లక్షల్లో ఖాళీలు.. పదుల్లో పోస్టులు

ఉద్యోగాలు వదిలేసి మరీ ప్రిపరేషన్‌

రెండేళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం కన్నీళ్లే 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఉద్యోగాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లాలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు శుక్రవారం విడుదలైన జాబ్‌ క్యాలెండర్‌తో ఒక్కసారిగా గల్లంతైపోయాయి. వేలల్లో వస్తాయనుకున్న పోస్టులు కనీసం వందల్లో కూడా రాకపోవడంతో జిల్లాలోని యువతీ యువకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం’ అన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎన్నికల హామీని నమ్మి ఘోరంగా మోసపోయామని వాపోతున్నారు. ఏ ఇద్దరు యువకులు మాట్లాడుకున్నా ఇదే విషయం. ఇప్పుడు ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి ? ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాలి ? ఇవే ఇప్పుడు యువతను వేధిస్తున్న ప్రశ్నలు. పాత ఉద్యోగాలకు వెళదామా  ? అంటే కరోనా, లాక్‌డౌన్‌ పుణ్యమా అంటూ అవి కూడా ఎగిరిపోయాయి. ఏం చేయాలో తెలియని నిరాశా, నిస్పృహల్లో నీరుగారిపోతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 21,500 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా యని, వీటిని మూడు దశల్లో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. ఆ తరువాత రాష్ట్ర హోంమంత్రి సుచరిత కూడా ప్రతి ఏటా 6,500 పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికి మూడుసార్లు ప్రకటించారు. వీటిని నమ్మి ఉద్యోగాలు మానేసి కానిస్టేబుల్‌ పరీక్షలకు ప్రిపేరవుతున్నామని అభ్య ర్థులు చెబుతున్నారు. వీటితోపాటు పలు ప్రభుత్వ విభాగాల్లో 24 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నీలం సాహ్ని సీఎస్‌ గా ఉన్న సమయంలోనే గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. మరో 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని, వాటిలో 25 వేల పోస్టుల భర్తీ ఉంటుందని పెద్దఎత్తున ప్రకటనలు వచ్చా యి. దీంతో జిల్లాలోని లక్షల మంది నిరుద్యోగులు, అప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న యువకులు వేలాది మంది ఆ ఉద్యోగాలను వదులుకుని పోటీ పరీక్షల సిద్ధమయ్యారు. 2019 నుంచి ఇప్పటి వరకూ జాబ్‌ క్యాలెండర్‌ కోసం ప్రతిరోజూ ఎదురుచూశారు. ఎట్టకేలకు విడుదలైన జాబ్‌ క్యాలెండర్‌ వారి నిరీక్షణను, పరిశ్రమను అవహేళన చేసినట్లుగా ఉంది. 


నామమాత్రంగా పోస్టులు

ప్రభుత్వం గుర్తించిన ఖాళీలు వేలల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్లో ఉద్యోగాలు వందల్లో ఉన్నాయి. అందునా అత్యధిక సంఖ్యలో ఉండే డిగ్రీ హోల్డర్లు ఎదురు చూసే గ్రూప్స్‌ పరీక్షల్లో పోస్టులు పదుల సంఖ్యలో ఉండడం విశేషం. తాజా క్యాలెండర్‌ ప్రకారం గ్రూప్‌ 1, 2 విభాగాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 907 పోస్టులను గుర్తించినా, వాటిలో 36 పోస్టులు మాత్రమే ఈ ఏడాది భర్తీ చేస్తారు. వీటిని 13 జిల్లాలకు విభజిస్తే, జిల్లా వాటా కింద 3 పోస్టులు కూడా రావు. రాష్ట్రంలో పోలీసు డిపార్టుమెంటులో 7,740 ఖాళీ లు గుర్తించగా వాటిలో 450 పోస్టులనే భర్తీ చేస్తున్నారు. ఇందులో జిల్లా వాటా 34 పోస్టులు. ఇవి మూడు విభాగాల్లో ఉండడంతో ఒక్కో విభాగానికి 10 పోస్టులు కూడా రావు. దీనిని బట్టి జనరల్‌, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్‌, మహిళ రిజర్వేషన్లకు ఒక్కటి చొప్పున కూడా పోస్టులు రాకపోవచ్చు. జనరల్‌ కోటాలో 1,2 పోస్టులు ఉంటే, రిజర్వేషన్‌ కేటగిరీలకు ఆ ఒక్క పోస్టు కూడా ఉండకపోవచ్చు. ఉపాధ్యాయులకు సం బంధించి ఒక్క పోస్టు లేదు. దీంతో వారికి ఏ అవకాశమూ మిగలలేదు. ప్రస్తుతం ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో సగానికి పైగా వైద్య విభాగంలోనే ఉండడంతో జిల్లాలోని సాధారణ డిగ్రీ అర్హతగా కలిగి వున్న లక్షల మంది నిరుద్యోగులకు ఆ అవకాశమూ లేదు. పాలకులు తమను నమ్మించి నట్టేట ముం చారని జిల్లాకు చెందిన నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. 


దారుణంగా మోసపోయాం 

నా పేరు గోవిందు. మాది కొవ్వలి. పెళ్లై పాప కూడా ఉంది. రెండేళ్ల క్రితం వరకూ మెడికల్‌ రిప్రజంటేటివ్‌గా పని చేసేవాణ్ణి. నెలకు 35 వేలు డ్రా చేసేవాణ్ణి. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఉంటుందని, ఏటా 6,500 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తానని సీఎం చెప్పడంతో ఆ ఉద్యోగం మానేసి పోలీస్‌ ట్రైనింగ్‌కు ప్రిపేరవుతున్నా. భార్యాబిడ్డల్ని వదిలేసి ఏలూరులో రూము తీసుకుని రెండేళ్లుగా కుస్తీ పడుతున్నా. అదిగో.. ఇదిగో అంటూ రెండేళ్ల తరువాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. కానీ ఏం లాభం. అందులో రాష్ట్రవ్యాప్తంగా ఉంది 450 పోస్టులే. జిల్లాకు 30 పోస్టులు కూడా రావు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దారుణంగా మోసపోయా. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. 


ఈ కష్టం పగవాడికి కూడా వద్దు

నా పేరు కృష్ణ. మాది ఏలూరు. ఇది నాకు చివరి అవకాశం. ఆ తరువాత వయో పరిమితి దాటిపోతుంది. అందుకే ఎంతో పట్టుదలతో చదువుతున్నా. ప్రైవేటు టీచరుగా ఉద్యోగం చేసుకుని కుటుంబానికి ఆధారంగా ఉన్న నేను.. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కష్టాలు పోతాయిలే అన్న నమ్మకంతో కూలీ, నాలీ చేసుకునే అమ్మానాన్నల పైనే భారం మోపి రెండేళ్లుగా ప్రిపేరవు తున్నా. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌ చూశాక కళ్ల తిరిగిపోయాయి. ఏం చెయ్యాలో.. ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాలో పాలు పోవడం లేదు.  


జాబ్‌ క్యాలెండర్‌ చూశాక ఏడుపాగలేదు 

మాది చింతలపూడి. నాపేరు సూరిబాబు నేను డీఎస్సీ కోసం ప్రిపేరవు తున్నాను. రెండేళ్లుగా ఏలూరులోనే ఉండి ఎంతో కష్టపడి చదువుతున్నా. జాబ్‌ క్యాలెండర్‌లో టీచర్‌ పోస్టులు ఉంటాయని ఎంతో ఆశగా ఎదురు చూశా. నిన్న విడుదలైన జాబ్‌ క్యాలెండర్‌ చూశాక ఏడుపాగలేదు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా టీచర్‌ పోస్టు విడుదల చేయలేదు. 


క్యాలెండర్‌ చూశాక..

ప్రతి ఏటా ఉద్యోగ ప్రకటనలు ఉంటాయన్న ఒకే ఒక్క హామీని నమ్మి ఓటేశాం. రెండేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ ప్రకటన లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవాళ కాకపోతే రేపై నా వస్తుంది కదా అని ఆశతో చదువుతున్నాం. ఆ ఆశలు క్యాలెండర్‌ చూశాక అడియాశలయ్యాయి. 

– శ్రీనివాసులు, ఏలూరు


టీచర్‌ పోస్టులు భర్తీ చేయండి

టీచరు పోస్టులు కూడా జాబ్‌ క్యాలెండర్లో చేర్చాలి. వేలాది పోస్టు లు ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు భర్తీ చేయకపోవడం అన్యాయం. ప్రతిసారీ ఇన్నివేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతూ వచ్చారు. తీరా చూస్తే ఒక్క పోస్టు  వేయ లేదు. దయచేసి టీచర్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. 

– బి.కృష్ణ, రంగాపురం



 


Updated Date - 2021-06-21T05:41:54+05:30 IST