గోడలకే 560 కేజీల బంగారం.. రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్యాలెస్ ఎవరిదో తెలిస్తే..

May 24 2021 @ 12:07PM

మూడంతస్తుల ప్యాలెస్.. మొత్తం 400 గదులు. అతి పెద్ద హాల్. ఆ హాల్‌లో అత్యంత బరువైన భారీ షాండ్లియర్లు. వాటి బురువుకు సీలింగ్ ఆగుతుందా లేదా అన్నది టెస్ట్ చేయడానికే సీలింగ్‌కు ఏనుగులను వేలాడదీసి మరీ చూశారట. ప్యాలెస్ హాల్ గోడలకు ఏకంగా 560 కిలోల బంగారాన్ని పోత పోశారట. ఏంటీ.. వింటేనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ. అత్యంత ఖరీదైన ఆ భవనం ఎవరిదా అని ఆలోచిస్తున్నారా..? ఎవరిదో కాదు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న మాజీ కాంగ్రెస్ యువ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాది. గతేడాది ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. రాయల్ సిటీ గ్వాలియర్‌లో ఉండే ఈ సింధియా యువరాజు వంశపారంపర్యంగా వచ్చిన కోటలో ఉంటున్నారు.  ఈ కోట పేరు ‘జై విలాస్ ప్యాలెస్’. క్లాసిక్ యూరోపియన్ స్టైల్లో ఉండే ఈ భవనంలో టుస్కన్, ఇటీలియన్, కోరింథియన్ స్టైల్స్ కనిపిస్తాయి. గతంలో గ్వాలియర్‌ను పాలించిన హిందూ మరాఠా రాజవంశమైన సింధియాలు దీన్ని నిర్మించారు. 12 లక్షల 40 వేల 771 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ రాజభవనం గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకాలస్యం చదివేయండి..


ఘనమైన రూపమే కాదు, రాచరిక చరిత్ర కూడా ఉన్న ఈ రాజ భవనాన్ని జీవాజీరావు సింధియా హయాంలో నిర్మించారు. ఆయన మనుమడైన, బీజేపీ ఎంపీ  జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా దీనిలోనే నివశిస్తున్నారు. గ్వాలియర్ రాజవంశంలో జన్మించిన ఆయన ప్రస్తుత భారత రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు ఇంతటి భారీ రాజభవనాన్ని ఎందుకు నిర్మించారు? అని ఎవరికైనా అనుమానం ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో అంటే 1876లో వేల్స్ యువరాజు జార్జ్, యువరాణి మేరీ భారత్‌కు వచ్చారట. వారిని గ్వాలియర్లో ఆహ్వానించడం కోసం ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందని సమాచారం.

మొత్తం మూడంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం గురించి ఆసక్తికర విషయం ఏంటంటే.. దీనిలో తొలి అంతస్తు టుస్కన్ స్టైల్లో, రెండో అంతస్తు ఇటాయిలన్-డోరిక్ స్టైల్లో, మూడో అంతస్తు కోరింథియన్, పలాడియన్ డిజైనుల్లో నిర్మించారు. ఇక్కడి దర్బార్ హాల్‌లో భారీ షాండ్లియర్లు ఉంటాయి. వీటి ఎత్తు 12.5 మీటర్లు. ఒక్కోటి 250 బల్బులతో 3,500 కేజీల బరువు ఉంటాయి. ఇవి ఎంత భారీగా ఉంటాయంటే.. వీటిని సీలింగ్ మోయగలదా? అని చూడటం కోసం భవనాన్ని నిర్మించే సమయంలో ఎనిమిది ఏనుగులను సీలింగ్‌కు వేలాడదీసి పరీక్షించారట. జై విలాస్ ప్యాలెస్ హాల్‌ గోడలను 560 కేజీల బంగారంతో అలంకరించారు. నియోక్లాసికల్, బరాకీ స్టైల్ స్ఫూర్తితో ఈ హాల్‌ను డిజైన్ చేశారట. దీనిలోనే అప్పటి రాజుగారు సమావేశాలు నిర్వహించేవారు.

మమారాజ జయాజీరావవు సింధియా హయాంలో 1874 సంవత్సరంలో ఈ రాజభవనం పునాది పడింది. బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ మైకేల్ ఫిలోస్ ఈ మ్యాన్షన్ డిజైన్ చేశారు. ఈ భవనాన్ని అప్పట్లోనే కోటి రూపాయలతో నిర్మించారు. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ భవనం విలువ 10 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ప్యాలెస్‌లో ఒక చిన్న మోడల్ రైలు ఉంది. దీన్ని బలమైన వెండితో తయారుచేశారు. అతిథుల కోసం సిగార్లు, బ్రాందీ తీసుకురావడానికి ఈ రైలును ఉపయోగించేవారట. ఈ భవనంలో మొత్తం 400 గదులు ఉన్నాయి. వీటిలో 35 గదులను కలిపి ఒక మ్యూజియంగా మార్చారు. దీని పేరు హెచ్.హెచ్. మహారాజ జీవాజీరావు సింధియా మ్యూజియం. ఆయన జ్ఞాపకార్థం దీన్ని రాజమాత శ్రీమంత్ విజయరాజే సింధియా ఏర్పాటు చేశారు. మరాఠా సింధియా రాజవంశానికి చెందిన వెండి రధం, పల్లకీలు, వెండి బగ్గీలు, వింటేజ్ లగ్జరీ కార్లు వంటి ఆస్తులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఝాన్సీరాణి లక్ష్మీబాయి డాలు (షీల్డ్), ఔరంగజేబు, షాజహాన్ కాలం నాటి కత్తులు ఇక్కడ కనిపిస్తాయి.

జై విలాస్ ప్యాలెస్‌లో ఒక భారీ గ్రంధాలయం కూడా ఉంది. దీనిలో వివిధ జోనర్‌లకు చెందిన సుమారు 5వేల పుస్తకాలు ఉన్నాయి. దీనిలోనే చిత్రంగదా రాజే ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తమ కళలను ప్రదర్శించాలనుకునే యువ కళాకారులకు ఇది చక్కని వేదిక.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.