
ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్ల నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికలతో పాటు అందరికీ విద్య అందించాలని తాలిబన్లకు సూచించింది. ఆఫ్ఘాన్‌లో ఆరో తరగతి దాటిన బాలికలు స్కూల్స్‌కు వెళ్లకుండా నిషేధం విధించారు తాలిబన్లు. గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత నుంచి అక్కడ స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. అయితే, గతవారం కాలేజీలు తిరిగి ఓపెన్ అయ్యాయి. వెంటనే చాలా మంది బాలికలు కాలేజీలకు వచ్చారు. కానీ, అక్కడ బాలికలు చదువుకోకూడదని హెచ్చరించడంతో తిరిగి స్కూల్స్, కాలేజెస్ మూసేశారు. అమ్మాయిల చదువు గురించి తాము తర్వాతి నిర్ణయం వెల్లడించేవరకు వాళ్లంతా ఇళ్లల్లోనే ఉండాలని, స్కూల్స్, కాలేజీలకు రాకూడదని తాలిబన్లు హెచ్చరించారు.
దీంతో ఆరో తరగతి దాటిన బాలికలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలి తాజా వ్యాఖ్యలు చేసింది. అందరితోపాటు బాలికల విద్యాహక్కును గౌరవించాలని తాలిబన్లకు సూచించింది. ఈ అంశంపై అక్కడి ప్రతినిధులతో మాట్లాడాలని, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో సహాయపడాలని ఐరాస కోరింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని మహిళా హక్కుల సంఘాలు కూడా తాలిబన్ల నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వారం రోజుల్లో విద్యా సంస్థల్ని తెరవకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించాయి.