కట్నం వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-27T06:08:10+05:30 IST

కట్నం వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

కట్నం వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య

కొమ్మాది, జూలై 26: కట్నం వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ దుర్గానగర్‌ ఎన్జీవోస్‌ కాలనీలో మారే రాజేశ్‌ భార్య ప్రసంగి  స్వప్న (31), ఏడాదిన్నర వయసున్న కుమారుడు నిషాన్‌తో  కలిసి నివసిస్తున్నాడు. అయితే భర్త రాజేశ్‌, అత్త విజయలక్ష్మి, ఆడపడుచు తరచూ అదనపు కట్నం కోసం  వేధిస్తుండడంతో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటప్పుడు ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకుని  స్వప్న ఆత్మహత్యకు పాల్పడింది. ప్రైవేటు షిప్పింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేశ్‌తో స్వప్నకు 2019లో పెళ్లయిందని, ఆ సమయంలో కట్న కానుకల కింద ఆమె తల్లిదండ్రులు రూ.పది లక్షలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. నాలుగు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగిందని, ఆ తర్వాత నుంచి స్వప్నను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టినట్టు ఆమె తల్లి ఫిర్యాదు చేశారన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో అరకు వెళ్లి తిరిగి వస్తూ కూర్మన్నపాలెంలో ఉంటున్న స్వప్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తల్లిదండ్రులు సర్దిచెప్పి మధురవాడ పంపారు. కాగా సోమవారం ఉదయం భర్త డ్యూటీకి వెళ్లిపోయాక స్వప్న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రాజేశ్‌ ఎన్నిమార్లు ఇంటికి ఫోన్‌ చేసినా స్వప్న లిఫ్ట్‌ చేయకపోవడంతో తన సోదరుడిని ఇంటికి  వెళ్లమని చెప్పాడు. అతను వెళ్లేసరికి బెడ్‌ రూమ్‌లో ఉరి వేసుకుని స్వప్న కనిపించడంతో ఆమె తల్లికి సమాచారం అందించి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఏసీపీ చుక్కా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.


Updated Date - 2021-07-27T06:08:10+05:30 IST