బాధితురాలి శవాన్ని తహసీల్దార్‌ టేబుల్‌పై ఉంచి కుమార్తెల నిరసన

ABN , First Publish Date - 2021-10-27T06:56:20+05:30 IST

భర్త పేరున ఉన్న భూమిని భార్య పేరున మార్చడానికి లంచం ఇవ్వాలట.. ఇదేం న్యాయం? అది కూడా లక్షల్లో మూట్టజెప్పాలట.. ఎందుకో..?

బాధితురాలి శవాన్ని తహసీల్దార్‌ టేబుల్‌పై ఉంచి కుమార్తెల నిరసన
లక్ష్మీదేవి మృతదేహం

లంచం ఇచ్చుకోలేక.. 

ఆగిన గుండె..

పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

బత్తలపల్లి, అక్టోబరు 26: భర్త పేరున ఉన్న భూమిని భార్య పేరున మార్చడానికి లంచం ఇవ్వాలట.. ఇదేం న్యాయం? అది కూడా లక్షల్లో మూట్టజెప్పాలట.. ఎందుకో..? కూలి చేసుకుని బతుక్కునేవాళ్లమనీ.. అంత ఇచ్చుకోలేమని వేడుకున్నా.. బతిమాలినా.. లంచావతారుడి గుండె కరగలేదు. తమ భూమి పరాయివాళ్ల వశమవుతుండడం.. భూమిని కాపాడుకోలేకపోతున్నానన్న మనోవేదనతో ఓ వృద్ధురాలి గుండె ఆగింది. అమ్మను పోగొట్టుకున్న ఆడబిడ్డల గుండె రగిలింది. తహసీల్దార్‌ టేబుల్‌పైనే ఆమె మృతదేహాన్ని ఉంచి, ఆందోళనకు దిగారు. అమ్మను చంపేశారంటూ గుండెలవిసేలా రోదించారు. పెట్రోల్‌ పోసుకుని, మూకుమ్మడిగా ఆత్మహత్యకు యత్నించారు. బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన కలకలం రేపింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ తల్లి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ కుమార్తెలు తల్లి శవాన్ని బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలోని తహసీల్దార్‌ టేబుల్‌పై ఉంచి, ఆందోళనకు దిగారు. మండలంలోని జలాలపురం గ్రామానికి చెందిన పెద్దన్న 50 ఏళ్లుగా సర్వేనెంబర్‌ 18డీలో 5.18 ఎకరాల భూమిని సాగు చేసుకుంటుండేవాడు. అతడు 2015లో అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి పేరుపై ఉన్న భూమిని తనపేరు మీద పాసుపుస్తకాలు చేయించాలని అతడి భార్య లక్ష్మీదేవి (63) రెవెన్యూ అధికారులను కోరింది. రెండుమూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం, వీఆర్వో నాగేంద్ర చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. వీఆర్వో నాగేంద్ర ‘నీ భర్త, తమ్ముడిని పిలుచుకు రావడంతోపాటు రూ.3లక్షలు డబ్బు ఇస్తే పాసుపుస్తకాలు నీ పేరుమీద చేయిస్తాన’ని చెప్పాడు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేననీ, కూలిపనులు చేసుకుంటూ జీవించేవాళ్లమని వీఆర్వోను ఎం త వేడుకున్నా కనికరించలేదు. ఆమె కుమార్తెలు కూడా వీఆర్వో నాగేంద్రను కలిసి, అడిగినంత డబ్బు ఇవ్వలేమనీ, రూ.40వేల దాకా ఇస్తామని వేడుకున్నా.. అంతతక్కువ మొత్తం తనకు వద్దని ఖరాకండిగా చెప్పాడని వారు వాపోయారు. తమ తండ్రి పేరుమీద ఉన్న పాసుపుస్తకాన్ని వీఆర్వో నాగేంద్ర తీసుకుని, అందులో తమ చిన్నాన్న శ్రీరాములు ఫొటో అతికించి, వారిపేరు మీద పాసుపుస్తకం ఇచ్చారని ఆరోపించారు. భూమి వివాదంతో లక్ష్మీదేవి తీవ్ర మనోవేదనకు గురై, అనారోగ్యం పాలైంది. దీంతో  ఆమెను కుమార్తెలు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మరణించడంతో కుమార్తెలు లింగమ్మ, నాగేంద్రమ్మ, రత్నమ్మ, బంధువులు ఆగ్రహం చెందారు. లక్ష్మీదేవి శవంతో అంబులెన్సలో బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ శవంతో ఆందోళనకు దిగారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వోలు లేకపోవటం, కార్యాలయానికి వెళ్లే ప్రధాన ద్వారానికి వీఆర్వోలు తాళాలు వేయడంతో ఆగ్రహించిన బాధితులు.. శవాన్ని తహసీల్దార్‌ చాంబర్‌లోకి తీసుకెళ్లి, టేబుల్‌పై ఉంచి వీఆర్వో నాగేంద్రను సస్పెండ్‌చేయాలని ఆందోళనకు దిగారు. శవాన్ని లోపలికి తెచ్చారని వీఆర్‌ఏలు బాధితులపై ఆగ్రహించడంతో తమ తల్లి మృతి చెందిందనీ, ఇక తాము బతికి ఉండటం ఎందుకంటూ ముగ్గురు కుమార్తెలు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించారు. దీంతో వీఆర్‌ఏలు, సిబ్బంది భయపడి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీహర్ష తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని, బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి బుధవారం రెవెన్యూ అధికారులతో మాట్లాడతానని ఎస్‌ఐ హామీ ఇవ్వగా.. వారు శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.



Updated Date - 2021-10-27T06:56:20+05:30 IST