ఉపాధి ప్రకటనల హోరులో జవాబుల్లేని ప్రశ్నలు

ABN , First Publish Date - 2022-06-21T06:35:14+05:30 IST

రాష్ట్రంలో పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి గురించి, కొత్తగా వస్తున్న ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ప్రతి రోజూ ఒక కొత్త సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు...

ఉపాధి ప్రకటనల హోరులో జవాబుల్లేని ప్రశ్నలు

రాష్ట్రంలో పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి గురించి, కొత్తగా వస్తున్న ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ప్రతి రోజూ ఒక కొత్త సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. పెట్టుబడిదారులు తెస్తున్న ప్రతి కోటి రూపాయల పెట్టుబడి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నది? ఈ పెట్టుబడి రప్పించడం కోసం ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇస్తున్న రాయితీలు ఎన్ని? ఏర్పడుతున్న పరిశ్రమలు, సంస్థలలో ఈ రాష్ట్ర యువతకు దొరుకుతున్న అవకాశాలు ఎన్ని? ప్రైవేట్ పరిశ్రమల్లో, సంస్థల్లో రిజర్వేషన్లు లేవు గనుక ఏయే సామాజిక వర్గాల వారికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి? మహిళలకు, వికలాంగులకు ఏ మేరకు అవకాశాలు దొరుకుతున్నాయి? ఈ సంస్థల్లో కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? ఇక్కడ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఎంత? ఈ సంస్థలు కాలుష్య ప్రమాణాలను పాటిస్తున్నాయా? పారిశ్రామిక పార్కుల కోసం, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కోసం 2013 భూ సేకరణ చట్టం అమలు చేయకుండా ప్రభుత్వం గుంజుకున్న భూములు ఎన్ని? నష్టపోయిన నిర్వాసితులు ఎందరు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి జవాబులు కావాలి. 


2015 లో ‘టీఎస్ ఐపాస్’ పేరుతో తెరాస ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు, సంస్థలకు అనుమతులు ఇస్తామని చెప్పింది. ఒకవేళ నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయలేకపోతే, అనుమతి ఇచ్చినట్లుగానే భావించి సంస్థను మొదలెట్టవచ్చు అని కూడా ఈ విధానం ప్రకటించింది. పైగా రాష్ట్రంలో సంస్థలు నెలకొల్పేవాళ్ళకు భూ ధరలో రాయితీ, విద్యుత్ రాయితీ, పన్నుల మినహాయింపు లాంటి అనేక రకాల మద్దతులను కూడా ఈ విధానం ప్రకటించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకూ (2022–2023) మొత్తం 20,048 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 18056 సంస్థలు తయారీ రంగంలోనూ, 1992 సంస్థలు సేవా రంగంలోనూ అనుమతులు పొందాయి. మొత్తంగా 2,35,611కోట్లు పెట్టుబడులు పెడతామని ఈ సంస్థలు ప్రకటించాయి. ఈ అన్ని సంస్థలూ ఉత్పత్తి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే 16,60,113 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా ప్రకటన వెలువడింది. ఈ మొత్తం సంస్థల్లో సూక్ష సంస్థలుగా తయారీ రంగంలో 11,552, సర్వీసు రంగంలో 1273ఉన్నాయి. చిన్నతరహా సంస్థలు తయారీ రంగంలో 5258, సర్వీసు రంగంలో 420 ఉన్నాయి. మధ్య తరహా సంస్థలు తయారీ రంగంలో 487, సర్వీసు రంగంలో 64 ఆమోదం పొందాయి. పెద్ద తరహా సంస్థలు తయారీ రంగంలో 581, సర్వీసు రంగంలో 104 వచ్చాయి. భారీ సంస్థలు తయారీ రంగంలో 178, సర్వీసు రంగంలో 131 పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి.


‘టీఎస్ ఐపాస్’ ఫలితాల గురించి ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది. కానీ అనుమతులు పొందిన సంస్థల్లో 95.6 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలే (ఎమ్ఎస్ఎమ్ఇ) ఉన్నాయి. కేవలం 4.4శాతం మాత్రమే పెద్ద తరహా, భారీ సంస్థలు ఉన్నాయి. అంటే ఎమ్ఎస్ఎమ్ఇ సంస్థలు మాత్రమే అత్యధిక ఉపాధిని కల్పించాయి. పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నట్లు కనపడుతున్నా, కార్మికులకు, ఉద్యోగులకు రాష్ట్ర కనీస వేతనాలు అందడం లేదు. వీరెవ్వరికీ వేతనంతో కూడిన వారాంతపు సెలవులు లేవు. ఉద్యోగ భద్రత అసలు లేదు. ఈ రంగాల్లో కార్మిక సంఘాల ఉనికి కూడా లేదు. కార్మిక శాఖ అధికారులు ఈ సంస్థలను తనిఖీ చేసి, ఈ కార్మికులను ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. 


జిల్లాల వారీగా ‘టీఎస్ ఐపాస్’ కింద అనుమతి పొందిన సంస్థల లిస్టు సంస్థ వెబ్‌సైట్ మీద ఉంది. ఆయా జిల్లాల సామాజిక కార్యకర్తలు ఈ సంస్థల అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే నిజంగా ఎన్ని సంస్థలు కేవలం అనుమతి మాత్రమే పొందాయి, ఎన్ని సంస్థలు ఉనికిలోకి వచ్చాయి, అక్కడ ఎంతమంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు, వారికి కనీస వేతనాలు అందుతున్నాయా, అక్కడ కార్మిక చట్టాలను అమలు చేస్తున్నారా, స్థానికులు ఎంతమందికి ఉపాధి కల్పించారు... అన్న వాస్తవాలు తెలుస్తాయి. ఒకవేళ ప్రభుత్వం అసైన్డ్ భూములు గుంజుకుని పరిశ్రమలకు ఇస్తే, నిర్వాసితులకు పరిహారం అందిందా, ఇచ్చిన హామీలను అనుసరించి ఆయా కుటుంబాల్లోని సభ్యులకు ఎవరికయినా ఆ సంస్థలో ఉపాధి దొరికిందా అన్న విషయాలు స్పష్టంగా బయటకు వస్తాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లా సిద్దిపేటలో మొత్తం 1219.55కోట్లతో 89 సంస్థలు జిల్లాలో ఉత్పత్తి మొదలుపెడతామని, మొత్తం 5848 మందికి ఉపాధి కల్పిస్తామనీ అంగీకరించాయి. కానీ అందులో గత ఎనిమిదేళ్లల్లో నిజంగా ఉత్పత్తి ప్రారంభించినవి కేవలం 51 సంస్థలు మాత్రమే. అవి కల్పించిన ఉపాధి 1460 మందికి మాత్రమే. 


కొత్త పరిశ్రమలు తెస్తున్న పెట్టుబడి ప్రధానంగా రియలెస్టేట్, సోలార్ విద్యుత్ యూనిట్లను నెలకొల్పే రంగాలలోకి వస్తున్నది. 2015–2016, 2017–2018 సంవత్సరాల్లో పెట్టుబడులు ప్రధానంగా ఈ రెండు రంగాల్లోకి వచ్చాయి. అమెజాన్ కంపెనీ రాష్ట్రంలో ఆరు చోట్ల భారీ భవంతులను (ఒక్కొక్కటి 20వేల చదరపు మీటర్లు) నిర్మించబోతున్నది. ఈ ఆరుచోట్లా కలిపి ఈ కంపెనీ వందల కోట్ల పెట్టుబడులను కూడా తెస్తున్నది. కానీ ఈ కంపెనీ కల్పించే ఉపాధి 200 మందికి మించి లేదు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనపడే సంఖ్యలు అన్నీ శాశ్వత స్వభావం కలిగిన ఉద్యోగాలు కాదు. ఆయా స్థలాలలో నిర్మాణ పనులు జరిగినంత కాలం వారికి అక్కడ ఉపాధి ఉంటుంది. పైగా ఇతర రాష్ట్రాల నుంచి చవక కూలీలు వస్తే, ఈ కొద్దిపాటి ఉపాధి అవకాశాలు కూడా వారికే దొరక వచ్చు. 


‘టీఎస్ ఐపాస్’ కింద వస్తున్న సంస్థలన్నీ కేవలం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల చుట్టూ మాత్రమే కొలువు తీరుతున్నాయి. జిల్లాలలో ఏర్పడుతున్నవి చాలా తక్కువ. గ్రామాల నుంచి, వ్యవసాయం నుంచి జనాలను ఇతర రంగాలకు తరలించాలి అని మాట్లాడే వాళ్ళూ, పారిశ్రామికీకరణను ప్రజాప్రయోజనంగా భావించి అసైన్డ్ భూములను గుంజుకునేవాళ్ళూ.. రూరల్ జిల్లాలలో ఇతర రంగాల్లో దొరికే అతితక్కువ ఉపాధి అవకాశాలకు ఏం జవాబు చెబుతారు. వ్యవసాయం లాభదాయకంగా కొనసాగితే ఒక్కో ఎకరం కనీసం ఎనిమిది మందికి పనిని కల్పిస్తుందని ఒక అంచనా. కానీ వేలాది ఎకరాలను రైతుల నుంచి వివిధ పేర్లతో గుంజుకుని, కల్పిస్తున్న ఉపాధి ఎంత? 


రాష్ట్రంలో పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందాల్సిందే! కానీ మొత్తం గ్రామీణ, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ, అక్కడ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ, వారి ఆదాయాలు పడిపోయేలా చేస్తూ, వారిని అప్పుల ఊబిలోకి నెడుతూ ప్రభుత్వం ఏమి సాధించాలని భావిస్తున్నది? రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉందని చాలామంది వాదన. వాళ్ళలో ఇంకా సగం జనాభా గ్రామాలను విడిచి పెడితేనే, వ్యవసాయం లాభసాటి అవుతుందని కూడా వీళ్ళ అభిప్రాయం. నిరక్షరాస్యులైన, నైపుణ్యాల్లేని గ్రామీణ ప్రజలను పట్టణాలకు తెచ్చి ఏ రంగంలో ఉపాధి కల్పిస్తారు. నిజంగా గ్రామాల్లో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే వాళ్ళకు సాగు భూములు హక్కుగా లభిస్తే, వ్యవసాయం, అనుబంధ రంగాలు గిట్టుబాటు అయ్యే విధంగా విధానాలు రూపొందిస్తే, గ్రామాల్లోనే ఎక్కువ ఉపాధి దొరుకుతుంది. ఆ మేరకు నగరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. 


నిజంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర రంగాల్లో, ఇతర దేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు దొరికి మన యువత ఇక్కడి నుంచి బయటకు వెళితే బాగానే ఉంటుంది. కానీ ఆ స్థితి పెద్దగా కనపడటం లేదు. అందుకే రాష్ట్రంలో నెలకొల్పబడే ఏ సంస్థ అయినా, స్థానిక యువతకు 80శాతం ఉద్యోగాలు కల్పించగలిగితే, ఆ విధంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని మార్గదర్శకాలు రూపొందిస్తే మాత్రమే రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రాష్ట్రంలోకి వస్తున్న కంపెనీలు, సంస్థలు, వాటిలో వస్తున్న ఉపాధి అవకాశాలపై ఎప్పటికప్పుడు కార్మిక శాఖ స్థానిక యువతకు అవగాహన కల్పించగలిగితే ఉపయోగం. అలాగే కార్మిక చట్టాలను అన్ని సంస్థలు, కంపెనీలు అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖదే. అందువల్ల ఈ శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక 

Updated Date - 2022-06-21T06:35:14+05:30 IST