ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి..?

ABN , First Publish Date - 2021-04-22T05:18:04+05:30 IST

నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా గోడౌన్లు నిర్వహిస్తున్నారు. వీటిలో అతి స్వల్ప సంఖ్యలోనే అనుమతి పొందినవి ఉండగా, మిగిలినవన్నీ అనధికారికమే.

ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి..?
చిన్నబజారు ప్రాంతం

నెల్లూరులో విచ్చలవిడిగా అనధికార గోడౌన్లు

ఇళ్ల మధ్య, ఇరుకు సందుల్లో స్టాక్‌ పాయింట్లు

కార్పొరేషన్‌ ఉద్యోగుల అవినీతి, ఉదాసీనత

ప్రమాదాల నుంచి నేర్వని పాఠాలు

ఉన్నతాధికారులు పట్టించుకోరా?


నెల్లూరు (సిటీ), ఏప్రిల్‌ 21 : 

ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి?, ప్రజలు ఇంకెంతకాలం బిక్కుబిక్కుమంటూ బతకాలి? అనధికార గోడౌన్ల విషయంలో అధికారుల తీరుపై ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే. నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా గోడౌన్లు నిర్వహిస్తున్నారు. వీటిలో అతి స్వల్ప సంఖ్యలోనే అనుమతి పొందినవి ఉండగా, మిగిలినవన్నీ అనధికారికమే. పైగా ఇళ్ల మధ్య, ఇరుకు సంధుల్లో, నివాస గృహాల్లో భారీ ఎత్తున సరుకు నిల్వ చేస్తుండటంతో ప్రమాదాలు జరిగిన వేళ నష్టం తీవ్రంగా ఉంటోంది. చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యంత్రాంగం తీరులో మార్పు రావడం లేదు. అధికారుల ఉదాసీనత, అవినీతి, పాలకుల ఒత్తిళ్లే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నెల్లూరులోని చిన్న బజారు, పెద్ద బజారు, ఆచారివీధి, సుబేదార్‌పేట, రైల్వేఫీడర్స్‌రోడ్డు, సంతపేట, కనికల ఆసుపత్రి రోడ్డు, పప్పుల వీధి, రేబాలవారి వీధి, స్టోన్‌హౌస్‌పేట, శెట్టిగుంట్టరోడ్డు, బోడిగాడితోట, అశోక్‌నగర్‌, దోసకాలయ దిబ్బ, ప్రశాంత్‌నగర్‌, నవలాకుల తోట ప్రాంతాల్లో నివాసాల మధ్య కోకొల్లలుగా గోడౌన్లున్నాయి. వీటిల్లో పెయింట్లు, యాసిడ్‌, బ్లీచింగ్‌, పీవోపీ షీట్స్‌, ప్లాస్టిక్‌, ఫైబర్‌, వస్త్రాలు, ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచుతున్నారు. వీటికి సంబంధించిన దుకాణాలను ముఖ్య ప్రాంతాలు, ప్రధాన రహదారు లపై నిర్వహిస్తున్నారు. నివాస గృహాల పేరుతో కార్పొరేషన్‌ నుంచి అనుమతి పొంది నిర్మాణాలు చేపట్టి వాటిని గోదాములుగా వినియోగిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కింది అంతస్తులో సరుకు నిల్వ చేసుకుని... పై అంతస్తుల్లో యజమానులు కాపురం ఉండటంగానీ, అద్దెకు ఇవ్వడంగానీ చేస్తున్నారు. 


సిటీ ప్లానింగ్‌ చేతివాటం వల్లే....! 

నగరంలోని అత్యధిక శాతం గోడౌన్లు నివాస గృహాల్లోనే నడుస్తున్నాయి. ఇదంతా సిటీ ప్లానింగ్‌కు చెందిన ఆయా ప్రాంతాల టీపీఎస్‌లకు తెలిసినా భారీ మొత్తాల్లో ముడుపులు అందుతుండటంతో మిన్నకుండిపోతున్నారు. భవన నిర్మాణ సమయంలోనూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం చిన్నబజారులోని ప్లాస్టిక్‌ గోడౌన్‌, ఇటీవల బోడిగాడితోటలోని బాలాజీ కెమికల్స్‌కు చెందిన గోడౌన్‌, తాజాగా వెంకట సాయి కెమికల్స్‌కు చెందిన గోడౌన్లలో సంభవించిన ప్రమాదాలకు సిటీప్లానింగ్‌ అవినీతి, అనధికార అనుమతులే కారణంగా కనిపిస్తోంది. ఇందులో ఒక్క సిటీ ప్లానింగ్‌ విభాగమేకాదు నగర పాలిక ఆరోగ్య శాఖ పాత్ర కూడా ఉంది. గోదాముల నిర్వాహకుల నుంచి ట్రేడ్‌ లైసెన్సులు కటించలేకపోతోందన్న విమర్శలున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న గోడౌన్ల నుంచి ట్రేడ్‌ లైసెన్సు కట్టిస్తే కార్పొరేషన్‌కు భారీగా ఆదాయం సమకూరుతుంది, అలాగే అనధికార గోడౌన్లను నియంత్రించే అవకాశమూ ఉంటుంది. అయితే పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో మామూళ్లు పుచ్చుకుని అనధికార గోడౌన్లను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ప్రమాదాలకు పరోక్ష కారణమవుతు న్నారు. కార్పొరేషన్‌ ఆదాయానికీ గండికొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారు ల్లో చలనం లేకపోవడం, స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-04-22T05:18:04+05:30 IST