తెలిసినా తెలియనట్టే!

ABN , First Publish Date - 2021-04-21T04:24:50+05:30 IST

నగరంలోని బోడిగాడితోట సమీప ప్రాంతంలో మంగళ వారం సంభవించిన అగ్ని ప్రమాదం వెనుక అధికారుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఈ ఘటనలో నగర పాలక సంస్థకు చెందిన సిటీప్లానింగ్‌, ఆరోగ్య విభాగాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలిసినా తెలియనట్టే!
బోడిగాడితోట సమీపంలో అగ్నిప్రమాదం సంభవించిన భవనం

పేరుకు నివాస గృహం.. చేసేది వ్యాపారం

అనధికారికంగా గోడౌన్ల నిర్వహణ

సిటీప్లానింగ్‌, ఆరోగ్య విభాగం నిర్లక్ష్యం

బోడిగాడితోట ఘటనతో మరోసారి వెలుగులోకి


నెల్లూరు (సిటీ), ఏప్రిల్‌ 20 : నగరంలోని బోడిగాడితోట సమీప ప్రాంతంలో మంగళ వారం సంభవించిన అగ్ని ప్రమాదం వెనుక అధికారుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఈ ఘటనలో నగర పాలక సంస్థకు చెందిన సిటీప్లానింగ్‌, ఆరోగ్య విభాగాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జీ+3 భవనంలో గ్రౌండ్‌ ఫ్లోరును పార్కింగ్‌కు వదిలి మిగిలిన మూడంతస్తులు నివాస గృహాలుగా వాడాల్సి ఉండగా పార్కింగ్‌ ప్రాంతాన్ని నిబంధనలకు విరుద్ధంగా గోదాము మార్చి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఆ గోడౌన్‌లో కెమికల్స్‌ నిల్వ చేయడం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇళ్ల మధ్య గోదాముల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం కావడంతో వ్యాపారులు నివాస గృహాలనే గోడౌన్లుగా మారుస్తున్నారు. కార్పొరేషన్‌ అధికారులతోపాటు, స్థానిక సచివాలయ ఉద్యోగులకు ఇదంతా తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మామూళ్లకు అలవాటు పడి నిబంధనలకు విరుద్ధంగా ఉండే గోడౌన్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అది సెంటు... డోంట్‌ వర్రీ

బోడిగాడితోట ప్రాంతంలో తమ నివాసాల మధ్య ప్రమాదకరమైన రసాయనాలతో గోదాములున్నాయని, వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అనేక దఫాలు ఫిర్యాదు చేయగా ఇటీవల కార్పొరేషన్‌ అధికారులు తనిఖీ చేశారని, కెమికల్‌ గోదాముల నుంచి సెంట్‌ వాసన వస్తోందని, దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన ఘటనకు అధికారులు ఏం సమాధానం చెప్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ గోదాముల నుంచి వెలువడే కలుషిత నీటితో తాము అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి ఇలాంటి గోదాముల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


అన్నీ మాటలే... చేతల్లేవు

బోడిగాడితోటలో మంగళవారం ప్రమాదం జరిగిన భవనానికి ఎలాంటి కమర్షియల్‌ అనుమతులు లేనట్టుగా అగ్నిమాపక శాఖ తేల్చింది. నగర పాలక సంస్థ అనుమతులు ఇచ్చాక వాటి ఆధారంగా తాము అనుమతులు మంజూరు చేస్తామని, ఇలాంటివేవి ఇక్కడ లేవని ఆ శాఖ జిల్లా అధికారి గుర్తించారు. అంతేకాదు ఆ గోదాముకు ఆరోగ్య శాఖ నుంచి ట్రేడ్‌ లైసెన్సు కూడా లేదని తెలిసింది. బోడిగాడితోట సమీప ప్రాంతంలోనే ఇటీవలే బాలాజీ కెమికల్స్‌ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి కూడా ఎలాంటి అనుమతులు లేవని అప్పట్లో అధికారులు తేల్చారు. అటువంటి అనధికార గోదాములను సీజ్‌ చేస్తామని, ఇళ్ల మధ్య వాటి నిర్మాణాలు, వినియోగాన్ని ఏ మాత్రం ఒప్పుకోమని నాడు కార్పొరేషన్‌ అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. కానీ తాజా ఘటన వారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేటతెల్లం చేస్తోంది. 2019లో దీపావళి నాడు చిన్నబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ప్లాస్టిక్‌ గోదామునకు కూడా వాణిజ్యపరమైన అనుమతులు లేనట్టుగా అధికారులు తేల్చిన విషయం తెలిసిందే. ఇలా అనధికారిక గోడౌన్ల నిర్వహణ వెనుక అధికారులు, సిబ్బంది మద్దతు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-04-21T04:24:50+05:30 IST