మోయలేని భారం

ABN , First Publish Date - 2022-06-23T05:34:46+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం వచ్చినా ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు ఈ చట్టాన్ని భేఖాతారు చేస్తున్నాయి.

మోయలేని భారం

- ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత

- ఆదాయంలో 40శాతం చదువులకే

- ఫీజుల నియంత్రణ జీవో 91 అమలెక్కడా?

- విద్యా హక్కుచట్టానికి తూట్లు

- పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల ఇక్కట్లు


కామారెడ్డి టౌన్‌, జూన్‌ 22: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం వచ్చినా ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు ఈ చట్టాన్ని భేఖాతారు చేస్తున్నాయి. ఫీజులను అడ్డగోలుగా పెంచేస్తున్నా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం రోజురోజుకూ అధికమవుతోంది.

జీవో 91 కాగితాలకే పరిమితం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం జీవో నెం. 91ని జారీ చేసి ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో నియంత్రణ కొరవడింది. దీని ప్రకారం రెండు కేటగిరీల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను వేరుచేస్తూ రూ.8వేలు, రూ.12వేల ఫీజులుగా నిర్ణయించారు. కానీ ఈ ఫీజులను జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు పట్టించుకోవడం లేదు. రోజు కూలి నుంచి ఉన్నత ఉద్యోగుల దాకా తమ పిల్లలను పేరున్న ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించాలని తపనపడటం సహజం. తల్లిదండ్రుల ఆరాటాన్ని యాజమాన్యాలు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫీజుల మోత పదిరేట్లు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 20శాతం నుంచి 30శాతం పెంచేశారు. విద్యార్థుల ఇబ్బందులు తొలగించేందుకు తాము అండగా నిలుస్తామని పలు సందర్భాల్లో పేర్కొంటున్నా కొన్ని విద్యార్థి సంఘాలు ప్రైవేట్‌ యాజమాన్యాలు, కొందరు విద్యాశాఖధికారుల కనుసన్నల్లో పనిచేస్తూ వారు ఇచ్చింది పుచ్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే విద్యార్థి సంఘాల నాయకులు, విద్యాశాఖధికారుల దృష్టిలో పడితే ఇబ్బందులు పడుతామని భయం ఉండేది. కానీ ఇప్పుడు విద్యార్థి సంఘాల్లో కొందరు నాయకులు డబ్బుల కోసమే అన్నట్లుగా పని చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను తీర్చేవారే కరువయ్యారు. ఆదాయంలో 40శాతం పిల్లల చదువులకే ఖర్చు అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

ఉచిత సీట్ల కేటాయింపు ఏదీ?

పేద విద్యార్థులకు 25శాతం ఉచిత సీట్లను జిల్లాలోని ఏ ఒక్క ప్రైవేట్‌ పాఠశాల కేటాయించడం లేదు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలు బహిరంగంగానే అడ్మిషన్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధమైనా అడిగే వారే లేరు. పాఠశాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, క్రీడలు,పరీక్ష ఫీజు, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు అధికారుల ఆధ్వర్యంలోని కమిటీ కూర్చోని చర్చించకపోవడం గమనార్హం. ప్రైవేట్‌ బడుల్లో తప్పని సరిగా డీఈడీ, బీఈడీ ఆపై చదువులు చదివిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. చాలా వరకు ఈ నిబంధనలు ఏ పాఠశాలలోనూ లేవు.

నర్సరీకి రూ.10వేల నుంచి రూ.15వేలు

పాఠశాల స్థాయిని బట్టి విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రాధాన్యత తక్కువ ఉన్న పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీకి రూ.6వేలు, ఓ మోస్తారు పాఠశాలలో రూ.8వేలు డిమాండ్‌ అధికంగా ఉన్న పాఠశాలలో రూ. 10వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు రూ.20వేలపైనే తప్ప తక్కువ లేదు. ఇక యూనిఫాం, దుస్తులు, పుస్తకాలు, షూస్‌, టై, బెల్టులు కమీషన్‌ ఇచ్చే దుకాణాల్లో లేదంటే నేరుగా పాఠశాలలోనే అమ్మకాలు జరుపుతున్నారు. పాఠశాల పేర్లతో ముద్రించినవి కావడంతో తల్లిదండ్రులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.


అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం

- రాజు, డీఈవో, కామారెడ్డి

నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిన, పాఠశాలల్లో పుస్తకాలు అమ్మినా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. నిబంధనలను ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-06-23T05:34:46+05:30 IST