నిశ్చింతనివ్వని మిగులు ఆదాయం!

ABN , First Publish Date - 2020-10-06T05:50:30+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన ఎగుమతులు, దిగుమతుల కంటే అధికంగా ఉన్నాయి. ఎగుమతుల, దిగుమతి సమష్టి వర్తకాన్న...

నిశ్చింతనివ్వని మిగులు ఆదాయం!

దేశ ఆర్థికవ్యవస్థ 13 ఏళ్ళ తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రప్రథమంగా వర్తక మిగులును సాధించింది. కరెంట్ ఖాతా మిగులును కలిగి ఉన్నప్పటికీ మన ఆర్థికవ్యవస్థ స్థితిగతులు వాస్తవానికి సరిగ్గా లేవు. టిబి వ్యాధిగ్రస్థుడి పరిస్థితిని పోలినదే మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా. టిబి రోగి పెద్దగా తినలేడు. తత్కారణంగా ఆహారానికి అతడు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరముండదు. ఈ వెసులుబాటు అతని గృహబడ్జెట్‌లో ‘మిగులు’కు తోడ్పడుతుంది. కరెంట్ ఖాతా మిగులును ఆర్థికవ్యవస్థ సత్తువకు సూచకంగా తీసుకోవడం అవివేకమే అవుతుంది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన ఎగుమతులు, దిగుమతుల కంటే అధికంగా ఉన్నాయి. ఎగుమతుల, దిగుమతి సమష్టి వర్తకాన్ని ‘వర్తక సంతులనం’ అంటారు. దిగుమతుల కంటే ఎగుమతులు అధికంగా ఉండడాన్ని ‘వర్తక మిగులు’ అంటారు. 13 సంవత్సరాల అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రప్రథమంగా ఆ వర్తక మిగులును మనం సాధించాం. ఎగుమతులు మన డాలర్ నిల్వలను పెంచుతున్నాయి. దిగుమతుల అవసరాలకు మించి ఆ సంచితం అపారంగా ఉంది. 


వర్తక సంతులనం అనేది ‘కరెంట్ ఖాతా సంతులనం’ (కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్)లో భాగం. మన ఎగుమతులు, విదేశీ మదుపుదారులు మనదేశంలో చేస్తున్న మదుపుల నుంచి మనం డాలర్లను ఆర్జిస్తున్నాం. దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు, మన మదుపుదారులు ఇతర దేశాలలో చేస్తున్న మదుపులకు గాను డాలర్లను మనం విదేశాలకు పంపుతున్నాం. దీనిని ‘కరెంట్ ఎకౌంట్ రెమిటెన్సెస్’ అంటారు. మన ఎగుమతులు, మనదేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల నుంచి లభించే ఆదాయాన్ని కరెంట్ ఖాతా వసూళ్ళు (కరెంట్‌ అకౌంట్‌ రిసిప్ట్స్‌) అంటారు. రిసిప్ట్స్, రెమిటెన్సెస్ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ ఎకౌంట్ బ్యాలెన్స్’ కరెంట్ ఖాతా సంతులనం’మని అంటారు.


ఈ ఏడాది వర్తక మిగులు, కరెంట్ ఖాతా బ్యాలెన్స్ రెండూ అనుకూలంగా ఉన్నాయి. 2019–-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 1500 కోట్ల డాలర్లు. ఆ లోటు ఇప్పుడు అంటే 2020-–21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2000 కోట్ల డాలర్లతో మిగులుగా అంటే కరెంట్ ఖాతా మిగులుగా మారింది. మరి ఈ కరెంట్ ఖాతా మిగులును రక్షించుకుని, పెంపొందించుకోవడమే ఇప్పుడు మన ముందున్న సవాల్. 


ప్రస్తుత కరెంట్ ఖాతా మిగులు మన ఆర్థిక వ్యవస్థ ప్రధాన బలహీనతలను కప్పిపుచ్చుతున్నదనే వాస్తవాన్ని పలు అంశాలు సూచిస్తున్నాయి. వీటిలో మొదటిది మన దేశం నుంచి ముడిపదార్థాల ఎగుమతులు అధికం కాగా యంత్రనిర్మిత వస్తువుల ఎగుమతులు తగ్గిపోయాయి. ఒక అధికారిక నివేదిక ప్రకారం 2019 జూన్- 2020 జూన్ మధ్య ముడి ఇనుము ఎగుమతులు 63 శాతం, నూనెగింజల ఎగుమతులు 50 శాతం, బియ్యం ఎగుమతులు 33 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆభరణాల ఎగుమతులు 50 శాతం, తోలు ఉత్పత్తుల ఎగుమతులు 40 శాతం, జౌళి ఎగుమతులు 35 శాతం తగ్గిపోయాయి. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఆవిర్భవించడానికి బదులు మన దేశం రసాయనాలు, ఔషధాలు మినహా అన్ని ఎగుమతులలోనూ వెనుకబడిపోయింది. రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ‘వినియోగదారు విశ్వాస సూచీ’ 2019 మార్చిలో 100 పాయింట్ల నుంచి 2020 మార్చిలో 64 పాయింట్లకు, 2020 జూలైలో 54 పాయింట్లకు పడిపోయింది. దీన్ని బట్టి కొవిడ్ మహమ్మారి ప్రబలక ముందే సిసిఐ దిగజారిపోవడం ఆరంభమయిందని, ఆ పతనం కొనసాగుతూనే ఉందని స్పష్టమవుతోంది.


ప్రస్తుతం కరెంట్ ఖాతా మిగులు ఉన్నప్పటికీ మన ఆర్థికవ్యవస్థ స్థితిగతులు సరిగ్గా లేవనే వాస్తవాన్ని పైన పేర్కొన్న బలహీనతలు సూచిస్తున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే టిబి వ్యాధిగ్రస్థుడి పరిస్థితిని పోలినదే మన ఆర్థికవ్యవస్థ పరిస్థితి కూడా. టిబి రోగి పెద్దగా తినలేడు. తత్కారణంగా ఆహారానికి అతడు పెద్దగా ఖర్చు పెట్ట వలసిన అవసరముండదు. ఈ వెసులుబాటు అతని గృహ బడ్జెట్‌లో ‘మిగులు’కు తోడ్పడుతుంది. మొత్తంగా ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నప్పటికీ గృహబడ్జెట్ అతనికి ఊరటనిస్తుంది. ఇది మనకు విశదం చేస్తున్న సత్యమేమిటి? కరెంట్ ఖాతా మిగులును ఆర్థికవ్యవస్థ సత్తువకు సూచకంగా తీసుకోకూడదనే కాదూ? ఆ ‘మిగులు’ ఒక తాత్కాలిక పరిణామమే. ఆర్థిక వ్యవస్థ సౌష్ఠవం దిగసిల్లిపోవడాన్ని అది అడ్డుకోలేదు. సిసిఐ పతనం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. కొవిడ్ మహమ్మారి ప్రబలడానికి ముందు అంటే 2018-–19- 2019–-20 ఆర్థిక సంవత్సరాల మధ్య మన మొత్తం దిగుమతులు 5 శాతం మేరకు తగ్గిపోయాయి. చెప్పవచ్చేదేమిటంటే మన ఆర్థికవ్యవస్థ బలహీనతలు కరోనా విపత్తు కారణంగా ఉత్పన్నం కాలేదు. అవి పూర్తిగా వ్యవస్థీకృతమైనవి. 


మన ఆర్థికం మెరుగుపడాలంటే ఈ పరిస్థితులు మారాలి. అవి మారాలంటే ప్రభుత్వం యథాప్రకారం వ్యవహరించే ధోరణికి స్వస్తి చెప్పితీరాలి. సత్వరమే మూడు చర్యలు తీసుకోవాలి. తొలుత, మన విద్యా వ్యవస్థలో ఆంగ్ల మాధ్యమానికి, విదేశీభాషలకు ప్రాధాన్యమివ్వాలి. కంప్యూటర్, ఇంటర్నెట్ ఆధారిత సేవలకు ఆంగ్లభాషే ప్రాతిపదిక. సేవల ఎగుమతులకు విదేశీ భాషలే మూలాధారం. అయితే మనం ఇంగ్లీష్, ఇతర విదేశీభాషలకు కాకుండా తద్విరుద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఇంగ్లీష్‌తో సమకూరే ప్రయోజనాలను పణంగా పెట్టి స్థానిక భాషలకు ప్రాధాన్యమిస్తున్నాం. వాస్తవానికి ఆంగ్లభాషకు, మన మాతృభాషలకు సమ ప్రాధాన్యమివ్వాలి. మన సాంస్కృతిక సాధికారితను దృష్టిలో ఉంచుకుని మాతృభాషలకు, ఆర్థిక సాధికారితకు గాను ఆంగ్ల భాషకు ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. మన వస్తూత్పత్తి, వ్యవసాయ రంగాలలో సరికొత్త అధునాతన సాంకేతికతలను విరివిగా ప్రవేశపెట్టడం ప్రభుత్వం చేపట్టవలసిన రెండో చర్య. ఆ రంగాల సమగ్ర నవీకరణే లక్ష్యం కావాలి. నవీన సాంకేతికతల దిగుమతులకు సబ్సిడీ ఇచ్చే ఒక పథకాన్ని తక్షణమే ప్రారంభించాలి. లేని పక్షంలో మనం వెనుకబడిపోవడం ఖాయం. ఈ సబ్సిడీలు మన ఉత్పత్తి వ్యయాలను తగ్గించి అంతర్జాతీయస్థాయిలో సమర్థంగా పోటీపడగల సామర్థ్యాన్ని పునస్సంపాదించుకోవడానికి తోడ్పడతాయి. పాలనావ్యవస్థలో మౌలిక సంస్కరణలు ప్రభుత్వం చేపట్టవలసిన మూడోచర్య. ఇది అవశ్యం. ప్రభుత్వ యంత్రాంగంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టాలి. ఎంత సేపూ ప్రభుత్వాధికారులను తమకు అనుకూలం చేసుకొనేందుకు హైరానా పడడం కాకుండా తమ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరించే సౌలభ్యాన్ని, తీరుబాటును, పారిశ్రామిక వెత్తలకు కల్పించాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక పతనంలోకి ప్రవేశించిందనే వాస్తవాన్ని, కొవిడ్ మహమ్మారికి పూర్వమే ఎగుమతుల తగ్గుదల, వినియోగదారు విశ్వాస సూచీ పతనం స్పష్టం చేశాయి. ప్రస్తుత మన ఆర్థికఅవస్థలకు మహమ్మారి మాత్రమే కారణం కాదనే వాస్తవాన్ని అంగీకరించి తీరాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-10-06T05:50:30+05:30 IST