వివాహేతర బంధం బయటపడుతుందనే మామ హత్య

Sep 17 2021 @ 00:50AM
నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

ప్రియుడితో కలిసి మహిళ  ఘాతుకం

  ఇద్దరి అరెస్టు, రిమాండ్‌  

శాలిగౌరారం, సెప్టెంబరు 16 : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని మాధవ రం చెర్వు వద్ద ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన శ్యామల ముత్తయ్య (54) హత్య కేసు మిస్టరీ వీడింది. తన వివాహేతర సంబంధం బయట పడుతుందని ప్రియుడితో కలిసి కోడలే ఆయనను హత్య చేసింది.  మహిళ ను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ  డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల నర్సింహ – శైలజ దంపతులు, గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సిగం మహేష్‌లు బాతులు పెంచుతూ జీవిస్తున్నారు. వీరందరూ శాలిగౌరా రం పరిధిలోని మాధవరం చెర్వు వద్ద గుడిసెల్లో నివసిస్తున్నారు. మహేష్‌,  శైలజ సొంత అన్న బావమరిది, నర్సింహకు స్నేహితుడు. దీంతో తరుచూ ఇంటికి రావటంతో ఐదు నెలల క్రితం మహేష్‌కు, శైలజకు వివాహేతర సంబంధం ఏర్పడింది.  సోదరి ఇంట్లో శుభకార్యం ఉండటంతో  నర్సింహ ఈనెల 11వ తేదీ కరీంనగర్‌ వెళ్లాడు. రాత్రి సమయంలో కుక్కలు మెరిగాయి. నిద్రలో ఉన్న నర్సింహ తండ్రి నిద్రలేచి చూడగా  శైలజ,  మహేష్‌ చను వుగా ఉన్నారు. ఈ విషయాన్ని పెద్దమనుషుల్లో పంచాయితీ పెడతానని  కోడలు శైలజను ముత్తయ్య హెచ్చరించాడు. వివాహేతర సంబంధం బయటపడుతుందని ముత్తయ్య మొఖంపై శైలజ, మహేష్‌లు దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. గుండెపోటుతో మృతి చెందినట్లు  చిత్రీకరించారు. ముత్తయ్య మృతదేహాన్ని స్వగ్రామం లక్ష్మీదేవిగూడెం తీసుకువెళ్తుండగా మెడపై ఉన్న గాయాలను బంధువులు, కుటుంబ సభ్యులు గుర్తించి శైలజను నిలదీశారు. దీంతో అసలు విషయాన్ని ఆమె చెప్పి పారి పోయింది. తండ్రి హత్యపై ముత్తయ్య కుమారుడు నర్సింహులు  పోలీ సులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో  ఈ నెల 15న మాధవరం సర్పంచ్‌ ఎదుట శైలజ, మహేష్‌ లొంగిపోయారు. సర్పంచ్‌ సమాచారంతో శైలజ, మహేష్‌లను పోలీసులు అరెస్టు చేసి, నిందితుల నుంచి  బైక్‌,   రెండు సెల్‌ఫోన్లు, హత్యకు వినియోగించిన దిండు, బెడ్‌ షీట్‌ను స్వాధీనం  చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ నాగదుర్గాప్రసాద్‌, ఎస్‌ఐ హరిబాబు, ఏఎస్‌ఐ ముజీబ్‌, సిబ్బంది పాల్గొన్నారు.  Follow Us on: