ltrScrptTheme3

ఇదేనా సభ్యత.. అదుపుతప్పిన YSR Congress దీక్షలు?

Oct 23 2021 @ 01:46AM
సీఐని నెట్టేస్తున్న కోదండరెడ్డి

  • నిరసనల పేరిట బండబూతులు
  • చెప్పులతో, కాళ్లతో చంద్రబాబు దిష్టిబొమ్మపై దాడులు


 తిరుపతి, ఆంధ్రజ్యోతి : జిల్లాలో రెండు రోజులపాటూ జరిగిన వైసీపీ దీక్షల్లో పలువురు నాయకులు అదుపుతప్పి మాట్లాడిన తీరు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తోంది. టీడీపీ నాయకులు ముఖ్యమంత్రిని అసభ్యంగా ధూషించారని ఆరోపిస్తూ జనాగ్రహ దీక్షకు దిగిన వైసీపీ శ్రేణులు అంతకన్నా ఘోరంగా ప్రవర్తించడం విశేషం. కుప్పంలో ఒక నాయకుడు ‘ల’ కారాలతోనే బూతుల పంచాగం విప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కారు మీద బాంబు వేస్తామంటూ బెదిరింపులకు దిగారు. శుక్రవారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసు అధికారిపై ఏకంగా చేయి చేసుకున్నారు. తిరుపతిలో చంద్రబాబు దిష్టిబొమ్మకు పాడెగట్టి, చెప్పులతో కొట్టి అవమానించారు.


కుప్పంలో కారుకూతలు

కుప్పంలో గురువారం వైసీపీ నిర్వహించిన జనాగ్రహ దీక్షలో రెస్కో ఛైర్మన్‌ సెంధిల్‌ కుమార్‌ ప్రసంగిస్తూ చంద్రబాబుపై హద్దులు మీరి మాట్లాడారు. ప్రచురించడానికి వీలుకాని రీతిలో ‘లం.. కొడకల్లారా’ అంటూ పదేపదే సంబోధించారు. ఆ క్రమంలోనే తమ నేత పెద్దిరెడ్డి జోలికొస్తే కారుపై బాంబు వేస్తానంటూ హెచ్చరించారు. సెంధిల్‌ ప్రసంగం సభ్యతా సరిహద్దులు దాటేసిన వైనం గుర్తించిన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మైకు లాక్కునేందుకు యత్నించారు. అయితే ఎంపీ చేతిని కూడా నెట్టేసి మరీ సెంధిల్‌ తన ప్రసంగం కొనసాగించారు. చంద్రబాబు కారుపై బాంబు వేస్తానంటూ హెచ్చరించడంతో వ్యవహారం శృతిమించుతోందని గ్రహించిన ఎంపీ రెడ్డెప్ప అతని చేతి నుంచీ మైకు లాగేసుకున్నారు. సంబంధిత వీడియోల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారమైతే సెంధిల్‌పై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళిన టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగాయి. టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించడంతో ఇరువర్గాలనూ చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఆ సందర్భంగా సీఐ సాదిక్‌పై వైసీపీ నేత కోదండరెడ్డి చేయి చేసుకోవడం ఆ పార్టీ వర్గాల దౌర్జన్యపు తీరును జిల్లాకు చాటినట్టయింది. 32 ఏళ్ళుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన చంద్రబాబు పట్ల సెంధిల్‌ మాట్లాడిన తీరుపై నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా సామాన్యజనంలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కుప్పం నియోజకవర్గాన్ని పనిష్మెంట్‌ ఏరియా నుంచీ పర్యాటక కేంద్రంగా మార్చిన చంద్రబాబు పట్ల వైసీపీ నేతల తీరు తీవ్ర అభ్యంతరకరంగా వుందన్న అభిప్రాయం ఆ ప్రాంత జనంలో వినిపిస్తోంది.


తిరుపతిలో చేతలు

ఇక తిరుపతిలో వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి చేతల్లో అవమానించారు. గురువారం వైసీపీ జనాగ్రహ దీక్షా శిబిరం వద్ద ఆ పార్టీకి చెందిన మహిళలు కొందరు చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, కాళ్ళతో తన్ని అవమానించారు. నాయకులు తమ ప్రసంగాల్లో టీడీపీ యువనేత నారా లోకే్‌షను పప్పు.. పప్పు అంటూ పదేపదే ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఇక శుక్రవారమైతే మళ్ళీ లోకే్‌షను ఉద్దేశించి అదే పదజాలంతో అవమానించారు. అంతే కాకుండా చంద్రబాబు చిత్రపటం ఉన్న దిష్టిబొమ్మకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా ఓ కార్యకర్తకు లోకేష్‌ ఫోటో వున్న బ్యానర్‌ను చుట్టి దిష్టిబొమ్మకు అంతిమ సంస్కారాలు చేయించారు. మానవీయ విలువల గురించి సభలు నిర్వహించే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో రెండోరోజు కార్యక్రమాలు జరగడం విశేషం. వ్యక్తిగతంగానూ, రాజకీయాల్లోనూ విలువలు పాటించే వ్యక్తిగా పేరుపడిన ఆయన సమక్షంలోనే వైసీపీ శ్రేణులు సభ్యత మరిచి వ్యవహరించడం నగరంలో చర్చనీయాంశమైంది. మొత్తంమీద రెండు రోజుల పాటు వైసీపీ శ్రేణులు జనాగ్రహ దీక్ష సాగించిన సందర్భంగా వ్యవహరించిన తీరు జిల్లాలో మెజారిటీ ప్రజలను అసంతృప్తికి, ఆవేదనకు గురిచేసిందనే చెప్పాలి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.