మోదీ, కేసీఆర్‌ పాలనలో.. ఆదివాసీల బతుకు దుర్భరం

ABN , First Publish Date - 2022-08-10T09:25:17+05:30 IST

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పాలనలో ఆదివాసీల బతుకులు దుర్భరంగా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మోదీ, కేసీఆర్‌ పాలనలో.. ఆదివాసీల బతుకు దుర్భరం

11 నెలల్లో అధికారంలో వస్తాం

గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తాం: రేవంత్‌


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పాలనలో ఆదివాసీల బతుకులు దుర్భరంగా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనులను ఉద్ధరిస్తామంటూ చేసిన వాగ్దానాలను కేసీఆర్‌, మోదీ నిస్సిగ్గుగా తుంగలో తొక్కారని విమర్శించారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేవంత్‌రెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీలు, గిరిజనులంటేనే అడవి ఒడిలో విచ్చుకున్న గడ్డి పూలలాంటి వారని.. వీరికి జీవనాధారం అడవులేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సింది పోయి.. అడవుల్లోంచి  తరిమికొట్టడానికి తమ తెలివి తేటలు, అధికారం ఉపయోగిస్తుండటం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రత్యేత తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. ఆదివాసీ, గిరిజనుల జీవితాల్లో మార్పు రాకపోవడం బాధకరమన్నారు. అధికారంలోకి వస్తే గిరిజనులకు 12ు రిజర్వేషన్‌ అమలు చేస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్‌ అనేక సార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌-ప్లాన్‌ను కేసీఆర్‌ సర్కార్‌ తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 65 వేల కోట్లను దారి మళ్ళించి దళిత, గిరిజనులను మోసగించిందన్నారు. రాష్ట్రంలో గిరిజనుల విద్యాభివృద్ధికి, చరిత్ర, సంస్కృతి పురోభివృద్ధికి, విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో ఒక గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని.. ఏళ్లు గడిచినా.. ఆ హామీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. రాష్ట్రంలో 11 నెలల్లో  కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు గిరిజనులకు ప్రతి ఎకరంపై హక్కులు కల్పిస్తామన్నారు. ఆ భూములకు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. 

Updated Date - 2022-08-10T09:25:17+05:30 IST