వైసీపీ పాలనలో.. రాష్ట్రం నాశనం

ABN , First Publish Date - 2022-04-22T08:18:28+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానిని పునర్నిర్మించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి పనిచేయాలని పిలుపిచ్చారు. తటస్థులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. పార్టీకి కొత్త రక్తం కావాలన్నారు.

వైసీపీ పాలనలో.. రాష్ట్రం నాశనం

పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

రాష్ట్ర భవిష్యత్‌ కాంక్షించే 

తటస్థులూ.. టీడీపీలోకి రండి

గొప్పలు చెప్పి పదవులు కొట్టే రోజులు పోయాయ్‌!

నేతల సామర్థ్యం అంచనాకు విధానం రూపొందిస్తున్నాం

బాగా పనిచేసినవారికి సిఫారసులు లేకుండా ఇస్తాం: బాబు

ఈ దఫా 40% సీట్లు యువతకే

చంద్రబాబు వెల్లడి

ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం


అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానిని పునర్నిర్మించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి పనిచేయాలని  పిలుపిచ్చారు. తటస్థులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. పార్టీకి కొత్త రక్తం కావాలన్నారు. ప్రవాసాంధ్రులు, వివిధ రంగాల్లో నిపుణులు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేయలేకపోయినా.. తమ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసే పాత్ర పోషించాలని.. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా గురువారమిక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘పార్టీ నేతలు నా వద్దకు వచ్చి గొప్పలు చెప్పి పదవులు కొట్టేసే రోజులు పోయాయి. వారి పనితీరు, సామర్థ్యాన్ని విశ్లేషించడానికి విధానం రూపొందిస్తున్నాం. పార్టీలో ప్రతి సభ్యుడికీ  డిజిటల్‌ కార్డు ఇస్తున్నాం. దానిపై నంబర్‌ కొట్టగానే పార్టీలో అతడి చరిత్ర మొత్తం మాకు కనిపిస్తుంది. ఎప్పటి నుంచి సభ్యుడు.. గతంలో ఏయే పదవులు చేశాడు.. అతడి నివాస ప్రాంతంలోని పోలింగ్‌ బూత్‌లో గత రెండు ఎన్నికల్లో పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి.. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో ఎన్ని సార్లు పాల్గొన్నారనే విషయాలన్నీ వస్తాయి. ఈ సమాచారమంతా సేకరించి నిక్షిప్తం చేస్తున్నాం.


బాగా పనిచేసిన వారికి ఒక్కోసారి పదవులు ఇవ్వలేకపోయాం. దానివల్ల వారిలో మనోవేదన కలుగుతోంది. ఇక ఎవరి సిఫారసూ లేకుండా పార్టీలో పదవులు ఇస్తాం. సిఫారసులు చేయడం తప్పు కాదు. కానీ అదే అర్హత కాకూడదు. సీనియర్లను గౌరవిస్తాం. అదే సమయంలో వారి వల్ల పార్టీ బలోపేతం కావాలి. ఈసారి ఎన్నికల్లో 40% సీట్లు యువతకు ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గాన్నీ కొన్ని క్లస్టర్లు, యూనిట్లు, పోలింగ్‌ బూత్‌లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వంద మంది ఓటర్లకూ ఒక బాధ్యుడిని పెడుతున్నాం. అవసరమైనప్పుడు కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రత్యేకంగా సర్వీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. పార్టీ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించడం ఆపద సమయాల్లో చాలా ఉపయోగపడింది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్తలను ఆర్థికంగా నిలబెట్టడంపై కూడా ఆలోచన చేస్తున్నాం. దేశంలో ఏ పార్టీ కార్యాలయంలో లేని మాదిరిగా మన పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులను గౌరవిస్తున్నాం. రాగానే టీ ఇస్తున్నాం. భోజన సమయానికి ఉంటే భోజనం పెట్టి పంపిస్తున్నాం. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అది మానలేదు. లక్షల కోట్లు సంపాదించిన వారు కూడా ఈ పని చేయలేకపోయారు’ అని చెప్పారు.


డిజిటల్‌ కరెన్సీతో అవినీతి అంతం!

రాజకీయాల్లో అవినీతి తగ్గించడానికే పెద్ద నోట్లు వద్దని చెప్పామని చంద్రబాబు అన్నారు. రూ.500, 1,000, 2,000 నోట్లు రద్దు చేస్తే ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గిపోతుందని చెప్పారు. ఐదేళ్లు శ్రమించి పనిచేసి చివర్లో డబ్బు మూటలు పట్టుకుని వచ్చేవాడిని చూసి కార్యకర్తలు భయపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. డిజిటల్‌ కరెన్సీ వస్తే అవినీతి పూర్తిగా అంతమై పోతుందని.. డబ్బు ఎవరిచ్చారో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తోందో మొత్తం రికార్డవుతుందని చెప్పారు. ఒంగోలులో నిర్వహించే మహానాడులో ఒక రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు మహానాడు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి ఇప్పుడు టీడీపీ అవసరం ఏమిటి.. టీడీపీ సాధించిన విజయాలు ఏమిటో వచ్చే ఏడాది పాటు ప్రచారం చేస్తామని చెప్పారు. 


రూపాయి నుంచి ఎంతైనా విరాళం!

టీడీపీ విధానాల ద్వారా లబ్ధి పొందిన ఐటీ నిపుణుల వంటి వారు తమ వేతనాల నుంచి నెలకు వందో, రెండు వందలో విరాళమివ్వాలని చంద్రబాబు కోరారు. ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా అని మేం పిలుపిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్‌ను వాంఛించే వారంతా వచ్చి చేరండి’ అని కోరారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకునే సమయంలోనే విరాళం కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. ‘మనకు దొంగ పేపర్‌, దొంగ టీవీ లేవు. 70 లక్షల మంది కార్యకర్తలు, వారి ఆదరణ మాత్రం ఉన్నాయి. ఒక తాపీ మేస్త్రీ ఇవాళ తన ఒక రోజు సంపాదన రూ.700 విరాళమిచ్చారు. అందరూ రూపాయి నుంచి ఎంతైనా విరాళమివ్వాలని కోరుతున్నాం’ అని అన్నారు. సభ్యత్వ నమోదు ప్రారంభించిన తొలి నిమిషంలోనే 8,765 మంది ఆన్‌లైన్‌లో చేరారని వెల్లడించారు. కాగా.. టీడీపీ సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాలతో పని లేకుండా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సభ్యత్వం చేరే విధానాన్ని ఈసారి ఆ పార్టీ చేపట్టింది. ఉండవల్లి గ్రామ టీడీపీ కమిటీ నుంచి చంద్రబాబు మొదటి సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో లోకేశ్‌, అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు తీసుకున్నారు.


అండమాన్‌ కమిటీకి రాష్ట్ర హోదా

కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్‌లోని టీడీపీ కమిటీకి రాష్ట్ర కమిటీ హోదా ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అక్కడ నాయకులు సాధిస్తున్న ఫలితాలు, పనితీరును మెచ్చి ఈ ప్రమోషన్‌ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 


సీఎం కాన్వాయ్‌ కోసం కార్లు లాక్కుపోతారా?

కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్తున్న వేముల శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుంచి ఒంగోలు పోలీసులు కారు లాక్కుని పోయిన సంఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి పర్యటనకు కాన్వాయ్‌ కోసం రోడ్డు మీద ఏ కారు ఉంటే దానిని లాక్కుపోతారా? ఊరుగాని ఊర్లో రోడ్డు మీద వదిలేసి కారు తీసుకుపోతే ఆ కుటుంబం ఎటు పోవాలి? ఏమిటీ అరాచకం? రేపు ఇళ్లలో ఉన్న ఆడపిల్లలను కూడా ఇలాగే లాక్కుపోతారేమో’ అని ధ్వజమెత్తారు. ఉద్యోగం దొరికే ఆశ లేక కిరాణా దుకాణం పెట్టుకున్నానని నెల్లూరుకు చెందిన విష్ణువర్ధన్‌ ఆన్‌లైన్‌లో చంద్రబాబుకు చెప్పారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఏదో ఒక ఉపాధి  చూసుకొని మంచి పని చేశావని ఆయన అభినందించారు. ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ అరాచకాలకు భయపడి ఆ తర్వాత ఎవరూ రాకుండా పారిపోయారు. ప్రైవేటు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ ్జకేలెండర్‌ లేదు. నిరుద్యోగ భృతి లేదు. విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి విదేశీ విద్య పథకం లేదు. యువతను ఘోరంగా మోసం చేశారు’ అని విమర్శించారు.

Updated Date - 2022-04-22T08:18:28+05:30 IST