అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణవార్త నిజం కాదు!

ABN , First Publish Date - 2021-05-07T22:40:54+05:30 IST

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణవార్త నిజం కాదు!

న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కోవిడ్-19తో బాధపడుతున్న ఆయనను ఏప్రిల్ 26న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో చేర్పించి, చికిత్స చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన శుక్రవారం ప్రాణాలు కోల్పోయారని జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, కాసేపటి తర్వాత ఎయిమ్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ శుక్రవారం తెలిపిన సమాచారం ప్రకారం, ఛోటా రాజన్ మరణించలేదు, ఆయన సజీవంగానే ఉన్నారు. 


ఛోటా రాజన్‌ను 2015లో అరెస్టు చేసి, న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉంచారు. అక్కడే ఆయనకు కోవిడ్-19 సోకడంతో ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. 


రాజన్‌పై సుమారు 70 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. వీటిలో దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేశారు. వీటిపై విచారణ కోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేశారు. 


ముంబైలో 2011లో ఓ జర్నలిస్టును హత్య చేసినట్లు నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో ఛోటా రాజన్‌కు 2018లో జీవిత ఖైదు విధించారు. అయితే హనీఫ్ లక్డవాలా హత్య కేసులో రాజన్, ఆయన సహచరుడు నిర్దోషులని ఇటీవలే ముంబైలోని సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. 


Updated Date - 2021-05-07T22:40:54+05:30 IST