కుర్రాళ్ల భారీ గెలుపు

ABN , First Publish Date - 2022-01-24T08:14:52+05:30 IST

అండర్‌-19 ప్రపంచక్‌పలో తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను యువ భారత్‌ అదిరిపోయేలా ముగించింది. శనివారం ఉగాండాతో నామమాత్రమైన

కుర్రాళ్ల భారీ గెలుపు

యువ భారత్‌ చేతిలో ఉగాండా చిత్తుచిత్తు

తరౌబా (వెస్టిండీస్‌): అండర్‌-19 ప్రపంచక్‌పలో తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను యువ భారత్‌ అదిరిపోయేలా ముగించింది. శనివారం ఉగాండాతో నామమాత్రమైన వన్డేలో ఏకంగా 326 పరుగుల తేడాతో భారీవిజయం సాధించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇదే అతి పెద్ద గెలుపు. దీంతో గ్రూప్‌ ‘బి’లో టాపర్‌గా నిలిచిన భారత్‌ ఈనెల 29న జరిగే క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అలాగే ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గానూ రాజ్‌ బవా (108 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 నాటౌట్‌) నిలిచాడు. ఓపెనర్‌ రఘువంశీ (120 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 144) కూడా శతకం బాదడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీస్కోరు సాధించింది. ఈ ఇద్దరి బాదుడుకు 40 ఓవర్లకే స్కోరు 300 దాటింది. మూడో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఉగాండా 19.4 ఓవర్లలో 79 రన్స్‌కే కుప్పకూలింది. నిశాంత్‌కు 4 వికెట్లు దక్కాయి.

Updated Date - 2022-01-24T08:14:52+05:30 IST