విశ్వ విజేతలు మన కుర్రాళ్లు

ABN , First Publish Date - 2022-02-06T09:30:43+05:30 IST

అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత్‌ దిగ్విజయంగా ముగించింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో నెగ్గిన మన కుర్రాళ్లు..

విశ్వ విజేతలు మన కుర్రాళ్లు

భారత్‌ ఖాతాలో ఐదో టైటిల్‌

చెలరేగిన రాజ్‌ బవా, రవి, రషీద్‌ 

ఇంగ్లండ్‌ చిత్తు

అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌

ఈ టోర్నీ ఫైనల్లో ఉత్తమ గణాంకాలు (5/31) నమోదు చేసిన బౌలర్‌గా రాజ్‌ బవా

ఫైనల్లో డకౌట్‌ అయిన తొలి కెప్టెన్‌గా టామ్‌ ప్రెస్ట్‌ (ఇంగ్లండ్‌).


నార్త్‌ సౌండ్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత్‌ దిగ్విజయంగా ముగించింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో నెగ్గిన మన కుర్రాళ్లు.. రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ముందుగా భారత పేసర్లు రాజ్‌ బవా (5/31), రవి కుమార్‌ (4/34)ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్‌ రూ (95) ఒక్కడే పోరాడాడు. ఛేదనలో భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసి గెలిచింది. తెలుగు క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (50) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, నిశాంత్‌ సింధు (50 నాటౌట్‌), రాజ్‌ బవా (35) ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాజ్‌ బవా నిలిచాడు.


రవి, రాజ్‌ కలిసికట్టుగా..

 టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ముందుగానే బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరుతో భారత్‌పై ఒత్తిడి తేవాలనుకుంది. కానీ బరిలోకి దిగాక కుదేలైంది. భారత బౌలర్ల ధాటికి సూపర్‌ ఫామ్‌లో ఉన్న బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లడంతో కనీసం 50 పరుగులైనా చేయకముందే సగం వికెట్లు కోల్పోయింది. నాలుగో నెంబర్‌ బ్యాటర్‌ జేమ్స్‌ రూ మాత్రం క్రీజులో ఎదురొడ్డి నిలిచాడు. ముందుగా లెఫ్టామ్‌ పేసర్‌ రవి కుమార్‌ టాపార్డన్‌ను దెబ్బ తీశాడు. రెండో ఓవర్‌లోనే అద్భుత బంతితో ఓపెనర్‌ బెథెల్‌ (2)ను ఎల్బీ చేయగా తన తర్వాతి ఓవర్‌లో కెప్టెన్‌ ప్రెస్ట్‌ను డకౌట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ షాక్‌లో మునిగింది. అయితే మరో ఓపెనర్‌ జార్జి థామస్‌ మాత్రం ఉన్న కాసేపు ఎడాపెడా బౌండరీలు బాదాడు. కానీ పేసర్‌ రాజ్‌ బవా రాకతో సీన్‌ మారిపోయింది. వరుస ఓవర్లలో మిడిలార్డర్‌ వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. తొలుత.. జోరు మీదున్న థామ్‌సను అవుట్‌ చేసిన తను 13వ ఓవర్‌లో లక్స్‌టన్‌ (4), బెల్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లండ్‌ 47/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపటికే 17వ ఓవర్‌లో రెహాన్‌ అహ్మద్‌ (10)ను కూడా బవా అవుట్‌ చేశాడు. 


జేమ్స్‌ రూ పోరాటం

 ఓవైపు వికెట్ల పతనం సాగుతున్నా జేమ్స్‌ రూ మాత్రం పోరాటం ఆపలేదు. ఓ దశలో 120 రన్స్‌ కూడా కష్టమే అనిపించింది. కానీ తొమ్మిదో నెంబర్‌ బ్యాటర్‌ జేమ్స్‌ సేల్స్‌ సహకారంతో రూ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు ఊపిరిలూదాడు. సహచరులు తడబడిన చోట రూ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. ఆరంభంలో కుదురుకునేందుకు సమయం తీసుకున్నప్పటికీ.. 25వ ఓవర్‌ తర్వాత గేరు మార్చాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో 79 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. బ్యాక్‌పుట్‌, స్లాగ్‌ స్వీప్‌ షాట్లతో అతడు ఎదురుదాడికి దిగాడు. అటు సేల్స్‌ కూడా దీటుగా ఆడడంతో స్కోరు 200 ఖాయమనిపించింది. చివరికి 44వ ఓవర్‌లో రెండు వికెట్లతో పేసర్‌ రవి కుమార్‌ భారత్‌కు బ్రేక్‌నిచ్చాడు. డీప్‌స్క్వేర్‌ లెగ్‌లో రూ ఇచ్చిన క్యాచ్‌ను మొదట వదిలేసిన తాంబే.. ఆ వెంటనే ముందుకు డైవ్‌ చేస్తూ పట్టేయడంతో జట్టు సంబరాల్లో మునిగింది. థామస్‌ (0) డకౌట్‌ కాగా.. ఇక బవా ఐదో వికెట్‌గా జోషువా (1) వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ టోర్నీలో తొలిసారి ఆలౌటైంది.


సంక్షిప్త స్కోర్లు: 

ఇంగ్లండ్‌: 44.5 ఓవర్లలో 189 ఆలౌట్‌ (జేమ్స్‌ రూ 95, జేమ్స్‌ సేల్స్‌ 34 నాటౌట్‌, జార్జ్‌ థామస్‌ 27, రాజ్‌ బవా 5/31, రవికుమార్‌ 4/34);

భారత్‌: 47.4 ఓవర్లలో 195/6 (షేక్‌ రషీద్‌ 50, రాజ్‌ బవా 35, నిషాంత్‌ సింధు 50 నాటౌట్‌, హర్నూర్‌ సింగ్‌ 21, యశ్‌ ధుల్‌ 17, దినేశ్‌ బనా 13 నాటౌట్‌, జోషువా బోయ్డెన్‌ 2/24, జేమ్స్‌ సేల్స్‌ 2/51, థామస్‌ అస్పిన్‌వాల్‌ 2/42).


వన్డేల్లో భారత్‌ ఇలా..

1974లో తొలి వన్డే ఆడిన భారత్‌.. ఈ నలభై ఎనిమి దేళ్లలో ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో ఆదివారం  విండీస్‌తో జరిగే మ్యాచ్‌ భారత్‌ వన్డే చరిత్రలో ఎంతో ప్రత్యేకం కానుంది.  

ఆడిన మ్యాచ్‌లు : 999

విజయాలు : 518

పరాజయాలు : 431

టై :         9

ఫలితం తేలనివి :     44


మొతేరా స్టేడియంలో భారత జట్టు మధుర స్మృతులు..

1987లో సునీల్‌ గవాస్కర్‌ ఇక్కడే 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 

1994లో కపిల్‌దేవ్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సాధించాడు.

అశ్విన్‌ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

హర్భజన్‌ ఈ పిచ్‌పై  తొలిటెస్ట్‌ శతకాన్ని సాధించాడు.

వన్డేల్లో 18 వేల పరుగుల మార్క్‌ను సచిన్‌ టెండూల్కర్‌ ఈ మైదానంలోనే (2011లో ఆస్ట్రేలియాతో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌) అందుకున్నాడు. 

వీవీఎస్‌ లక్ష్మణ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేసింది ఇక్కడే.

Updated Date - 2022-02-06T09:30:43+05:30 IST