Advertisement

అండర్‌ కవర్‌ అవినీతి!

Jun 7 2020 @ 00:12AM

ఎన్‌టీఆర్‌ హయాంలో అసంతృప్తిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రోత్సహించినట్టుగా ఇప్పుడు వైసీపీలో అసంతృప్తిని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ప్రోత్సహిస్తున్నదో లేదో తెలియదు. జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా? అని రాజకీయ పరిశీలకులు ఆరా తీయడం మొదలెట్టారు. అధికార పార్టీలో నెంబర్‌ టూగా చలామణి అవుతున్న విజయసాయిరెడ్డి.. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు విభేదాలు లేవని తనంత తానుగా ప్రకటించుకున్నారు. అధికార పార్టీ శాసనసభ్యుల కంటే ఎంపీలలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికలనాటికి తెలుగుదేశం పార్టీతో అవగాహన ఉంటుందనీ, సీటు గ్యారంటీ అని హామీ ఇస్తే.. పది మందికిపైగా ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభంలో ప్రకటించారు. దీన్నిబట్టి అప్పటివరకు అధికార పార్టీలో అసంతృప్తి అసమ్మతిగా మారకపోవచ్చునన్నది  ఒక అభిప్రాయం.


ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అవినీతి కంటికి కనిపించని, కాగితాల్లో కనబడని విధంగా జరుగుతోంది. భవిష్యత్తులో ఎవరు ఎటువంటి విచారణ జరిపినా దొరక్కుండా సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. గతంలో ‘క్విడ్‌ ప్రో కో’కు పాల్పడినందున సీబీఐ విచారణలో దొరికిపోయారు. క్విడ్‌ ప్రో కో ద్వారా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవచ్చునని అప్పటివరకు ఎవరికీ తెలియదు. ఆర్థిక వ్యవహారాలలో తలపండినవారిని సైతం విస్మయానికి గురిచేసేలా క్విడ్‌ ప్రో కో విధానాన్ని అమలుచేశారు. అయితే కథ అడ్డం తిరగడంతో క్విడ్‌ ప్రో కో స్థానంలో మరో నూతన ఆవిష్కరణను ఇప్పుడు ప్రవేశపెట్టారు. ‘నేను అధికారంలో ఉన్నానా? ఒక్క రోజైనా సచివాలయానికి వెళ్లానా? ఫైళ్లపై సంతకాలు చేశానా? క్విడ్‌ ప్రో కోకు ఎలా పాల్పడగలను?’’ అని జగన్మోహన్‌రెడ్డి తరచుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలలో హేతుబద్ధత ఉంది. అయితే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫైళ్లపై కూడా సంతకాలు చేస్తున్నారు. ఈ కారణంగా క్విడ్‌ ప్రో కోకు పాల్పడితే అడ్డంగా దొరికిపోతారు. దీంతో మెదళ్లకు పదును పెట్టాల్సిన వాళ్లు పెట్టారు. అద్భుతమైన మార్గాన్ని ఆవిష్కరించారు. అదే దండోపాయం!


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మనం కూర్చున్న ఈ భవనానికి.. (అదే ప్రజావేదిక) చట్టబద్ధత ఉందా? నిబంధనలు,చట్టాలకు విరుద్ధంగా కట్టిన భవనం ఇది. అవినీతితో కట్టిన ఒక అక్రమ భవనంలో ఇంతమంది అధికారులం సమావేశమయ్యాం. అక్రమంగా నిర్మించిన భవనమని తెలిసి కూడా ఇక్కడ మీటింగ్‌ పెట్టుకున్నాం. మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలనేది ఆత్మపరిశీలన చేసుకోవడానికే మీటింగ్‌ ఇక్కడే నిర్వహించాలని చెప్పాను. అందరినీ ఇక్కడికి పిలిపించాను. ఇప్పుడు నేను ఆదేశాలు ఇస్తున్నాను. ఈ హాలులో ఇదే చివరి సమావేశం కావాలి. రేపు ఎస్పీల మీటింగ్‌ కాగానే.. ఎల్లుండి ఈ భవనాన్ని కూల్చి వేయాలి. అక్రమ కట్టడాలకు ఇదొక ఉదాహరణగా నిలవాలి’’ అని ప్రకటించారు. ఈ మాటలు విన్నవారందరూ ‘నిబంధనలు, చట్టాల పట్ల జగన్మోహన్‌రెడ్డికి ఎంత గౌరవమో!’ అని అచ్చెరువొందారు.


జగన్‌ పాలన ఎంత ధర్మబద్ధంగా ఉంటుందోనని భావించారు. ఏడాది గడిచేసరికి నాటి భీకర ప్రకటనలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. నిబంధనల గురించి అంత గంభీర ఉపన్యాసం ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి పాలనలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. న్యాయస్థానాలు తప్పుబడుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత రాష్ట్రంలో మరెక్కడా అక్రమ కట్టడం లేకుండా పోయిందా? అంటే అలా ఏమీ జరగలేదు. అది వేరే విషయం. ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా నిబంధనలు అనుమతించవని తెలిసినా.. గ్రామ సచివాలయ భవనాలకు వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రంగులు వేయించారు. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీల జెండా రంగులు వేయించడం సమ్మతం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసినా ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించినా, రంగులు తొలగించడానికి సిద్ధపడని జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోమారు చీవాట్లు పెట్టింది. కార్యనిర్వాహక వ్యవస్థ ఇచ్చే ఆదేశాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉందనీ, న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలను అమలుచేయాల్సిందేననీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.


చట్టాలు, నిబంధనలు తెలిసినవారు ఎవ్వరైనా న్యాయస్థానం ఇటువంటి తీర్పులే ఇస్తుందని భావిస్తారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకేమో ఆ మాత్రం ఇంగితం లేకుండా పోయింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడానికి దాదాపు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ రంగులను తొలగించడానికి మరో ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అనుమతించిన రంగులు వేయడానికి మరో వెయ్యి కోట్లు అవసరం కావొచ్చు. వెరసి న్యాయ సమీక్షలో చెల్లదని తెలిసి కూడా తీసుకున్న ఒక నిర్ణయానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారని భావించాల్సి ఉంటుంది. ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ ఖర్చును భరిస్తారా? సదరు ఆదేశాలను గుడ్డిగా అమలుచేసిన అధికారులు చెల్లిస్తారా? సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్‌రెడ్డి మాత్రమే! నిబంధనలు, చట్టాల గురించి గొప్పగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఏమి చెబుతారు? రంగుల వ్యవహారంలో హైకోర్టు ఇటీవల కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలకు మళ్లీ వైసీపీ జెండా రంగులు వేశారు.


దీన్ని ఏమి అనాలి? ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంతలా వెన్నెముక లేకుండా ఎందుకు తయారయ్యారో అర్థంకావడం లేదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సర్వీసులో చేరిన కొత్తలో గరంగరంగా అంటే కఠినంగా వ్యవహరిస్తారట. ఆ తర్వాత కొంతకాలానికి నరమ్‌ నరమ్‌ అయిపోతారట. అంటే మెత్తబడిపోతారని అర్థం. చివరకు రిటైరయ్యేనాటికి బేషరమ్‌గా అంటే సిగ్గు లేకుండా తయారవుతారట! అఖిల భారత సర్వీసు అధికారులే తమ గురించి ఈ వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు. సర్వీసు చివరి దశలో బేషరమ్‌గా మారడానికి కొంతమంది అధికారులు సిద్ధపడినా, ఇంకొందరు మాత్రం రిటైరయ్యే వరకు నిక్కచ్చిగానే బతుకుతారు. దురదృష్టవశాత్తు ఏపీలో ఇటువంటివారు కరువయ్యారు. సర్వీసును పొడిగింపజేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇందుకు చక్కటి ఉదాహరణ. రంగుల వ్యవహారాన్ని హైకోర్టు తప్పుబట్టిన తర్వాత, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించినా.. లెక్కలేకుండా మళ్లీ అవే రంగులతో జీవో జారీ చేసిన ఆమెను ఏమనాలి? ఈ జీవోను మళ్లీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత విజ్ఞత ప్రదర్శించాల్సిన ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఏమిటి? అక్కడ మళ్లీ చివాట్లు తినడం ఏమిటి? ఇంతకంటే బేషరమ్‌ ఏమి ఉంటుంది? మూడు నెలలపాటు పదవీకాలాన్ని పొడిగింపజేసుకోవడానికి ఇంతలా దిగజారాలా? ఇంత జరిగిన తర్వాత కూడా రైతు భరోసా కేంద్రాలకు మళ్లీ అవే రంగులు పూసిన అధికారులకు ఏ శిక్ష విధించాలి? నిబంధనలు అనుమతించని నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం వృథా కావడానికి కారకులైన అధికారులపై ఎవరు ఏ చర్యలు తీసుకోవాలి? ఈ అంశంపై ఎవరైనా న్యాయస్థానం తలుపు తట్టవచ్చు కదా? పోలవరం తదితర ప్రాజెక్టుల రివర్స్‌ టెండరింగ్‌ వల్ల మూడు వేల కోట్ల రూపాయల వరకు ఆదా చేశామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వ పెద్దలు రంగుల కోసం వృథా చేసిన మూడు వేల కోట్ల రూపాయలకు ఏమి సమాధానం చెబుతారు?


‘‘గత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారుగా? అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్కటి కూడా రుజువు చేయలేదేమిటి?’’ అని విలేఖరులు ప్రశ్నించగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా చేసిన మొత్తం అవినీతి కిందకే వస్తుందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ టెండర్‌ను ఆమోదించడం, తమకు కావలసిన వారికే కాంట్రాక్టు ఇచ్చుకోవడాన్ని సజ్జల వంటివారు ఎలా సమర్థించుకుంటారో తెలియదు. నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానంలో సమర్థించుకోవడానికి కోట్ల రూపాయలను న్యాయవాదులకు ఫీజులు కింద చెల్లిస్తున్నారు. అయినా ఒక్కటంటే ఒక్క కేసులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాలేదు. కోర్టు ధిక్కరణకు పాల్పడటాన్ని కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటివారు సమర్థిస్తున్నారంటే వారి బరితెగింపుని ఎలా అర్థం చేసుకోవాలి? సోషల్‌ మీడియా సైనికులను కాపాడుకుంటామని చెప్పిన విజయసాయిరెడ్డి.. శిక్షలు పడి జైళ్లలో ఉన్నవారిని పరామర్శించిన చరిత్ర తమది అని గొప్పగా ప్రకటించారు. అవునులే, 16 నెలల జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డి ఎంపీగా, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక అయినప్పుడు వారు ఇంతకంటే భిన్నంగా ఎలా మాట్లాడతారు! అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా, ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ చట్టబద్ధ పాలన అందించాలే గానీ ‘అంతా మా ఇష్టం’ అంటే కుదరదు!


అవినీతి నయా రూట్‌లో!

ఏడాది పాలన పూర్తిచేసుకున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మరో కోణం ఇప్పుడు బయటపడుతోంది. ‘నా ప్రభుత్వంలో అవినీతికి చోటులేదు’ అని జగన్మోహన్‌రెడ్డి పదే పదే ప్రకటించడంతో ‘నిజమే కాబోలు’ అని ప్రజలు కూడా నమ్మారు. ఏడాది గడిచేసరికి ఎక్కడ చూసినా అవినీతే అన్న భావన ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే మొహమాటం లేకుండా అనేక వ్యవహారాల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నారు. ‘తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు’గా పైస్థాయిలో అవినీతి సరికొత్త రూపు సంతరించుకోగా, కింది స్థాయిలో పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఇసుక దందా గురించి అధికార పార్టీ ఎమ్మెల్యేలే గళమెత్తుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక దందా వ్యవహారంలో ఏమీ చేయలేకపోతున్నామని సాక్షాత్తు మంత్రి కూడా వాపోతున్నారు. రీచ్‌ల నుంచి డిపోలకు వెళ్లేలోపే ఇసుక మాయం అయిపోతున్నదంటే అధికార పార్టీ నాయకుల చేతివాటం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ‘‘తెలుగుదేశం హయాంలో నాయకులు తిన్నప్పటికీ ప్రజలకు మాత్రం ఇసుక చవకగా లభించేది’’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇసుకతోపాటు మద్యం దందా కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులకు కల్పతరువుగా మారిపోయింది.


మద్యం షాపులలో చెత్త బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించడం వల్ల మద్యం మాఫియా ఏర్పడటానికి అవకాశం కల్పించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో తక్కువ ధరలకు లభిస్తున్న మంచి బ్రాండ్ల మద్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు మూతబడిన సారా బట్టీలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేసినప్పుడు కూడా మద్యం మాఫియా చెలరేగిపోయింది. ఇప్పుడు దశలవారీ మద్య నిషేధం అంటూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్రమ మద్యం వ్యాపారం మళ్లీ పుంజుకుంది. ఇసుక అనేది అధికార పార్టీ నాయకులకు కామధేనువుగా ఎప్పటి నుంచో మారిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కూడా తోడయ్యింది. ఈ రెండూ చాలవన్నట్టుగా పేదలకు ఇళ్ల స్థలాల పేరిట సేకరించిన భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగింది. నిజమైన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు అధికార పార్టీ పెద్దలు పాల్పడ్డారు. రైతుల నుంచి ముందే తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. రెట్టింపు ధరలకు ప్రభుత్వానికి ఆ భూములు అమ్ముతున్నారు. ‘కాదేది అవినీతికి అనర్హం’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది.


మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఈ తరహా అవినీతి జరుగుతుండగా.. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అవినీతి కంటికి కనిపించని, కాగితాల్లో కనబడని విధంగా జరుగుతోంది. భవిష్యత్తులో ఎవరు ఎటువంటి విచారణ జరిపినా దొరక్కుండా సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. గతంలో ‘క్విడ్‌ ప్రో కో’కు పాల్పడినందున సీబీఐ విచారణలో దొరికిపోయారు. క్విడ్‌ ప్రో కో ద్వారా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవచ్చునని అప్పటివరకు ఎవరికీ తెలియదు. ఆర్థిక వ్యవహారాలలో తలపండినవారిని సైతం విస్మయానికి గురిచేసేలా క్విడ్‌ ప్రో కో విధానాన్ని అమలుచేశారు. అయితే కథ అడ్డం తిరగడంతో క్విడ్‌ ప్రో కో స్థానంలో మరో నూతన ఆవిష్కరణను ఇప్పుడు ప్రవేశపెట్టారు. ‘నేను అధికారంలో ఉన్నానా? ఒక్క రోజైనా సచివాలయానికి వెళ్లానా? ఫైళ్లపై సంతకాలు చేశానా? క్విడ్‌ ప్రో కోకు ఎలా పాల్పడగలను?’’ అని జగన్మోహన్‌రెడ్డి తరచుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలలో హేతుబద్ధత ఉంది. అయితే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫైళ్లపై కూడా సంతకాలు చేస్తున్నారు.


ఈ కారణంగా క్విడ్‌ ప్రో కోకు పాల్పడితే అడ్డంగా దొరికిపోతారు. దీంతో మెదళ్లకు పదును పెట్టాల్సిన వాళ్లు పెట్టారు. అద్భుతమైన మార్గాన్ని ఆవిష్కరించారు. అదే దండోపాయం! ఏ వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో లెక్కలు వేశారు. ముందుగా గనుల వ్యాపారం వారి కంట్లో పడింది. వెంటనే దండోపాయాన్ని ప్రయోగించారు. గనుల శాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారుల ద్వారా బెదిరింపులకు దిగారు. ఈ వేధింపులు తట్టుకోలేకపోయిన గనుల యజమానులు కాళ్లబేరానికి వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పటినుంచో ఉన్న ఒక ల్యాటరైట్‌ గనిలో అనధికారికంగా వాటా తీసుకున్నారు. గత కొన్ని మాసాలుగా మూతపడిన ఆ గనిలో తిరిగి తవ్వకాలు ప్రారంభించారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లో ఇప్పుడు తవ్వకాలు మొదలయ్యాయి అని వార్తలు వచ్చాయి. గ్రానైట్‌ విషయానికి వస్తే చీమకుర్తి గుర్తుకు రాకుండా ఉంటుందా? ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గెలాక్సి గ్రానైట్‌ గనులలో కొన్నింటిలో 50 శాతం వాటాను అనధికారికంగా పొందారు.


మరికొన్ని కంపెనీల నుంచి నెలకు ఇంత అని కప్పం కట్టించుకుంటున్నారు. అనధికారికంగా వాటా పొందిన కంపెనీల కార్యకలాపాలను పెద్దలకు చెందిన నమ్మకస్థులే ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గ్రానైట్‌ క్వారీలు ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతరత్రా ముఖ్యులను అధికార పార్టీలో చేరాలని ఒత్తిడి చేశారు. వారు ససేమిరా అనడంతో విజిలెన్స్‌ అధికారులతో దాడులు చేయించి, వందల కోట్లను పెనాల్టీ కింద కట్టాలని నోటీసులు జారీ చేయించారు. కొన్ని క్వారీలకు విధించిన పెనాల్టీ ఎంత భారీగా ఉందంటే.. ప్రారంభం నుంచి ఇప్పటివరకు సదరు క్వారీలలో అంత టర్నోవర్‌ కూడా జరగలేదు. ఇప్పుడు చెప్పండి ఈ అవినీతిని ఎవరైనా రుజువు చేయగలరా? భారతదేశంలో అమలులో ఉన్న ఏ చట్టం మాత్రం ఇది అవినీతి అని నిర్ధారించగలదు? అధికారానికి భయపడి అప్పనంగా వాటాలు ఇచ్చేసుకున్న గనుల యజమానులు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పగలరా? చెప్పినా, వారు చెల్లిస్తున్నది నల్లడబ్బు కనుక రుజువు కాదు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి ప్రయత్నిస్తే తప్ప ఏ వ్యవస్థ కూడా ఈ తరహా అవినీతిని పట్టుకోలేదు. ఇంతటి వినూత్న మార్గంలో అవినీతికి పాల్పడుతున్నవారిని అభినందించకుండా ఎలా ఉండగలం? అందుకే అనుభవాలు గుణపాఠాలు నేర్పుతాయని అంటారు.


నాడు కాంగ్రెస్‌.. మరి నేడు?

ఈ విషయం అలా ఉంచితే, అధికార పార్టీలో అసమ్మతి స్వరాలు మొదలయ్యాయి. 50 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన జగన్మోహన్‌రెడ్డికి ఏడాదికే అసమ్మతి సెగ తగులుతుందని చాలా మంది ఊహించలేదు గానీ.. మెజారిటీకి, అసమ్మతికి సంబంధం ఉండదు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ సాధించనన్ని సీట్లను రాజీవ్‌గాంధీ గెలుచుకుని ప్రధానమంత్రి అయ్యారు. అయినా విశ్వనాథ ప్రతాప్‌సింగ్‌ రూపంలో ఆయనను అస మ్మతి వెంటాడి ఐదేళ్లు గడిచేసరికి అధికారం కోల్పోయేలా చేసింది. 1983లో ఎన్‌.టి.రామారావు కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఏడాది గడిచేసరికి నాదెండ్ల భాస్కర్‌రావు రూపంలో అసమ్మతి సెగ తగిలింది. రాజకీయాలు తెలియని ఎన్‌టీఆర్‌ అప్పట్లో శాసనసభ్యులకు పెద్దగా గౌరవం ఇచ్చేవారు కాదు. ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న కారణంతోపాటు ఇతరత్రా రాజకీయ కారణాల వల్ల అసమ్మతి ఊపందుకుని ఎన్‌టీఆర్‌ కొంతకాలంపాటు అధికారం కోల్పోయారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ నాటి అసమ్మతిని ప్రోత్సహించారు. ప్రజలలో తిరుగుబాటు రావడంతో కోల్పోయిన అధికారాన్ని ఎన్‌టీఆర్‌ తిరిగి పొందారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి విషయానికి వస్తే.. ఆయన కూడా శాసనసభ్యులను పెద్దగా ఖాతరు చేయడం లేదు. ఇంతవరకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ లభించని ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. ఆ మాటకొస్తే మంత్రులు కూడా జగన్మోహన్‌రెడ్డి వద్ద బిక్కుబిక్కుమంటూ ఉంటారు.


కారణం ఏమైనప్పటికీ పార్టీలో సీనియర్లు స్వరాన్ని సవరించుకోవడం మొదలెట్టారు. ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు మొదలెట్టారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు సైతం అసంతృప్తిని వ్యక్తంచేయడం మొదలైంది. గ్రామ వలం టీర్లకు ఉన్న అధికారం కూడా ఎమ్మెల్యేలకు లేకుండా పోయిం దని శాసనసభ్యులు కొందరు వాపోతున్నారు. సొంత కారణాలు కూడా తోడవడంతో అసంతృప్తి స్వరాల సంఖ్య పెరుగుతోంది. ఎన్‌టీఆర్‌ హయాంలో అసంతృప్తిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రోత్సహించినట్టుగా ఇప్పుడు వైసీపీలో అసంతృప్తిని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ప్రోత్సహిస్తున్నదో లేదో తెలియదు. జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా? అని రాజకీయ పరిశీలకులు ఆరా తీయడం మొదలెట్టారు. అధికార పార్టీలో నెంబర్‌ టూగా చలామణి అవుతున్న విజయసాయిరెడ్డి.. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు విభేదాలు లేవని తనంత తానుగా ప్రకటించుకున్నారు. రాజకీయాలలో ఇలా వివరణ ఇచ్చుకుంటున్నారంటే ఏదో ఉందన్న అర్థాన్ని తీస్తారు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. జగన్‌ను ఎదురించే సాహసం విజయసాయిరెడ్డి చేస్తారా? అంటే చెప్పడం కష్టం! అధికార పార్టీ శాసనసభ్యుల కంటే ఎంపీలలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికలనాటికి తెలుగుదేశం పార్టీతో అవగాహన ఉంటుందనీ, సీటు గ్యారంటీ అని హామీ ఇస్తే.. పది మందికిపైగా ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభంలో ప్రకటించారు. దీన్నిబట్టి అప్పటివరకు అధికార పార్టీలో అసంతృప్తి అసమ్మతిగా మారకపోవచ్చునన్నది ఒక అభిప్రాయం. ఏదిఏమైనా జగన్‌ వైఖరి ఇలాగే ఉంటే మున్ముందు సమస్యలు తప్పవు. ప్రజల్లో వ్యతిరేకత నెలకొంటే మాత్రం జగన్మోహన్‌రెడ్డి వంటి మనస్తత్వం ఉన్నవాళ్లు నిల దొక్కుకోవడం కష్టం!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.