Underground City: ఈ పాతాళలోకంలో నరమానవుల కోసం ఏమేమి ఉన్నాయో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-08-01T16:31:15+05:30 IST

మనం నగరాల్లోని ఎత్తయిన భవనాలు, బహుళ అంతస్తులు...

Underground City: ఈ పాతాళలోకంలో నరమానవుల కోసం ఏమేమి ఉన్నాయో తెలిస్తే...

మనం నగరాల్లోని ఎత్తయిన భవనాలు, బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాలను చూసేవుంటాం. అయితే భూగర్భంలో నివాస యోగ్యమైన ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? అవును... ఈ ప్రపంచంలో అటువంటి నగరం ఒకటి ఉంది. ఇక్కడ భూమి కింద ఇళ్ళు నిర్మితమవుతారు. ఈ నగరం ఎడారి మధ్యలో ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్థానికులు భూగర్భంలో నివసించడానికి ఇష్టపడతారు. ఈ నగరం పేరు కూబర్ పెడీ. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతంలో ఉంది. దీనిని ఆధునిక పాతాళలోకం అంటారు. దశాబ్దాలుగా ఇక్కడ విలువైన ఒపాల్ రత్నాల కోసం తవ్వకాలు జరిగాయి. ఫలితంగా భూమి లోపల పెద్ద గనులు ఏర్పడ్డాయి. 


ఎండ వేడిమికి ఇబ్బంది పడుతున్న ఇక్కడి ప్రజలు ఈ గనుల్లో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ నగరంలో ఇలాంటి 1,500 గనులు ఉన్నాయి, వీటిలో స్థానికులు ఇళ్లు నిర్మించుకున్నారు. భూమి కింద నిర్మించిన ఈ ఇళ్లలో సకల సౌకర్యాలు కనిపిస్తాయి. ఈ నగర జనాభా సుమారు 3,500. అందులో సగానికి పైగా జనం భూగర్భ గృహాల్లో నివసిస్తున్నారు. ఈ నగరం 100 సంవత్సరాల క్రితం స్థాపితమయ్యింది. ప్రపంచంలోని ఒపాల్ రత్నాల మొత్తం ఉత్పత్తిలో 70 శాతం ఇక్కడ నుండే వస్తుంది. దీనిని ఒపాల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 70కి పైగా ఒపాల్ మైన్ ఫీల్డ్‌లు ఉన్నాయి. ఒపాల్ ఒక పాల రంగులోని విలువైన రాయి. దీనిని ఆభరణాలు, జ్యోతిష్య ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ జాతిరాయికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీని ధర కూడా చాలా ఎక్కువ. కాగా భూమికింద నిర్మించిన ఈ ఇళ్లలోని ఉష్ణోగ్రత నివాసానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడివారికి శీతాకాలంలో హీటర్ లేదా వేసవిలో ఏసీ అవసరం ఉండదు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం అండర్‌గ్రౌండ్ హోటళ్లు, చర్చిలు, రెస్టారెంట్లు, బార్‌లు ఏర్పాటయ్యాయి.

Updated Date - 2022-08-01T16:31:15+05:30 IST