బ్లాక్‌స్పాట్ల వద్ద అండర్‌పాస్‌, సర్వీస్‌ రోడ్లు

ABN , First Publish Date - 2022-08-17T05:20:31+05:30 IST

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో బోయిన్‌పల్లి నుంచి నిర్మల్‌ వరకు జాతీయ రహదారి 44 రోడ్డుపై ప్రమాదాలకు కారణమైన 24 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. అందులో మెదక్‌ జిల్లాలో ఏడు బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు.

బ్లాక్‌స్పాట్ల వద్ద అండర్‌పాస్‌, సర్వీస్‌ రోడ్లు
చేగుంట మండలం రెడ్డిపల్లి జంక్షన్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మాణం

ఎన్‌హెచ్‌-44పై బోయిన్‌పల్లి నుంచి  నిర్మల్‌ వరకు 24 బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు

మెదక్‌ జిల్లాలో ఏడు ప్రాంతాలు

మొత్తం రూ.251.37 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి, లైట్‌ వెహికిల్‌ అండర్‌పాస్‌ల నిర్మాణం


తూప్రాన్‌, ఆగస్టు16: హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో బోయిన్‌పల్లి నుంచి నిర్మల్‌ వరకు జాతీయ రహదారి 44 రోడ్డుపై ప్రమాదాలకు కారణమైన 24 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. అందులో మెదక్‌ జిల్లాలో ఏడు బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు. బోయిన్‌పల్లి నుంచి నిర్మల్‌ వరకు బ్లాక్‌స్పాట్స్‌ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నారు. 

ఈ మేరకు రూ.251.37 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలోనే ఏడు బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు రూ. 98.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో మనోహరాబాద్‌ - దండుపల్లి వద్ద రూ. 4.47 కోట్ల వ్యయంతో సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. తూప్రాన్‌ పట్టణ పరిధి కరీంగూడ వై జంక్షన్‌ వద్ద రూ. 24.90 కోట్లతో లైట్‌ వెహికిల్‌ అండర్‌పాస్‌ నిర్మాణం చేయనున్నారు. ఇక నాగులపల్లి చౌరస్తా వద్ద వెహికిల్‌ అండర్‌పాస్‌ను రూ.32.71 కోట్లతో నిర్మించారు. మాసాయిపేట మండలం రామంతాపూర్‌ హంసా దాబా ఎక్స్‌ రోడ్డు వద్ద రూ. 1.77 కోట్లతో మేజర్‌ గ్రేడ్‌ జంక్షన్‌ అభివృద్ధి చేస్తున్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లి జంక్షన్‌ (బాలాజీ ధర్మకాంట) వద్ద రూ. 14.55 కోట్లతో లైట్‌ వెహికిల్‌ అండర్‌పాస్‌ నిర్మాణం చేస్తున్నారు. నార్సింగి మండలం జప్తిశివునూర్‌ వద్ద రూ. 16.62 కోట్లతో లైట్‌ వెహికిల్‌ అండర్‌పాస్‌ నిర్మాణం చేయనున్నారు. రామాయంపేట వ్యవసాయ మార్కెట్‌ దాబా వద్ద రూ. 3.16 కోట్ల వ్యయంతో సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేశారు. ఇలా కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలోని బ్లాక్‌స్పాట్ల వద్ద కూడా నిర్మాణాలు చేపట్ట నున్నారు. కొన్నింటి నిర్మాణ పనులు మొదలవ్వగా, మరికొన్నింటి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. 


త్వరలోనే నిర్మాణాలు పూర్తి

- తరుణ్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారి

బోయిన్‌పల్లి నుంచి నిర్మల్‌ వరకు హైవే రోడ్డు 44పై గుర్తించిన బ్లాక్‌ స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సూచికలు, జిబ్రా లైన్లు ఏర్పాటు చేశాం. ప్రమాదాలను నివారించేందుకు అండర్‌పా్‌సలు, సర్వీస్‌ రోడ్డులు ఏర్పాటు చేస్తున్నాం. కొన్నింటి నిర్మాణాలు పూర్తవ్వగా, మరికొన్నింటి పనులు జరుగుతున్నాయి. మిగతా పనులు కూడా త్వరలోనే చేపట్టి పూర్తి చేస్తాం.

Updated Date - 2022-08-17T05:20:31+05:30 IST