అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలు

Published: Mon, 08 Aug 2022 00:48:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలు అడవులలో విసిరేసినట్లు ఉన్న గిరిజన గ్రామాలు

ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు డిమాండ్‌

ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని పోడు భూముల సమస్య

వెంటాడుతున్న రక్తహీనత, అనారోగ్య సమస్యలు

జీవో 3 ఎత్తి వేతపై తీవ్ర ఆందోళన

ఇప్పటికీ రోడ్డు సౌకర్యానికి నోచుకోని ఎన్నో ఆదివాసీ గ్రామాలు

రేపు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం

ఆదిలాబాద్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేస్తున్నా.. అభివృద్ధికి మాత్రం నోచుకోవడమే లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆదివాసీల తలరాతలు మారినట్లు కనిపించడం లేదు. తమ హక్కుల కోసం నిరంతరంగా గళం విప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీలను నిరక్షరాస్యత, ఆరోగ్య సమస్యలు, పేదరికం వెంటాడుతునే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ జిల్లాలో రవాణా సౌకర్యం, విద్యుత్‌ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోనే జిల్లాలో ఆదివాసీలు అధికంగా నివసిస్తున్నారు. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారడంతో ఆదివాసీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ వెనుకబాటుతనానికి మరో గిరిజన తెగనే కారణ మంటూ గత కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన ఆదివాసీలు, ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ ఉడుంపట్టుతో ఉద్యమాలు చేస్తున్నారు. అవకాశాలన్నీ లంబాడా తెగకే దక్కడం తో.. తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆదివాసీలు మండిపడుతున్నారు. ఆదివాసీలకు రక్షణగా ప్రత్యేక చట్టాలు ఉన్నా.. వాటి అమలుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదంటూ, హక్కుల కోసం నిరంతర పోరాటా లు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల ఉద్యమాన్ని రగిలించిన ఎంపీ సోయం బాపురావు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందడంతో ఆదివాసీలు ఎంతో సంబరపడ్డారు. కాని మూడేళ్లు గడిచిపోతున్నా.. తమ కల సాకారానికి అడుగు ముందుకు పడకపోవడంతో మెజార్టీ ఆదివాసీల్లో నిరాశానే కనిపిస్తోంది. అడవుల్లో విసిరిపారేసినట్లు కనిపించే ఆదివాసీల జీవనాన్ని మరింత మెరుగుపరిచేందుకు 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.

చేజారిపోయిన యూనివర్సిటీ

ఆదివాసీ గిరిజనులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు గత ప్రభు త్వం ఉట్నూర్‌కు గిరిజన యూ నివర్సిటీని మంజూరు చేసింది. కానీ వచ్చినట్లే వచ్చి చేజారి పోవడంతో ఆదివాసీ యువకు లు ఆందోళనబాట పడుతున్నా రు. అన్నిరకాల వసతులు, అవకాశాలు ఉన్నా.. గిరిజన యూనివర్సిటీని ఏర్పా టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉట్నూర్‌కు మంజూరైన యూనివర్సిటీని ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. గతంలోనే పలుమార్లు విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా.. ప్రభుత్వం స్పందించ లేదు. తరతరాలుగా వస్తున్న వెనుకబాటు తనాన్ని పోగొట్టే అక్షర ఆయుధానికి అడవి బిడ్డలు దూరమవుతూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా.. గిరిజనులకు మెరుగైన విద్యా అవకాశాలు అందని ద్రాక్షగానే మారాయి. గిరిజనుల సర్వతోముఖాభి వృద్ధికి ప్రత్యేకంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాస్త నాలుగు జిల్లాలుగా విడిపోయినా.. ఐటీడీఏ పాలన మాత్రం యథావిధి గానే కొనసాగుతోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోని గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నా.. ఆదివాసీల ధరికి చేరడం లేదు. ఎంతో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా.. వారిని పేదరి కం వెంటాడడంతో ప్రతిభా వంతులైన విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకునే అవకాశం లేకపోవడంతో ఇంటికే పరిమితమవుతున్నారు. 

పోడు భూములకు పరిష్కారం ఏదీ?!

ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. గత యేడాది క్రితం స్వయాన ముఖ్యమంత్రి కేసీఆరే అర్హులైన గిరిజ రైతులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించి రైతుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయినా ఇప్పటి వరకు హక్కుపత్రాలు ఇవ్వకపోగా.. పరిష్కారమే చూపడం లేదు. దీంతో వానాకాల సీజన్‌ మొదలైందంటే చాలు ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అటవీ శాఖ అధికారులతో ఆదివాసీలు చిన్నపాటి యుద్ధాన్నే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోడు భూములను సాగు చేసుకుంటున్న క్రమంలో హద్దులు దాటారంటూ అటవీ శాఖాధికారులు ఆదివాసీ మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంభయంగా పోడు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో వేల మంది గిరిజన రైతులు హక్కుపత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నా.. అమలుకు నోచుకోక పోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. 

వణుకు పుట్టిస్తున్న వానాకాలం 

సమస్య ఏదైనా అమాయక ఆదివాసీల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వానాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీ గ్రామాలకు వణుకు పుట్టిస్తోంది. చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో ఊరుదాటే పరిస్థితు లు కనిపించడం లేదు. దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందక, వరద నీటి ఉధృతిని దాటేక్రమంలో ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ప్రసవమంటే పునర్‌ జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణాలు ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు కట్టుబడి మూడ విశ్వాసాలతో జీవనం గడుపుతున్నారు. అలాగే తరతరాలుగా వెంటాడుతున్న రక్తహీనత, పౌష్టికాహార లోపంతో ఆదివాసీలు బక్కచిక్కిపోయి బలహీన పడుతూ.. మరీ దయనీయంగా కనిపిస్తున్నారు. దీని కారణంగా ఆదివాసీలను భయంకర వ్యాధులు చుట్టుముట్టి  ఏటా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అంతేకాకుండా వెంటాడుతున్న పేదరికం, అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోతున్నా రు. మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణనష్టం జరుగుతూనే ఉంది. 

ఉద్యోగం, ఉపాధికి దూరమే..

ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దూరమవుతునే ఉన్నాయి. ఆదివాసీలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత ప్రభుత్వం జీవో నెం.3 తీసుకొచ్చింది. కానీ గత రెండేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఈ జీవోను రద్దు చేయడంతో ఉద్యోగ అవకాశాలు కరువవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనేతరులకు కూడా అవకాశాలు కల్పించాలం టూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వడంతో ఆదివాసీల ఆశలు ఆవి రయ్యాయి. దీంతో ఏజెన్సీలో స్పెషల్‌ డీఎస్సీకి అవకాశమే లేకుండా పోయింది. అసలే అంతంత మాత్రంగా చదువుకుంటున్న ఆదివాసీలకు ప్రభుత్వ ఉద్యోగం గగనంగా మారింది. ప్రభుత్వం జీవో నెం.3 మళ్లీ పునరుద్ధరించక పోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇకనైనా ప్రభుత్వం జీవో నెం.3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలంటూ డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. నిరంతరంగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నా.. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు.

ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటాం

: సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్‌

ఆదివాసీలకు ఉద్యమాలు చేయడం కొత్తేమీ కాదు. నిరంతర పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని జీవో నెం.3 పునరుద్ధరించాలి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తోంది. ఆదివాసీల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామీలన్నీ మరిచి పోయింది. ఎన్నికల సమయంలోనే ఆదివాసీలు గుర్తుకొస్తున్నారు. ఏదిఏమైనా ఆదివాసీలకు అధికారం వస్తేనే హక్కుల సాధనకు అవకాశం ఉంటుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.