వంటలు
ఉందియు

న్యూ ఇయర్‌ వేడుకల్లో కొత్తగా...

ఓ వైపు కొత్త సంవత్సరం వేడుకలు, మరోవైపు వణికిస్తున్న చలి. ఈ సమయంలో ఇంటికొచ్చిన స్నేహితులకు బిర్యానీ పార్టీ ఇస్తే ఏం బాగుంటుంది? మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో వింటర్‌ స్పెషల్‌ రెసిపీలుగా గుర్తింపు పొందిన వంటలను రుచి చూపిస్తే కొత్త ఏడాదంతా గుర్తుపెట్టుకుంటారు. ఆ వంటల విశేషాలు ఇవి...


గుజరాత్‌లో పాపులర్‌ వంటకం ఇది. సూరత్‌లో పుట్టిన  ఈ వంటకం ఈ సీజన్‌లో అక్కడి ప్రతి వంటింట్లోనూ ఘుమఘుమలు పంచుతుంది. 


కావలసినవి: చిక్కుడుకాయ - 100గ్రాములు, అరటికాయలు - రెండు, చామగడ్డలు - 100 గ్రాములు, బంగాళదుంపలు - 100గ్రాములు, వంకాయలు - పావుకేజీ, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌.


గుంత పొంగనాల కోసం: శనగపిండి - ఒకకప్పు, మెంతి ఆకులు - పావు కప్పు, ఇంగువ - చిటికెడు, బేకింగ్‌ సోడా - పావు టీస్పూన్‌, ఉప్పు - ఒక టీస్పూన్‌, పంచదార - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా.


మసాలా కోసం: అల్లం - ఒక అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - ఒక కప్పు, కొత్తిమీర - ఒకకట్ట, నిమ్మకాయ - ఒకటి, నువ్వులు - మూడు టీస్పూన్లు, ధనియాల పొడి - మూడు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా మసాలా కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి, నిమ్మరసం పిండి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. చిక్కుడుకాయలను చిన్నగా కట్‌ చేసుకోవాలి. అరటికాయలు, చామగడ్డల పొట్టుతీసి కట్‌ చేసి పెట్టుకోవాలి. వంకాయలను నిలువుగా కట్‌ చేసి మధ్యలో మసాలా పేస్టును కూరాలి. బంగాళదుంపలను కూడా అలాగే కట్‌ చేసి మధ్యలో మసాలా పేస్టు కూరాలి. స్టవ్‌పై కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తరువాత మసాలా కూరిన వంకాయలు, బంగాళదుంపలు వేయాలి. మిగిలిన మసాలాలో  కొద్దిగా వేసి కలుపుకోవాలి. తరువాత అరటికాయ ముక్కలు, చామగడ్డ ముక్కలు వేసి మిగిలిన మసాలా  వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి చిక్కుడుకాయ ముక్కలు వేయాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి నాలుగైదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి ఆవిరి పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగనాలు తయారుచేసుకోవాలి. ఒక ప్లేట్‌లో శనగపిండి తీసుకుని అందులో మెంతి ఆకులు, కారం, ఉప్పు, పంచదార, బేకింగ్‌సోడా, ఇంగువ, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పొంగనాల ప్లేట్‌లో వేసి ఉడికించి పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక కుక్కర్‌లోని మిశ్రమం వేయాలి. తరువాత పొంగనాలు వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై మూతపెట్టి పదినిమిషాలు ఉడికిస్తే ఉందియు రెడీ.


Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.