సంస్కృత వర్సిటీలో ప్రవేశాలకు అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2022-05-28T07:29:31+05:30 IST

సంస్కృత వర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని వీసీ ప్రొఫెసర్‌ రాధాకాంత్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

సంస్కృత వర్సిటీలో ప్రవేశాలకు అనూహ్య స్పందన
మీడియాతో మాట్లాడుతున్న రాధాకాంత్‌ ఠాకూర్‌

యూజీ కోర్సులకు ఇప్పటికే 10,679 దరఖాస్తులు

ఈ ఏడాది నుంచి సీయూటీఈ ద్వారా ప్రవేశాలు

వర్సిటీకి అదనంగా టీటీడీ 14.4 ఎకరాల కేటాయింపు

ఆగమశాస్త్రంలో ప్రయోగశాల ఏర్పాటుకు శ్రీకారం

వీసీ ప్రొఫెసర్‌ రాధాకాంత్‌ ఠాకూర్‌ వెల్లడి


తిరుపతి(విద్య), మే 27: తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని వీసీ ప్రొఫెసర్‌ రాధాకాంత్‌ ఠాకూర్‌ వెల్లడించారు. శుక్రవారం వర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వీసీ మాటల్లోనే.. ‘గత ఏడాది వరకు దాదాపు మూడు వేలమంది విద్యార్థుల వరకు మాత్రమే దరఖాస్తు చేసేవారు. ఈ దఫా ఇప్పటికే వివిధ కోర్సులకు 10,679మంది దరఖాస్తు చేసుకున్నారు. సెంట్రల్‌ హోదా సంతరించుకున్నాక ఈ ఏడాది తొలిసారిగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో(ఎన్టీఏ) నిర్వహించే సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూటీఈ)ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాం. ఈ ప్రవేశపరీక్ష జూలైలో ఉంటుంది. అలాగే వర్సిటీలో ఆఫర్‌ చేసే పీజీ కోర్సులకు కూడా రెండ్రోజుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రవేశాలు కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవిధానం అమలు ద్వారా ఓ సంస్థలో చదివే విద్యార్థులు మధ్యలో మరో సంస్థలో కూడా చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వర్సిటీలో ఆగమశాస్త్రం అధ్యయనం చేస్తున్న విద్యార్థుల కోసం ఈ విద్యాసంవత్సరం నుంచి ఆగమ లేబొరేటరీ (ప్రయోగశాల) ఏర్పాటుకు అనుమతి తీసుకున్నాం. పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు నెలసరి ఉపకారవేతనం రూ.2వేల నుంచి రూ.8వేలకు పెంచాం. తిరుపతిలో వర్సిటీ ఏర్పాటైన తొలినాళ్లలో టీటీడీ 43 ఎకరాలు కేటాయించగా.. జాతీయ వర్సిటీ హోదా సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో అదనంగా మరో 14.40 ఎకరాలు కేటాయించింది. పైగా ఎకరాకు ఏడాదికి రూపాయి చొప్పున 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. దీనికి టీటీడీ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని రాధాకాంత్‌ ఠాకూర్‌ వివరించారు. సమావేశంలో రిజిస్ర్టార్‌ చల్లా వెంకటేశ్వర్‌, ఫైనాన్స్‌ అధికారి మునిష్‌ మాలిక్‌, పీఆర్వో డాక్టర్‌ ఎస్‌.దక్షిణామూర్తిశర్మ, ఓఎ్‌సడీ ఈశ్వరయ్య, సేతురామ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T07:29:31+05:30 IST