Viral Video: కుర్రాళ్లకు ఈ గుండెపోటు ఏంటో.. ఈ వీడియో చూస్తే ‘అయ్యో పాపం’ అనిపిస్తుంది..!

ABN , First Publish Date - 2022-10-03T22:07:19+05:30 IST

ఈ మధ్య కాలంలో యువతీయువకుల్లో గుండెపోటు సమస్య తరచుగా కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అప్పటిదాకా అందరితో సరదాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా..

Viral Video: కుర్రాళ్లకు ఈ గుండెపోటు ఏంటో.. ఈ వీడియో చూస్తే ‘అయ్యో పాపం’ అనిపిస్తుంది..!

ఈ మధ్య కాలంలో యువతీయువకుల్లో గుండెపోటు సమస్య తరచుగా కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అప్పటిదాకా అందరితో సరదాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలా చనిపోతున్న వారిలో ఎక్కువ మంది గుండెపోటు కారణంగా చనిపోయిన వారే కావడం గమనార్హం. తాజాగా.. అలాంటి ఘటనే గుజరాత్‌లోని ఆనంద్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. ఆనంద్‌లోని తారాపూర్ ప్రాంతంలో Aati Shivshakti Society ఉంది. ఈ సొసైటీలో దసరా సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్లు గుజరాతీ సాంప్రదాయ నృత్యం అయిన గార్భా(Garba) ఆడుతూ ఆనందంగా గడిపారు. అయితే.. అలా డ్యాన్స్ చేస్తూచేస్తూ ఒక యువకుడు కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు ప్రాణం పోయినట్లు నిర్ధారించారు.



ఈ ఘటనతో శివ్‌శక్తి సొసైటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆ యువకుడు చనిపోయాడని నిర్ధారించారు. ఆ యువకుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అందరితో సరదాగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువకుడి పేరు వీరేంద్ర అని తెలిసింది. వయసు 21 సంవత్సరాలు. ఆ కుటుంబంలో వీరేంద్ర చిన్న కొడుకు. వీరేంద్ర తండ్రి మోరాజ్ గ్రామంలోని స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. వీరేంద్ర గార్భా డ్యాన్స్ చేస్తుండగా అతని స్నేహితుడు వీడియో తీశాడు. దీంతో.. వీరేంద్ర ఉన్నట్టుండి కుప్పకూలిన దృశ్యాలు వెలుగులోకొచ్చాయి.



పాతికేళ్ల వయసులోపే గుండెపోటు కారణంగా చనిపోతున్న ఘటనలు ఈ మధ్య చాలానే చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు అభిజిత్‌(23) గుండెపోటుతో చనిపోయారు. సెప్టెంబర్ 25, ఆదివారం రాత్రి నిద్రలో అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే అభిజిత్‌ను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అభిజిత్‌ గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు ఆదివారం రాత్రే తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అభిజిత్‌ అంత్యక్రియలను నిర్వహించారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభిజిత్‌కు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే సుమారు రూ.50 లక్షల ప్యాకేజీతో ఓ ఆయిల్‌ కంపెనీలో జాబ్‌ వచ్చింది. ఉద్యోగంలో చేరేందుకు ఈ అక్టోబర్‌లోనే అభిజిత్ దుబాయ్‌ వెళ్లాల్సి ఉండగా, ఇంతలోనే ఇలా జరిగింది.

Updated Date - 2022-10-03T22:07:19+05:30 IST