రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన

ABN , First Publish Date - 2022-05-20T06:07:50+05:30 IST

రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఇందుకు చెత్త బ్రాండ్ల మద్యం, గంజాయి కారణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

మహిళలు, యువతులపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు

చెత్త బ్రాండ్ల మద్యం, గంజాయే కారణం

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజం

పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు కాపాడుకోవాలని పిలుపు

వైసీపీని గద్దె దించకపోతే జనం బతుకులు బుగ్గిపాలు: బండారు

మహిళలపై దాడులకు నిరసనగా ఎలమంచిలిలో ర్యాలీ, సభ


ఎలమంచిలి, మే 19: రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఇందుకు చెత్త బ్రాండ్ల మద్యం, గంజాయి కారణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను నిరసిస్తూ గురువారం ఇక్కడ అనకాపల్లి పార్లమెంటరీ స్థాయిలో నిరసన ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడూతూ, రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన సాగుతున్నదని, ప్రజలు ఆలోచన చేసి తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన ఆవసరం ఎంతైనా ఉందని అన్నారు. జగన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా వున్నప్పుడు పాదయాత్ర సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్ల కాలంలో ఎన్ని హామీలను నెరవేర్చారో ప్రజల మధ్యకు వచ్చి చెప్పాలని సవాల్‌ చేశారు. ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్న వైసీపీ ప్రజాప్రతినిధులు... పోలీసు రక్షణ లేకుండా ప్రజల్లోకి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారంటూ ‘గడప గడపకు’ కార్యక్రమంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు. 

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, దుర్మార్గపు పాలకులను గద్దె దించకపోతే తమ బతుకులు బుగ్గిపాలు అవుతాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో చెత్త ద్వారా ఎరువులు, విద్యుత్తు తయారు చేస్తే, జగన్‌రెడ్డి చెత్తపై పన్నులు వేసి చెత్త ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ప్రగడ నాగేశ్వరరావు (ఎలమంచిలి), బత్తుల తాతయ్యబాబు (చోడవరం), పీవీజీకుమార్‌ (మాడుగుల), నాయకులు లాలం భాస్కరరావు,  రాజాన రమేశ్‌, ధూళి రంగనాయకులు, ఆడారి మంజు, సుకల రమణమ్మ, పి.సత్యవతి, బొర్రా విజయారాణి, కొఠారు సాంబ, కాండ్రకోట చిరంజీవి, దిన్‌బాబు, దాడి ముసిలినాయుడు, గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T06:07:50+05:30 IST