కృతజ్ఞత చూపని కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-07-07T06:14:53+05:30 IST

లంచాలు తీసుకోవడం ఒక భ్రష్టాచారం. అయితే భూపరిమితులు వస్తాయని ముందే తెలిసి ప్రభుత్వ పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు భూములను ముందే అమ్ముకుని లేదా బినామీలకు బదలాయించడం భారీ భ్రష్టాచారం...

కృతజ్ఞత చూపని కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం– ముఖ్యంగా సోనియా, రాహుల్– పీవీ పట్ల తమ వ్యతిరేకతను, కృతఘ్నతా విధానాన్ని విడనాడి క్షమాపణ చెప్పుకోవలసి ఉంది. కృతజ్ఞతను బహిరంగంగా ప్రకటించాలంటే మూర్ఖత్వం వదలాలి, సాహసం చూపాలి.


లంచాలు తీసుకోవడం ఒక భ్రష్టాచారం. అయితే భూపరిమితులు వస్తాయని ముందే తెలిసి ప్రభుత్వ పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు భూములను ముందే అమ్ముకుని లేదా బినామీలకు బదలాయించడం భారీ భ్రష్టాచారం. మరి 500 ఎకరాలపైగా సొంత భూములను చట్టం నియమాలకనుగుణంగా ప్రభుత్వానికి బదిలీ చేసిన నీతిమంతుడు పాములపర్తి వెంకట నరసింహారావు. పరిశ్రమలు, విమానాశ్రయాలు, రాజధానులు ఎక్కడ వస్తాయో ప్రభుత్వంలో ఉన్నవారికి ముందే తెలుస్తాయి. ఈ వెసులుబాటుతో తమ పేర, బినామీల పేర భూములు సంపాదించి ఎందరో సంపన్నులైనారు. రాజధానుల ఎంపిక వెనుక భూవ్యాపార ప్రయోజనాలే కనిపిస్తాయి. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ సొంత భూములకే కాదు పదవికి కూడ ముప్పు తెచ్చుకున్నారు. స్థానికులకు ఉద్యోగాలకోసం తెలంగాణ ముల్కీ నియమాలు సరైనవే అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ఆరుసూత్రాల పథకాన్ని పీవీ వ్యతిరేకించారు. పార్టీలోని భూస్వాములంతా పగబట్టారు. మళ్ళీ వేర్పాటు ఉద్యమం ప్రజ్వరిల్లింది. సమస్యకు పరిష్కారం ముఖ్యమంత్రిని మార్చడమే అని కాంగ్రెస్ అధిష్టానవర్గం భావించింది.


పూర్తి మెజారిటీ ఉన్నా, విధేయుడే అయినా, పార్టీ చీలకపోయినా, సొంత పార్టీకి ఆధిక్యత ఉన్న శాసనసభను సస్సెండ్ చేసి రాష్ట్రపతి పాలన విధించింది. అధికరణ 356 దుర్వినియోగంలో ఇది పరాకాష్ట. పార్టీ అధిష్ఠానం చేతిలో ఇది పీవీకి తొలి ఘోర అవమానం. మౌనంగా భరించారే గాని పార్టీని వీడలేదు. అధినేతను అధిక్షేపించలేదు. విధేయతను కించిత్ కూడా తగ్గించుకోలేదు. ప్రవేశపెట్టిన వ్యక్తికి అధికారచ్యుతి కలుగడంతో పెత్తందారీ వర్గాలు నానా అక్రమాలతో భూసంస్కరణలను వమ్ము చేశాయి. కోర్టులో కుమ్మక్కై విడాకులు తెప్పించుకుని భార్యాభర్తలు విడివిడిగా భూములు నిలబెట్టుకుని, ఏమీ ఎరగనట్టు ఒకే ఇంట్లో మామూలుగా కాపురం ఉన్నారు. మైనర్ పిల్లలను మేజర్లుగా చూపి భూములిచ్చారు. అవినీతి, లంచగొండితనం, అబద్ధం విశృంఖల వీర విహారం చేసాయి. పెంపుడు కుక్కలు, నమ్మకస్తులైన నౌకర్లు, అనేకానేక బినామీలు హఠాత్తుగా భూస్వాములైనారు. అన్ని దస్తావేజులు దొరవారి అల్మరాలోనే ఉంటాయి. దొంగ విక్రయపత్రాలు, దొంగ విడాకులు, దొంగ వయసు పత్రాలతో భూసంస్కరణలు మరణించాయి. అయినా సర్కార్ వేలాది పేదలకు భూములు పంచగలిగింది. వందల ఎకరాలు ఒక్కరిచేతిలో ఉండకూడదనే సంవిధాన మార్గదర్శక విధానం మరణించి వేల ఎకరాలను కంపెనీలకు కట్టబెట్టే నయా భూస్వాములను సృష్టించే దుర్మార్గం ఆ తరువాత ఒక గొప్ప సంస్కరణగా కొత్త జన్మనెత్తింది. సామాన్యుల భూమిని సర్కారీ డబ్బుతో కొని (సేకరించడం, స్వాధీనం చేసుకోవడం, పూలింగ్ అని రకరకాల పేర్లతో) సంపన్నులకు కట్టబెట్టడం కూడా సంస్కరణగా మారి సోషలిజం శుష్కించింది. భూసంస్కరణల అమలుకు తొలుత ఉపక్రమించిన పీవీ నరసింహారావే ప్రయివేటీకరణ ద్వారా ప్రపంచ కార్పొరేట్ మార్కెట్‌కు ఆర్థిక రంగం గవాక్షాలను తెరిచి పెట్టవలసి వచ్చింది. కార్పొరేట్లు భూస్వాములయ్యేందుకు అనుగుణంగా కొత్తగా సెజ్ చట్టాలు, భూసేకరణ చట్టాలు తెచ్చారు.


తెలంగాణ బిడ్డ, జనప్రియుడైన ముఖ్యమంత్రి అంజయ్యను విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అత్యంత దయనీయంగా అవమానించారు. ఆ కుటుంబం వారు ప్రధానిగా ఉంటే ఎవరినైనా అవమానిస్తారు. ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా సరే అవమానిస్తారు. ఇందిరాగాంధీ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఆమెకు తిరుగులేదు. ఆమె నమ్మకస్తుల బృందంలో పీవీ ముఖ్యుడు. ఇందిరాగాంధీ ఆకస్మిక నిష్క్రమణ తరువాత ఆనాటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఏ ప్రజాస్వామిక ప్రక్రియను పాటించకుండా రాజీవ్‌ను ప్రధానమంత్రిగా ప్రతిష్టించారు. రాజీవ్ హతమైన తరువాత సోనియా తప్ప మరెవ్వరూ లేక, ఆమె ముందుకు రాక కాంగ్రెస్ పార్టీకి మరొక నాయకుడిని ఎన్నుకోవలసిన ప్రజాస్వామిక ఆగత్యం ఏర్పడింది. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య పరీక్షను పీవీ నికార్సుగా గెలిచారు. అన్ని  వర్గాల ఆమోదంతో ఎన్నికైన ప్రధానమంత్రి, పార్టీ అధ్యక్షుడు పీవీ. అయినా ప్రధానిగా, ముఖ్యమంత్రిగా, మాజీ ప్రధానిగా కూడా ఆయన కాంగ్రెస్ అగ్ర కుటుంబం చేతిలో ఆగ్రహావమానాలకు గురైనారు. అనుమానాలు, చెప్పుడు మాటలు, మరెవరినీ ఎదగనీయరాదనే కుట్రలు, అసూయలు, ఆయన పైకి వస్తే మన పని అయినట్టే అనే ద్వేషాలు కాంగ్రెస్‌లో చెలరేగాయి. అధికారం పోయినా అవలక్షణాలను వదులుకోలేదు. బిజెపి అఖండ విజయం సాధించి ఇద్దరు వ్యక్తుల నిరంకుశ పార్టీగా ఎదగడానికి ఇటువంటి కాంగ్రెస్ విధానాలు ముఖ్యకారణం. 


పదవి దిగిపోయిన తర్వాత అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ ఎందరో తిరిగారు. కాని తాము బతికున్నంతకాలం కేసులు విచారణకు రాకుండా జాగ్రత్త పడి, మరణం వల్ల కేసులనుండి విముక్తి పొందారు. కాని పీవీ పైన ఏ కేసులోనూ నేరారోపణలు నిలవలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తను నమ్ముకున్న పార్టీ తనను నమ్మక వదిలేసింది. ఇప్పుడు అవినీతి నేరారోపణలున్న నేతల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది. కులబలం, ధనబలం లేక ఒక మామూలు వ్యక్తివలె కోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాడినవాడు పీవీ. చివరకు నిర్దోషిగా మరణించారు. మరణించి నిర్దోషి కాలేదు. పీవీ శాంతి కాముకుడు. కానీ నిత్యం పోరాడక తప్పలేదు. పోరాటాలూ ఆయన్ను వదిలిపెట్టలేదు. ఆయన పోరాటమంతా అంతర్గతమే, అంతర్యుద్ధమే. పీవీ భయపడడు, భయపెట్టడు. భ్రమపడడు, భ్రమపెట్టడు. ఏదైనా సరే బయటపడడు. అట్లా అని అంతర్ముఖుడు కాదు. ఆయన మౌనంతో కూడా అభివ్యక్తం కాగలిగిన వ్యక్తి. పీవీ నరసింహారావులోని ‘లోపలి మనిషి’ నిరంతరం బయట ప్రపంచంతో పోరాడుతూనే గడిపాడు. మరణానంతరం కూడా! 


పీవీ నరసింహారావు మరణించిన తరవాత ఒక మాజీ ప్రధాని హోదాలో ఆయనకు ఢిల్లీలో ఒక సమాధి ఉండాలని, అక్కడ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. మాజీ ప్రధాన మంత్రులందరికీ ఇచ్చిన రీతిలోనే గౌరవం ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడికి ఆనాటి పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులర్పించకపోవడం క్షమించరాని అమర్యాద. మరణించిన ప్రతి మాజీ అధ్యక్షుడికి పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు నివాళులర్పించడానికి పార్థివ శరీరాన్ని సగౌరవంగా ఉంచుతారు. పీవీ దేహాన్ని పార్టీ భవనంలోకి రానీయకుండా గేట్లు మూసారు. తెరుస్తారేమోనని దాదాపు అరగంట అక్కడే రోడ్డు మీద ఉంచారు. పీవీ కుమారులను, బంధువులను ఒప్పించి అంత్యక్రియలు హైదరాబాద్‌లో ఘనంగా జరిపించండి అని చెప్పారు. దాని అర్థం ఢిల్లీలో స్థానం లేదని చెప్పడమే. పీవీ వ్యతిరేకి అయిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధ్వర్యంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పీవీ సమాధికి డిల్లీలో స్థలం కేటాయించి, ఆయనకు జరిగిన అన్యాయాన్ని కొంత నివారించడానికి ప్రయత్నం చేసింది. 


 పీవీ పట్ల కాంగ్రెస్ పార్టీ పగ ఆయన మృతితో చల్లార లేదు. కనీసం ఆయన పేరును ఉచ్ఛరించడానికి, కనీసం మాజీ ప్రధానమంత్రుల జాబితాలో ఆయనను గుర్తు చేసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబానికి ఇష్టం లేదు. సోనియాగాంధీ ఒక ప్రసంగంలో ‘భారతదేశ ఆధునిక ఆర్థిక విధానాల రూపకర్త రాజీవ్ గాంధీ అనీ, ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వం అయిదేళ్లపాటు వాటిని అనుసరించిందని’ అన్నారు. అప్పటిదాకా రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా పనిచేసి, యుజిసి చైర్మన్‌గా ఉన్న డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌ను పిలిపించి పీవీ నరసింహారావు ఆయన్ని నేరుగా ఆర్థిక మంత్రిని చేసారు. పీవీ నాయకత్వంలోనే మన్మోహన్ దేశ ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులు సాధించారు. అది చరిత్ర. ఆ మన్మోహన్ పార్టీకి పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేయడానికి పనికి వచ్చారు. కాని ఆయనను కనిపెట్టిన పీవీ కాదు! 


‘ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరాన్ని మొదట ఇందిరాగాంధీ గుర్తించారనీ, ఆ తరువాత రాజీవ్ గాంధీ పాలనలో ఊపందుకున్నాయనీ, అయితే ఈ సంస్కరణల శక్తిని, ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో పీవీ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు జోహార్లర్పించాల్సిందేనని’ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అంటే ఆర్థిక సంస్కరణల ఘనతను పూర్తిగా పీవీకే కట్టబెట్టకుండా జాగ్రత్త పడ్డారు. బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించి, అయిదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని, పార్టీ ప్రభుత్వాన్ని బతికించిన నాయకుడు పీవీ. అయితే 1996 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పీవీయే కారకుడన్న కోపంతో పీవీని సొంత పార్టీయే శిక్షించదలచుకున్నది. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది పీవీయే అని కాంగ్రెస్ ప్రథమ కుటుంబం భావించింది. గాంధీ నెహ్రూల బంధువుకాకపోయినా సాహసంగా పార్టీని అయిదేళ్ల పాటు నడపగలనని నిరూపించినందుకే కాబోలు పీవీపై వారికి కోపం! పీవీ శతజయంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడానికి తెలంగాణ సంసిద్ధం కావడం, కాంగ్రెస్ నేతల కృతఘ్నతను జనానికి గుర్తు చేయడానికే. ఫిరాయింపులు చీలికలు, పరాజయాలతో చిక్కిన కాంగ్రెస్‌ను మరింత భ్రష్టు పట్టించడానికే. తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవిదుడు, పండితుడు, కవి, పాలనా సంస్కర్తగా పీవీని ప్రశంసిస్తూ, అంతటి వాడిని వదులుకున్న బాధ్యతారహితమైన పార్టీగా జనంలో నిలబెట్టడానికే. 


పీవీ శతజయంతి ఉత్సవాలు ఏడాది పొడుగునా నిర్వహిస్తామని తెలంగాణ పీసీసీ ప్రకటించింది. అయితే ఇది తప్పనిసరి నిర్ణయమే. పీవీ పట్ల కృతజ్ఞత చూపాలని అధిష్ఠాన వర్గానికి చెప్పగల స్థాయి ఎవరికీ లేదు. గాంధీ, అంబేడ్కర్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌లను బిజెపి హైజాక్ చేసింది. ఒకవైపు గాడ్సేను ఆకాశానికెత్తుతూ మరోవైపు గాంధీ బొమ్మను వాడుకుంటున్నది. పీవీని పూర్తిగా వాడుకొనే అవకాశం బీజేపీకి మాత్రమే దక్కకుండా చేసి, ఆ గౌరవం తామే పొందే వ్యూహం ఇది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం– ముఖ్యంగా సోనియా, రాహుల్– పీవీ పట్ల తమ వ్యతిరేకత, కృతఘ్నతా విధానాన్ని విడనాడి క్షమాపణ చెప్పుకోవలసి ఉంది. కృతజ్ఞతను బహిరంగంగా ప్రకటించాలంటే మూర్ఖత్వం వదలాలి, సాహసం చూపాలి. 

మాడభూషి శ్రీధర్

Updated Date - 2020-07-07T06:14:53+05:30 IST