యూనికార్న్‌ స్టార్టప్‎లు@ 100

ABN , First Publish Date - 2022-05-30T09:09:39+05:30 IST

దేశంలో స్టార్ట్‌పలు భారీగా సంపదను సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు.

యూనికార్న్‌ స్టార్టప్‎లు@ 100

కరోనాలోనూ దేశంలో హవా

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ, మే 29: దేశంలో స్టార్టప్‎లు భారీగా సంపదను సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ మన దేశంలో విలువైన స్టార్ట్‌పలు ప్రారంభమయ్యాయన్నారు. దేశంలో యూనికార్న్‌ (స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కాకుండానే రూ.7500 కోట్లకు పైగా విలువ కలిగినవి) స్టార్టప్‎లు సంఖ్య 100కు చేరిందని ప్రధాని వెల్లడించారు. ఆదివారం ఆయన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఈ నెల 5 నాటికి యూనికార్న్‌ స్టార్ట్‌పల సంఖ్య 100కు చేరిందన్నారు. ఈ స్టార్టప్‎లు మొత్తం విలువ 330 బిలియన్‌ డాలర్లని, అంటే రూ.25 లక్షల కోట్లకుపైనేనని వివరించారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగిన విషయమని చెప్పారు. దేశంలో నవీన ఆలోచనలున్న వ్యక్తులు సంపదను సృష్టిస్తున్నారన్నారు. స్టార్టప్‌కు ఒక మంచి గురువు/సలహాదారు ఉంటే ఆ సంస్థను సరికొత్త శిఖరాలకు చేరుస్తారని.. వ్యవస్థాపకులను సరైన మార్గంలో నడిపిస్తారని చెప్పారు. 

 

భాషా వైవిధ్యం.. గొప్ప నిధి..

మన దేశంలోని భాషా వైవిధ్యం ప్రత్యేకమని, అది మనకు గొప్ప నిధి అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలీకాలు ఉన్నాయని.. ఈ వైవిధ్యమే మన బలమని చెప్పారు. మన దేశంలో భాషా వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తులు ఎందరో ఉన్నారన్నారు.  కాగా.. చార్‌దామ్‌ యాత్రలో నిత్యం వేలాది మంది భక్తులు పాల్గొంటారని, ముఖ్యంగా కేదారనాథ్‌కు భారీ సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి పవిత్ర స్థలాల్లో కొందరు భక్తులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారని.. ఇదెంతో బాధాకరమని చెప్పారు. పుణ్యక్షేత్రాలకు ఎంతో భక్తి భావంతో వెళ్తామని.. అలాంటి చోట్ల ఇష్టానుసారంగా చెత్తవేయడం సరికాదని హితవు పలికారు.  ఇటీవలి జపాన్‌ పర్యటనలో తాను అద్భుతమైన వ్యక్తులను కలిసినట్లు ప్రధాని మోదీ చెప్పారు.   హిరోషి కొయికె ఆర్డ్‌ డైరెక్టర్‌ అని.. మహాభారత్‌ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. అసుషి మత్సువో, కెంజి యోషిలకు రామాయణం అంటే ఎంతో ఇష్టమన్నారు. రామాయణం ఆధారంగా 1993లో నిర్మించిన జపాన్‌ యానిమేటెడ్‌ చిత్రాన్ని ప్రస్తుతం ‘4కే’లో పునర్నిర్మిస్తున్నారని తెలిపారు. 


ఆడపిల్లల చదువుకు పదవీ విరమణ సొమ్ములు!

రాంభూపాల్‌రెడ్డికి ప్రధాని ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి రాంభూపాల్‌రెడ్డిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఉద్యోగ విరమణ తర్వాత అందిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ఆయన ఆడపిల్లల చదువు కోసం ఖర్చు పెట్టారని తెలిపారు. ఆయన 100 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిచి.. వాటిలో రూ.25 లక్షలు పైగా జమ చేశారని కొనియాడారు. సమాజానికి సేవ చేయాలన్న ఆయన సంకల్పం గొప్పదన్నారు. మార్కాపురంలో నివసించే రాంభూపాల్‌రెడ్డి.. తన రిటైర్మెంట్‌ అనంతరం వచ్చిన సొమ్మునంతటినీ  ఆడపిల్లల విద్య కోసం ఇచ్చేయడం ముదావహమని పేర్కొన్నారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే అంశమని ప్రధాని ప్రశంసించారు. 

Updated Date - 2022-05-30T09:09:39+05:30 IST