ఏకవర్గం.. ఏకపక్షం!

ABN , First Publish Date - 2022-06-28T05:29:13+05:30 IST

ఇప్పటికే ‘ఇంటింటికీ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లి వారి వ్యతిరేకతతో ఖంగుతిన్న వైసీపీకి... తాజాగా ఇంటిపోరు బహిర్గతమైంది.

ఏకవర్గం.. ఏకపక్షం!
ఎవరూ బయటకు వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్ద ఎమ్మెల్యే అనుచరులు

కదిరి వైసీపీ ప్లీనరీ సమావేశం ఫ్లాప్‌ 

సీఈసీ సభ్యుల గైర్హాజరు 

 కేడర్‌లో అసమ్మతి బహిర్గతం


కదిరి, జూన 27: ఇప్పటికే ‘ఇంటింటికీ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లి వారి వ్యతిరేకతతో ఖంగుతిన్న వైసీపీకి... తాజాగా ఇంటిపోరు బహిర్గతమైంది. వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే వర్గం మాత్రమే హాజరు కావడం, పార్టీ నేతలు సమష్టిగా లేకపోవడంతో పార్టీ కేడర్‌లో అసమ్మతి బట్టబయలైంది. అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా కదిరి పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్లీనరీ సమావేశం కాస్తా వర్గ విభేదాలతో తేటతెల్లమైంది. పట్టణంలోని దత్త కల్యాణమండపంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ చైర్మన నదీం అహ్మద్‌ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి కదిరిలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, వైసీపీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హాజరుకాలేదు.

  ప్లీనరీ సమావేశానికి సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, బత్తల హరిప్రసాద్‌, జక్కల ఆదిశేషు, వైసీపీ పట్టణాధ్యక్షుడు కేఎస్‌ బాహుద్దీన, నంబులపూలకుంట సింగల్‌విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి తదితరులు గైర్హాజరయ్యారు. వీరితో పాటు తలుపుల, నల్లచెరువు, తనకల్లు, ఎనపీకుంట, గాండ్లపెంట మండలాలకు చెందిన కేడర్‌లో చాలా మంది ముఖ్యులు సమావేశానికి రాలేదు. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన నాయకత్వాన్ని పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకే ముఖ్య నాయకత్వ వర్గం సమావేశానికి గైర్హాజరైనట్లు వైసీపీలో చర్చనీయాంశమైంది.  ప్లీనరీ సమావేశానికి కనీసం ఆహ్వానం కూడా అందలేదని నాయకుల అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఓ ముఖ్య నాయకుడికి ఆహ్వానం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాజరయ్యాడు. వైసీపీలో ఓ విద్యా సంస్థలకు చెందిన వైసీపీ నాయకుడికి స్థానిక ప్రజాప్రతినిధికి మధ్య సయోధ్య లేకపోయినా ఆయన ప్లీనరీ సమావేశానికి హాజరు కావడంపై సదరు నాయకుడి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందురోజు వరకు సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్న ఆయన ఒక్కసారిగా సమావేశానికి రావడం చర్చనీయాంశమైంది. అయితే నాయకులు మాట్లాడుతుండగా బయటకు వెళ్తున్న కార్యకర్తలను ప్రధానద్వారం వద్ద ఎమ్మెల్యే అనుచరులు బతిమలాడి లోపలకు పంపించారు. 



Updated Date - 2022-06-28T05:29:13+05:30 IST