సరిహద్దులు మార్చే చైనా చట్టం ఆందోళనకరం

ABN , First Publish Date - 2021-10-27T21:05:49+05:30 IST

చైనా ఆమోదించిన ల్యాండ్ బౌండరీ చట్టం ద్వైపాక్షిక

సరిహద్దులు మార్చే చైనా చట్టం ఆందోళనకరం

న్యూఢిల్లీ : చైనా ఆమోదించిన ల్యాండ్ బౌండరీ చట్టం ద్వైపాక్షిక సంబంధాలపైనా,  సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని భారత్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం అపరిష్కృతంగా ఉండటం భారత్‌కు ఆందోళనకరమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ఇటువంటి ఏక పక్ష చర్యల ప్రభావం ఇప్పటికే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ఉండబోదని తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపైన అయినా, సరిహద్దు ప్రాంతాల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రశాంతత, శాంతి, సామరస్యాల నిర్వహణపైన అయినా ఈ కొత్త చట్టం ప్రభావం ఉండబోదని వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చగలిగే ఏదైనా చర్యను ఈ కొత్త చట్టం సాకుతో చేపట్టడం చైనా మానుకుంటుందని భారత్ ఆశిస్తోందని తెలిపారు. 


భారత దేశం దృష్టిలో 1963 నాటి చైనా-పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం అని చెప్పుకుంటున్న ఒప్పందానికి ఈ కొత్త చట్టం ఎటువంటి చట్టబద్ధతను కల్పించదని తెలిపారు. 1963నాటి ఒప్పందం చట్టవిరుద్ధమని, చెల్లనిదని భారత దేశం నిరంతరం చెప్తోందని పేర్కొన్నారు. 


చైనా కొత్త చట్టం ప్రకారం, భూమి సరిహద్దు వ్యవహారాలపై ఇతర దేశాలతో సంయుక్తంగా కుదుర్చుకున్న, పూర్తయిన ఒప్పందాలకు చైనా కట్టుబడి ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించేందుకు చైనా ప్రభుత్వానికి అవకాశం ఉంది. 


Updated Date - 2021-10-27T21:05:49+05:30 IST