Advertisement

ఏది బొనాంజా, ఎక్కడ ధమాకా?

Oct 15 2020 @ 00:34AM

కొవిడ్‌ నేపథ్యంలో జనం దగ్గర డబ్బు లేదని, వారికి నగదు బదిలీ ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ పెంచితేనే ఆర్థిక వ్యవస్థకు ఊతం కల్పించడం సాధ్యమని ఒకపక్క ఆర్థిక నిపుణులు చెబుతుంటే, మరోపక్క కేంద్రం మాత్రం ఉద్యోగులకు ‘మేం రూపాయి ఇస్తాం, మీరు మూడు రూపాయలు ఖర్చు చేయండి’ వంటి ప్రతిపాదనలను గొప్ప వరాల్లా ప్రకటించటం వారిని మోసం చేయడం కాదా?


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర ఉద్యోగుల కోసం ప్రకటించిన ప్యాకేజీ గురించిన వార్తను పలు ప్రముఖ పత్రికలు ‘దసరా ధమాకా’, ‘కేంద్ర ఉద్యోగులకు బొనాంజా’ లాంటి శీర్షికలతో ప్రచురించాయి. వీటిని చూసిన వారు ఎవరైనా కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు ఏదో పెద్ద మేలే చేసిందని భావిస్తారు. నిజానికి ఆ ప్యాకేజీ అనేక విషమ షరతులతో కూడుకున్నది. అందులో ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా లభించేదేం లేదు. పైపెచ్చు భ్రమలు కల్పించి, వారి చేతి చమురు వదిలించే కుట్ర ఇది.


నాలుగేళ్ల శ్లాబులో, ఒకసారి దేశంలోని ఏదైనా ప్రదేశానికి, మరోసారి ఉద్యోగి సొంతూరికి కుటుంబ సభ్యులందరూ వెళ్లేందుకు వీలుగా ఎల్‌టిసి సౌకర్యాన్ని కల్పించారు. ఆ సందర్భంలోనే సదరు ఉద్యోగి ఖాతాలో ఆర్జిత సెలవు మిగిలిఉంటే వాటిలో పది రోజులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంటు కింద నగదు చెల్లిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సౌకర్యాలివి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగులు ప్రయాణాలు చేయడానికి అంత సుముఖంగా లేరు కనుక ఈ మొత్తాలకు సమానమైన ఓచర్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కాని, ఆ ఓచర్లను ఖర్చు చేయడానికి చాలా పితలాటకం పెట్టారు. ప్రయాణ టిక్కెట్ల నిమిత్తం ఉద్యోగికి చెల్లించే మొత్తానికి మూడింతలు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంటు సొమ్ముకు రెట్టింపు ఖర్చు పెట్టాలన్నది ఆ షరతు.


ఉదాహరణకు, ఒక ఉద్యోగికి కుటుంబసభ్యుల ప్రయాణ టిక్కెట్ల కింద రూ.80వేలు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంటుగా రూ.20వేలు వచ్చిందనుకుందాం. ఆ ఉద్యోగికి లక్ష రూపాయల ఓచర్లు జారీ చేస్తారు. నిర్మల సీతారామన్ లెక్క ప్రకారం.. ఆ ఉద్యోగి వాటిని వాడుకోవాలంటే టిక్కెట్ల కింద ఇచ్చిన మొత్తానికి మూడింతలు-, అంటే రూ.2 లక్షల 40 వేలు, ఎన్‌క్యాష్‌మెంట్‌కు రెట్టింపు రూ.40వేలు, వెరసి రూ.2 లక్షల 80వేలు విలువ చేసే సరుకులు, సేవలు కొనుగోలు చేయాలి. అది కూడా 12 శాతం లేదా అంతకన్నా ఎక్కువ జిఎస్‌టి రేటున్న వాటినే కొనాలి. ఆ మేరకు జిఎస్‌టి అధీకృత రసీదును జతపర్చాలి. అంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే దానిలో కనీసం మూడోవంతు మొత్తం తిరిగి ఖజానాకు చేరుతుంది. ఈ ఉదాహరణనే తీసుకుంటే సర్కారు ఇచ్చే ఎల్‌టిసి ఓచర్‌ లక్ష రూపాయలైతే జిఎస్‌టి రూపంలో రూ.33,600 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తం ఖజానాకు చేరుతుంది. అసలు కిటుకు ఇదీ! ఇన్ని షరతులు విధించి, దాన్నేదో బొనాంజా, కానుక అంటే ఎలా అన్న ఉద్యోగుల ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు?


కొవిడ్‌ నేపథ్యంలో జనం దగ్గర డబ్బు లేదని, వారికి నగదు బదిలీ ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ పెంచితేనే ఆర్థిక వ్యవస్థకు ఊతం కల్పించడం సాధ్యమని ఒకపక్క ఆర్థిక నిపుణులు చెబుతుంటే, మరోపక్క కేంద్రం మాత్రం ఉద్యోగులకు ‘మేం రూపాయి ఇస్తాం, మీరు మూడు రూపాయలు ఖర్చు చేయండి’ వంటి ప్రతిపాదనలను గొప్ప వరాల్లా ప్రకటించటం వారిని మోసం చేయడమే కాదా? 


పండగ అడ్వాన్సుగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులందరికీ పదివేల రూపాయలు చెల్లిస్తామని, అది కూడా ‘రూపే’ కార్డు రూపంలో ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. నగదుగా విత్‌డ్రా చేయడానికి వీలు లేకపోవడం తప్ప ఆ సొమ్ము ఖర్చుపై మాత్రం షరతులు విధించలేదు. అయితే, ఇదేమీ ఉచితం కాదు. ఉద్యోగులు పది వాయిదాల్లో దాన్ని తిరిగి చెల్లించాల్సిందే! వీటిలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కల్పించిన రాయితీ ఏమాత్రమూ లేదు. ఎల్‌టిసి ఉద్యోగుల హక్కు. దానికి బడ్జెట్‌లో కేటాయింపూ ఉంది. అడ్వాన్సు మొత్తం తిరిగి చెల్లించేదే! ఇక కేంద్రం ఉద్యోగులకు ఇచ్చిన బంపరాఫర్‌ ఏమిటన్నట్టు?


యు. వేంకటేశ్వర్లు 

ఇస్రో విశ్రాంత ఉద్యోగి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.