పరిమిత స్థాయిలో డ్రగ్స్ ఉండటం నేరం కాదు... కొత్త బిల్లు తేబోతున్న మోదీ ప్రభుత్వం...

ABN , First Publish Date - 2021-11-25T21:44:28+05:30 IST

వ్యక్తిగత వినియోగం కోసం పరిమిత స్థాయిలో మాదక

పరిమిత స్థాయిలో డ్రగ్స్ ఉండటం నేరం కాదు... కొత్త బిల్లు తేబోతున్న మోదీ ప్రభుత్వం...

న్యూఢిల్లీ : వ్యక్తిగత వినియోగం కోసం పరిమిత స్థాయిలో మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం నేరం కాదని తెలిపే బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహా ఇతర మంత్రిత్వ శాఖలు ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇచ్చిన సలహా మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. 


దేశంలో మాదక ద్రవ్యాల కేసులపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వినియోగం కోసం కొద్ది మొత్తంలో మాదక ద్రవ్యాలను కలిగియుండటం నేరం కాదని తెలిపే చట్టాన్ని రూపొందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల (ఎన్‌డీపీఎస్) చట్టాన్ని సమీక్షించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూకు తెలిపింది. మాదక ద్రవ్యాలను ఉపయోగించేవారిని, వాటిపై ఆధారపడేవారిని బాధితులుగా పరిగణించాలని, వారిని జైళ్లకు బదులుగా డీ-ఎడిక్షన్ సెంటర్లకు పంపించాలని తెలిపింది. 


దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ గత నెలలో స్పందిస్తూ చట్టానికి ఏమైనా సవరణలు చేయాలా? సవరణలు అవసరమైతే, అందుకు కారణాలేమిటి? చెప్పాలని వివిధ మంత్రిత్వ శాఖలకు, వ్యవస్థలకు లేఖలు రాసింది. కేంద్ర హోం, ఆరోగ్యం, సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలకు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు ఈ లేఖలు రాసింది. 


దేశంలో మాదక ద్రవ్యాలను కలిగియుండటం, అమ్మడం, దిగుమతి చేసుకోవడం, వాటితో వ్యాపారం చేయడం నేరమని ఎన్‌డీపీఎస్ చట్టం చెప్తోంది. ఈ చట్టం దేశంలోని పౌరులతోపాటు భారత దేశానికి వెలుపల ఉన్న భారతీయులకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా భారత దేశంలో రిజిస్టర్ అయిన నౌకలు, విమానాల్లో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. జప్తు చేసిన మాదక ద్రవ్యం పరిమాణాన్ని బట్టి నేరస్థునికి శిక్ష ఉంటుంది. 


Updated Date - 2021-11-25T21:44:28+05:30 IST