ఆర్థిక వృద్ధికి ‘విమానయానం’ కీలకం

Published: Sat, 26 Mar 2022 00:15:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆర్థిక వృద్ధికి విమానయానం కీలకం

  • ప్రతి డాలర్‌కు 3.1 డాలర్ల ప్రతిఫలం
  • గత ఏడేళ్లలో కొత్తగా 310 విమానాలు
  • రానున్న కాలంలో ఏటా 120 విమానాల కొనుగోలు 
  • ‘వింగ్స్‌ ఇండియా 2022’లో  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా


కొత్త పథకం ప్రారంభం..

‘స్మాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సబ్‌-స్కీమ్‌’ పేరుతో మంత్రి సింధియా కొత్త పథకాన్ని ప్రారంభించారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. చిన్న విమానాల ద్వారా సేవలందించడానికి ఇది ప్రోత్సాహం కల్పిస్తుంది. 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశ ఆర్థికాభివృద్ధికి విమానయాన రంగం చాలా కీలకమని, ఈ రంగం అనేక రెట్లు ఉద్యోగావకాశాలను పెంచుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ రంగంలో పెట్టే ప్రతి డాలర్‌కు 3.1 డాలర్ల ప్రతిఫలం లభిస్తోంద న్నారు. విమానయాన రంగంలో నేరుగా ఒకరికి ఉద్యోగం లభిస్తే.. పరోక్షంగా ఆరుగురికి  ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వింగ్స్‌ ఇండియా 2022’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కొవిడ్‌ అనంతరం వీ షేప్‌ రికవరీని సాధించిన ఏకైక రంగంగా అభివర్ణించారు. 


ఏడాదికి 120 విమానాలు: రానున్న కాలంలో దేశీయ విమానయాన సంస్థలు ఏటా 110 నుంచి 120 కొత్త విమానాలను సొంతం చేసుకోనున్నాయని మంత్రి సింధియా తెలిపారు. అంతర్జాతీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడానికి దేశీయ విమానయాన సంస్థలు మరిన్ని వైడ్‌-బాడీడ్‌ (పెద్ద) విమానాలను సమకూర్చుకోవాలని చెప్పారు. కాగా దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య కొవిడ్‌ ముందు స్థాయికి చేరిందన్నారు. ప్రస్తుతం రోజుకు 39 లక్షల స్థాయికి చేరిందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ఈ సంఖ్య 41 లక్షల స్థాయిని అధిగమించనుందని మంత్రి తెలిపారు. 


ఏడేళ్లలో 66 విమానాశ్రయాలు: విమానాలు, విమానాశ్రయాలపరంగా గత ఏడేళ్ల కాలంలో విమానయాన రంగం విస్తారంగా అభివృద్ధి చెందింది. గత ఏడేళ్ల కాలంలో వాటర్‌ పోర్టులతో కలిపి మొత్తం కొత్తగా 66 విమానాశ్రయాలను అభివృద్ధి చేశాం. ప్రస్తుతం 140 విమానాశ్రయాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 220కి చేరనుందని సింధియా తెలిపారు. 2013-14లో దేశీయంగా 400 విమానాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 710కి చేరిందని చెప్పారు. సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. దేశీయంగా ప్రస్తుతం 9,000 మంది పైలట్లు ఉన్నారు. ఇందులో 15 శాతం మంది మహిళలేనని అన్నారు. ప్రతి మెట్రో నగరంలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దేశీయంగా విమాన ప్రయాణికులు 2024-25 నాటికి 41 కోట్లకు చేరుతారని అంచనా వేస్తున్నట్లు సింధియా  తెలిపారు. 


కొత్తగా 9 ఫ్లైయింగ్‌ శిక్షణ కేంద్రాలు: ప్రస్తుతం దేశంలో 34 ఫ్లైయింగ్‌ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. మరో 9 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతించాం. మరో 15 కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నాం. కాగా ప్రస్తుతం దేశంలో 10 విమాన నిర్వహణ, మరమ్మతు కేంద్రాలు (ఎంఆర్‌ఓ) ఉన్నాయి. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. డ్రోన్‌ల రంగంలో ప్రపంచానికే భారత్‌ను కేంద్రంగా చేసే అవకాశాలు ఉన్నాయని సింధియా చెప్పారు. 


తెలంగాణలో మరిన్ని ఎంఆర్‌ఓ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మత్తు (ఎంఆర్‌ఓ) రంగం  నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించగలదని ప్రభుత్వం భావిస్తోందని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ‘వింగ్స్‌ ఇండియా 2022’ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీఎంఆర్‌, ఎయిరిండియాకు చెందిన రెండు ఎంఆర్‌ఓ యూనిట్లు ఉన్నాయి. తెలంగాణలో మరిన్ని ఎంఆర్‌ఓ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఓఈఎం కంపెనీలు, విమానయాన సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.