
న్యూఢిల్లీ : థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుతున్నట్లు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ బుధవారం చెప్పారు. ఈ ప్లాంట్లకు మంగళవారం సరఫరా చేసిన బొగ్గు 2 మిలియన్ టన్నులను దాటిందని చెప్పారు. అన్ని మార్గాల్లోనూ బొగ్గు సరఫరాను పెంచుతున్నందుకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.
థర్మల్ పవర్ ప్లాంట్లకు కోల్ ఇండియాతో సహా అన్ని వనరుల నుంచి సరఫరా అయిన బొగ్గు స్థాయి, పరిమాణం మంగళవారం 2 మిలియన్ టన్నులు దాటినట్లు అందరికీ తెలియజేయడానికి సంతోషంగా ఉందని ప్రహ్లాద్ జోషీ ట్వీట్ చేశారు. విద్యుత్తు ప్లాంట్ల వద్ద సరిపడినంత స్థాయిలో బొగ్గు నిల్వ ఉండేవిధంగా సరఫరాను పెంచుతున్నామని తెలిపారు.
కోల్ ఇండియా అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్తు ప్లాంట్లకు గడచిన రెండు రోజుల్లో రోజుకు 1.62 మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు సరఫరా అయింది. నెల రోజుల సగటు బొగ్గు సరఫరా 1.75 మిలియన్ టన్నులతో పోల్చినపుడు మొత్తం సరఫరా రోజుకు 1.88 మిలియన్ టన్నులకు పెరిగింది. గడచిన రెండు రోజుల్లో బొగ్గు ఉత్పత్తి రోజుకు 1.6 మిలియన్ టన్నులకు పెరిగింది. దసరా తర్వాత ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.