Parliament భవనం కట్టింది ఇందుక్కాదు...

ABN , First Publish Date - 2021-10-10T00:21:25+05:30 IST

వలసవాద అధికార కేంద్రంగా ఉండే విధంగా ప్రస్తుత పార్లమెంటు

Parliament భవనం కట్టింది ఇందుక్కాదు...

న్యూఢిల్లీ : వలసవాద అధికార కేంద్రంగా ఉండే విధంగా ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని రూపొందించారని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనం 2022 శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతుందన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


ఆధునిక స్వతంత్ర భారత దేశానికి తగినంత స్థలంతో కూడిన పరిపాలనా సముదాయం ఉండటం తప్పనిసరి అని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారం కొంత వరకు ఊహాజనితం, అవాస్తవం అని చెప్పారు. ప్రస్తుతం మనం సెంట్రల్ విస్టా అని చెప్తున్న భవనాల సముదాయాన్ని నిర్మించాలనే ఆలోచన 1910 ప్రాంతంలోనే వచ్చిందని తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని రూపకల్పన చేయడం వెనుక ఉద్దేశం అక్కడ పార్లమెంటును నిర్వహించడం కాదని, వలసవాద అధికార ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకోవడానికి రూపొందించారని చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020 డిసెంబరులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనం విస్తీర్ణం 64,500 చదరపు మీటర్లు ఉంటుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల మేరకు రాజ్‌పథ్‌ అభివృద్ధి, ప్రధాన మంత్రి నివాసం, కార్యాలయం, ఉప రాష్ట్రపతి ఎన్‌క్లేవ్ నిర్మాణం జరుగుతాయి. 


ప్రస్తుత పార్లమెంటు భవన నిర్మాణానికి ఆలోచన 1913లో జరిగింది. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణం ప్రారంభమైంది. 1927 జనవరి 18న వైస్రాయ్ ఎడ్వర్డ్ ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (లార్డ్ ఇర్విన్) ఈ భవనాన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా ప్రారంభించారు. ఈ భవనం సురక్షితమైనది కాదని హర్‌దీప్ సింగ్ పురి అన్నారు. సభ్యులందరికీ ఇది సరిపోదన్నారు. 


Updated Date - 2021-10-10T00:21:25+05:30 IST