సామాజిక మాధ్యమాల నిబంధనలను కఠినతరం చేయడానికి సిద్ధమే : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-02-04T23:30:05+05:30 IST

సభలో ఏకాభిప్రాయం కుదిరితే, సామాజిక మాధ్యమాల కంపెనీలు

సామాజిక మాధ్యమాల నిబంధనలను కఠినతరం చేయడానికి సిద్ధమే : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : సభలో ఏకాభిప్రాయం కుదిరితే, సామాజిక మాధ్యమాల కంపెనీలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా చేయడానికి, ఇంటర్నెట్‌లో ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడానికి తగిన కఠినమైన నిబంధనలను తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విధంగా స్పందించారు. 


సామాజిక మాధ్యమాల కంపెనీలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ అన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, సామాజిక మాధ్యమాల కంపెనీలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా చేయడానికి, ఇంటర్నెట్‌లో ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడానికి తగిన కఠినమైన నిబంధనలను తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే సభలో ఏకాభిప్రాయం కుదరాలని చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) లేదా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమర్పించే నివేదికల ఆధారంగా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. ఫిర్యాదులను నమోదు చేసి, సంబంధిత దర్యాప్తు సంస్థకు పంపించడానికి ఓ సెంట్రల్ పోర్టల్ కూడా అందుబాటులో ఉందన్నారు. మనం ఓ సమాజంగా ముందుకు రావాలని, అత్యధిక జవాబుదారీతనాన్ని సృష్టించాలని చెప్తున్న మీతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. 


బుల్లి బాయ్ వంటి యాప్‌లపై ఫిర్యాదులు వచ్చినపుడు వెంటనే స్పందించి, తక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పైపైన చర్యలు కాకుండా, లోతైన విచారణ జరిపినట్లు తెలిపారు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదని, మహిళల రక్షణకు సంబంధించిన అంశమని చెప్పారు. సామాజిక మాధ్యమాలను క్రమబద్ధీకరించేందుకు తాము ప్రయత్నించినపుడల్లా, తాము వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలపై దాడి చేస్తున్నామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నారు. తమకు రక్షణ ఉందని మహిళలు భావించే విధంగా, జవాబుదారీతనంగల సామాజిక మాధ్యమాల వ్యవస్థను సృష్టించేందుకు ఏకాభిప్రాయం తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. 


సామాజిక మాధ్యమాల కంపెనీలకు అంతర్జాతీయ ప్రమాణాలుగల చట్టం ఉండాలనే అంశంపై ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.  అటువంటి చట్టం ఏ విధంగా ఉండాలనే అంశంపై అధికారులు చర్చించారు. సామాజిక మాధ్యమాల వినియోగదారుల రక్షణ, బాలల భద్రత, పొలిటికల్ కంటెంట్ మోడరేషన్, హై రిస్క్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ నిర్వచనాలు, నిబంధనలు, గోప్యత సంబంధిత అంశాలు వంటివాటిపై చర్చ జరిగింది. 


Updated Date - 2022-02-04T23:30:05+05:30 IST