బొగ్గు సరఫరా తగ్గడానికి కారణాలివే : కేంద్రం

ABN , First Publish Date - 2021-10-10T16:46:57+05:30 IST

దేశంలో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు

బొగ్గు సరఫరా తగ్గడానికి కారణాలివే : కేంద్రం

న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విద్యుత్తుకు అనూహ్యంగా డిమాండ్ పెరగడం, భారీ వర్షాలు, దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరగడం, వర్షాకాలానికి ముందు తగిన స్థాయిలో బొగ్గును నిల్వ చేసుకోకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితి వచ్చిందని విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో  తెలిపింది. 


విద్యుదుత్పత్తి ప్లాంట్లలో బొగ్గు కొరత గురించి ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ స్పందించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల ఉప సంఘం వారానికి రెండుసార్లు బొగ్గు నిల్వల పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. 


బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు ఉన్నాయని తెలిపింది. అవి :


1. విద్యుత్తు డిమాండ్ మునుపెన్నడూ లేనంతగా పెరగడం.


2. 2021 సెప్టెంబరులో బొగ్గు గనుల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం.


3. దిగుమతి చేసుకునే బొగ్గు ధర మునుపెన్నడూ లేనంత భారీగా పెరగడం.


4. వర్షాకాలం ప్రారంభమవడానికి ముందు తగిన స్థాయిలో బొగ్గు నిల్వ చేసుకోకపోవడం.


ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల విద్యుత్తు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని తెలిపింది. గనుల ప్రాంతాల్లో వర్షాలు కురవడం వల్ల బొగ్గు తవ్వకం, రవాణాలో ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది. ఫలితంగా విద్యుదుత్పత్తి తగ్గినట్లు పేర్కొంది. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు బొగ్గు కంపెనీలకు పెద్ద ఎత్తున బాకీపడినట్లు తెలిపింది. 


Updated Date - 2021-10-10T16:46:57+05:30 IST