మరోసారి హిందీ

ABN , First Publish Date - 2022-04-09T06:12:33+05:30 IST

భిన్నత్వంలో ఏకత్వం అని గొప్ప మాటలు చెబుతుంటారు కానీ, మన దేశంలోని అనేక వైవిధ్యాలు చాలా మందికి సరిపడవు. భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు.. వీటిని చూసి భయపడి, ఆ భిన్నత్వాన్ని తుడిచిపారేయాలని చూస్తారు...

మరోసారి హిందీ

భిన్నత్వంలో ఏకత్వం అని గొప్ప మాటలు చెబుతుంటారు కానీ, మన దేశంలోని అనేక వైవిధ్యాలు చాలా మందికి సరిపడవు. భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు.. వీటిని చూసి భయపడి, ఆ భిన్నత్వాన్ని తుడిచిపారేయాలని చూస్తారు. ఒకే దేశం కదా, అన్నీ ఒకటిగా ఉండాలి కదా అన్న మూర్ఖ ఆలోచనతో, దేశానికి అంతటికీ పద్ధతులను, వ్యవస్థలను రూపొందిస్తూ ఉంటారు. వైవిధ్యం అంటే వైరుధ్యం కాదు. బాహుళ్యంలో ప్రజాస్వామికత ఉంటుంది. భారతదేశంలో వందలాది భాషలు ఉన్నాయి. కాకపోతే, అధికార భాష హోదా పొందినవి అతి కొద్ది మాత్రమే. అధికారభాషల మధ్య అంతరాలేమీ ఉండకూడదు.


అంతస్థులు ఉన్నాయంటే, పై మెట్టు మీద కూర్చోబెట్టిన భాషను మాట్లాడే ప్రజలకు ఆ మేరకు అదనపు అవకాశాలను ఇస్తున్నట్టు. గుర్తింపు పొందిన అధికారభాషలలో హిందీ ఒకటి. ఆ భాషను తమ మాతృభాషగా చెప్పుకునేవారు అధికంగా ఉన్నారని జనాభా లెక్కలు చెబుతాయి కానీ, హిందీ చాలా ఇటీవలి భాష. భోజ్‌పురీ, మాగధీ వంటి అనేక స్థానిక భాషలను చెరిపేసి హిందీ ప్రమాణభాషగా రూపొందుతూ వచ్చింది. హిందీని భారతదేశంలో అధికార, అనుసంధాన భాషగా చేయాలనే ప్రయత్నానికి తీవ్రంగా వ్యతిరేకత ఎదురయింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హిందీని తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. 


తమదే నికార్సయిన జాతీయవాదమని విశ్వసించే భారతీయ జనతాపార్టీ, హిందీని ఏకైక అనుసంధాన భాషగా, కేంద్రప్రభుత్వ సర్వ వ్యవహారాలూ నిర్వహించవలసిన భాషగా చేయాలని వాంఛించే పార్టీ. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో, విదేశాలలో ఎక్కడ పర్యటించినా హిందీలోనే మాట్లాడేవారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి హిందీని రకరకాలుగా అధికారవేదికల మీదకు తీసుకురావడం చూస్తున్నాము. అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద, ప్రజలను ఉద్దేశించి మనసు విప్పి చేసే రేడియో అభిభాషణలో కూడా నరేంద్రమోదీ హిందీ మాత్రమే మాట్లాడతారు. మోదీకి కానీ, ఆయన తరువాత ప్రస్తుత ప్రభుత్వంలో ద్వితీయస్థానంలో ఉన్న అమిత్ షాకు కానీ హిందీ మాతృభాష కాదు. వారి భాష గుజరాతీ. ఒకే దేశం, ఒకే భాష అన్న ఆలోచన వారికి బలంగా ఉన్నదేమో, హిందీని పీఠంపై కూర్చోబెట్టాలని బలంగా ప్రయత్నిస్తున్నారు.


అధికార భాషా వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు మరొక్కసారి హిందీ శంఖం పూరించారు. ఈసారి ఆయన కొత్త రకంగా వాదన ముందుకు తెచ్చారు. మాతృభాషల స్థానంలోకి హిందీని తేవద్దు, ఇంగ్లీషు స్థానంలోకి హిందీని తేవాలి, వేరువేరు భాషల భారతీయులు కలుసుకున్నప్పుడు హిందీలో మాట్లాడుకోవాలి- అని ఆయన ఆ అధ్యక్షోపన్యాసంలో అన్నారు. మీలో మీరు మాతృభాషలను మాట్లాడుకోండి పర్వాలేదు- అని ఉదారంగా, వరమిచ్చిన తీరులో ఆయన చెప్పారు. భారతీయ భాషల మధ్య అనుసంధాన భాషగా ఒక భారతీయ భాష ఉంటే, ఆ అనుసంధాన భాషను మాతృభాషగా కలిగినవారికి పెద్దపీట వేసినట్టు అవుతుందన్న ఉద్దేశ్యంతోనే, హిందీని కొన్ని రాష్ట్రాల వారు వ్యతిరేకిస్తున్నారు.


ఇంగ్లీషు అనుసంధానభాషగా ఉండడం వల్ల భారతదేశంలోని ఏ ఒక్క ప్రాంతానికీ అదనపు ప్రయోజనం ఉండదు కాబట్టి, అది తటస్థంగా ఉపకరిస్తుందన్నది ఇంగ్లీషువాదుల అవగాహన. పైగా, ఇప్పుడు ఇంగ్లీషు ఉపాధిభాషగా, అవకాశాల భాషగా, అంతర్జాతీయ భాషగా ఉన్నప్పుడు, దానిని ఎందుకు వదులుకోవాలి? బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలో ఉండి, ఇంగ్లీషు విద్య అనేక తరాలుగా ఉంటున్న ప్రాంతాలవారికి ఉన్న ఆ భాషలో ఏర్పడిన సాధికారతను ఎందుకు వదులుకోవాలి? మాతృభాషను కాపాడుకుంటూ, ఇంగ్లీషు స్థానంలో హిందీని స్వీకరించాలని చెబుతున్న అమిత్ షా, హిందీ మాతృభాషగా కలిగినవారికి ఏమి సలహా ఇస్తారు? వారికి మాతృభాషే అనుసంధాన భాష అవుతుంది కదా, వారు మరో భాష నేర్చుకోనక్కరలేదా?


అమిత్ షా హిందీ వాదన కొత్తది కాదు. ఒకసారి ‘హిందీ దివస్’ సందర్భంగా కూడా ఇటువంటి మాటలే మాట్లాడారు. మోదీ చెబుతున్న స్వావలంబనలో హిందీ కూడా భాగమని ఆనాడు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేవనాగరి లిపిలో హిందీని అధికార భాషగా స్వీకరించామని పాక్షిక వాస్తవాన్ని పూర్తి సత్యంగా వక్కాణించారు. రాజ్యాంగంలోని 343 అధికరణం గురించి చెప్పారు తప్ప, 1963లో వచ్చిన అధికార భాషల చట్టం గురించి చెప్పలేదు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలు సాక్షిగా, ఇప్పుడు దేశంలో 22 అధికార భాషలు ఉన్నాయి. రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చిన భాషను అధికారభాషగా ఎంచుకోవచ్చు కూడా. 


అమిత్ షా తాజాగా రేపిన వివాదానికి వెంటనే తీవ్ర ప్రతిస్పందన వెలువడింది. దీన్ని సాంస్కృతిక ఉగ్రవాదం అని కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. హిందీని రుద్దితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. మూడు భాషల సూత్రాన్ని తాము అంగీకరించమని, హిందీని జాతీయ అధికార భాష చేస్తే ఆమోదించబోమని తమిళనాడు స్పష్టం చేసింది. పెట్రోలు ధరలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కేంద్రమంత్రి ఈ వివాదాన్ని రాజేశారా, లేక నిజంగా ఆయన పార్టీ, ప్రభుత్వం సిద్ధాంతాలలో భాగంగా మాట్లాడారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2022-04-09T06:12:33+05:30 IST