మన రామప్పకు విశ్వమంత గుర్తింపు

ABN , First Publish Date - 2021-07-26T07:37:34+05:30 IST

ఇసుక పునాదులు! తేలే ఇటుకలు! రాయిని మీటితే రాగాలు! నల్ల రాతిపై సొగసైన మదనికలు! సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు!

మన రామప్పకు విశ్వమంత గుర్తింపు

ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక 

కాకతీయుల కళావైభవానికి యునెస్కో గుర్తింపు

2019లో భారత్‌ నుంచి రామప్ప ఒక్కటే నామినేట్‌ 

ఎంపిక ప్రక్రియలో నాటకీయ పరిణామాలు

రామప్పను చేర్చడంపై నార్వే అభ్యంతరం 

రష్యా చొరవ.. తక్షణం జాబితాలో చేర్చాలని పట్టు

24 దేశాల్లో 17 మనకు అనుకూలం

దౌత్యపరంగా మద్దతు కూడగట్టిన భారత్‌ 

ఆలయ విశిష్టతను వివరించిన ప్రతినిధులు

ప్రధాని హర్షం.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు

భారీ కసరత్తు తర్వాతే..

తొలుత ప్రభుత్వాలు జాబితాను పంపాలి

ఆ తర్వాత సలహా మండలి పరిశీలన

తుది జాబితా ప్రపంచ వారసత్వ కమిటీకి

10 అంశాల్లో పాసైతేనే వారసత్వ గుర్తింపు


ఇసుక పునాదులు! తేలే ఇటుకలు! రాయిని మీటితే రాగాలు! నల్ల రాతిపై సొగసైన మదనికలు! సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు! విభిన్న రూపాల్లో వందలాది ఏనుగుల బొమ్మలు! అదరహో అనిపించే శిల్ప కళా వైభవం.. ఇప్పటికీ అబ్బుర పరిచే అప్పటి ఇంజనీరింగ్‌ టెక్నాలజీ విశ్వవిఖ్యాతమైంది! అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది! తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి గుర్తింపు లభించిన తొలి కట్టడం రామప్ప!!


రామప్పకు వెళ్లండి..

‘అద్భుతం! రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించినందుకు అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఘనకీర్తి గల కాకతీయుల అద్భుత నిర్మాణ కౌశలానికి రామప్ప ఆలయం గొప్ప ప్రతీక. ప్రజలారా.. ఈ అద్భుత ఆలయానికి వెళ్లండి. ఆలయ ఠీవిని ప్రత్యక్షంగా తిలకించి ఆ అనుభూతిని సొంతం చేసుకోండి’  

- ట్విటర్‌లో మోదీ

 దేశంలోనే ప్రత్యేకం! 

రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడానికి మద్దతునిచ్చిన యునెస్కో సభ్య దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అత్యంత సృజనాత్మకత, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో కాకతీయులు సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద రామప్ప ఆలయం. ఇది దేశంలోనే ప్రత్యేకమైనది. స్వయం పాలనలో తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 

- సీఎం కేసీఆర్‌


కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి, అద్భుత నిర్మాణశైలికి ప్రతీక, 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప ఆలయం వైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ (యూడబ్ల్యూహెచ్‌సీ) సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం 4:36 గంటలకు డబ్ల్యూహెచ్‌సీ ప్రతినిధులు రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చారు. రామప్పకు మద్దతుగా రష్యా సహా 17 దేశాలు ఓటు వేశాయి. రామప్పకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 


ఎంపికలో నాటకీయ పరిణామాలు

ఇప్పటికే పలుమార్లు యునెస్కోకు నామినేట్‌ అయిన రామప్పకు ఈసారి ‘గుర్తింపు’ అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. రామప్ప ఎంపిక పరంగా సమావేశంలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలోకి రామప్పను చేర్చడాన్ని నార్వే  వ్యతిరేకించింది. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు తొమ్మిది లోపాలు ఉన్నట్లుగా 2019లో పాలంపేటను సందర్శించిన పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి (ఐసీవోఎంవోఎస్‌) ప్రతినిధులు తమ నివేదికలో ప్రస్తావించారు. అయితే తక్షణమే రామప్పను వారసత్వ కట్టడంగా గుర్తించేలా రష్యా ప్రత్యేక చొరవ తీసుకుంది. 2019 నాటి ఐసీవోఎంవోఎస్‌ నివేదికను తోసిరాజని 22.7 నిబంధన కింద రామప్పను కట్టడాల నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా చేసింది. అటు భారత్‌ కూడా దౌత్య పద్ధతిలో రాయబారం నెరిపింది. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు విచ్చేసిన ప్రతినిధుల తాలూకు 24 దేశాలకు చారిత్రక కట్టడంగా రామప్ప విశిష్టత గురించి వివరించింది. ఇది ఫలితాన్నిచ్చింది.


రామప్పకు మద్దతుగా 24 దేశాల్లో రష్యా సహా ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి. 2019లో భారత్‌ నుంచి యునెస్కోకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్‌ అయింది. రామప్పకు మనదేశం నుంచి ఇతర కట్టడాలేవీ పోటీలో లేకపోవడమూ కలిసొచ్చింది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తొమ్మిదేళ్లుగా ప్రయత్నాలు సాగాయి. రామప్ప తొలిసారిగా 2012లో యునెస్కోకు నామినేట్‌ అయింది. తర్వాత 2013, 14, 19లో నామినేట్‌ అయింది. 2019 వారసత్వ కట్డడాల ఎంపిక కోసం 2020లో జరగాల్సిన యునెస్కో ప్రతినిధుల సమావేశం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. 


భారీ కసరత్తు తర్వాతే...

ఏదైనా పురాతన కట్టడానికి ఐక్య రాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. దాని వెనక భారీ కసరత్తే ఉంటుంది. ఎన్నెన్నో అంకాలను దాటి వెళ్లాక గానీ, ఓ కట్టడానికి యునెస్కో గుర్తింపు రాదు. యునెస్కో ప్రపంచ వారసత్వ కన్వెన్షన్‌లో భాగస్వామ్యమైన దేశాలకు మాత్రమే.. కట్టడాల జాబితాతో కూడిన నామినేషన్లు పంపే వీలుంటుంది. యునెస్కో ఈ విధానాన్ని 1972లో ప్రారంభించగా.. భారత్‌ ఆ కన్వెన్షన్‌లో 1977 నవంబరు 14న చేరింది. ప్రస్తుతం 194 దేశాలు ఈ కన్వెన్షన్‌లో ఉన్నాయి.


ప్రభుత్వాలు తమ దేశంలోని వారసత్వ కట్టడాల జాబితాను.. మ్యాపులు, ఇతర వివరాలతో కలిపి తొలుత యునెస్కోకు పంపాల్సి ఉంటుంది. దీనికీ పలు క్రైటీరియాలు ఉన్నాయి. ఒకసారి జాబితాను పంపాక.. సంబంధిత కట్టడానికి సంబంధించిన మరిన్ని వివరాలను చేర్చవచ్చు. ప్రపంచ వారసత్వ కేంద్రం దాన్ని పరిశీలించి, ఏమైనా మార్పులు చేయాల్సి ఉన్నా.. అదనపు సమాచారాన్ని జోడించాల్సి ఉన్నా.. సలహాలు, సూచనలు చేస్తుంది. ఆ కేంద్రం అధికారులు నామినేషన్‌పై సంతృప్తి చెందితే.. దాన్ని సలహా మండలికి పంపుతారు. ప్రపంచ వారసత్వ మండలిలో మూడు అడ్వయిజరీ బోర్డులు ఉంటాయి. అవి.. అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాలపై సలహా మండలి, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ మండలి, అంతర్జాతీయ సాంస్కృతిక ఆస్తుల పరిరక్షణ, పునరుజ్జీవ కేంద్రం. ఈ మూడు మండళ్లు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఇవి నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. వీలును బట్టి క్షేత్రస్థాయి లో పర్యటిస్తాయి. ఆ తర్వాత త మ నివేదికలను ప్రపంచ వారసత్వ కమిటీకి అందజేస్తాయి.

- ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి



ఇవీ ప్రమాణాలు.. 

సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ వారసత్వాన్ని వచ్చే తరాలకు అందించడమే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల ఎంపిక వెనుక ముఖ్య ఉద్దేశం. అయితే ఓ నిర్మాణం, ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక జరగాలంటే కొన్ని ప్రమాణాలున్నాయి. ఆ మేరకే యూడబ్ల్యూహెచ్‌సీ ఎంపిక చేస్తుంది. సదరు కట్టడం.. మానవ నిర్మాణ శైలిలో తనదైన ప్రత్యేకతను కలిగివుండాలి. ఓ తరం సంస్కృతికి సంబంధించి గానీ, ప్రత్యేకంగా ఓ కాలనికి సంబంధించి గానీ మానవ విలువల్లో వచ్చిన మార్పును ప్రతిబింబించేదిగా ఉండాలి. నాటి కళలకు సంబంధించిన భావనలు ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. కట్టడం జీవితకాలానికి సంబంధించి ధరిత్రి చరిత్రకు ఉదాహరణగా ఉండాలి.


దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాలు

యునెస్కో గుర్తింపునిచ్చే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి 39వ స్థానాన్ని రామప్ప దేవాలయం సంపాదించింది. 1972లో వారసత్వ కట్టడాల గుర్తింపు ప్రారంభం కాగా.. 1977 నవంబరు 14న ఆ కన్వెన్షన్‌లో భారత్‌ చేరింది. తొలిసారి.. 1983లో వారసత్వ కమిటీ.. అజంత, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్‌ను గుర్తించింది. అలా మొదలైన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల సంఖ్య ఇప్పుడు 39కి చేరింది. మన దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా ఇలా ఉంది..


ప్రపంచ వారసత్వ కమిటీ

వారసత్వ కట్టడాలను ఖరారు చేయడానికి ప్రపంచ వారసత్వ కమిటీ 10 ప్రధాన అంశాలను పరిశీలిస్తుంది. ఈ అంశాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒక కట్టడాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలా? వద్దా? అనే తుది నిర్ణయాధికారం ఈ కమిటీదే. ఈ కమిటీ ఏడాదికి ఒక సారి సమావేశమై.. కొత్త జాబితాను విడుదల చేస్తుంది. అవసరాన్ని బట్టి.. ఆయా దేశాలను అదనపు సమాచారం కోరుతుంది. ఇలా ఇప్పటి వరకు 194దేశాల్లోని 1,100 కట్టడాలు, ప్రదేశాలు వారసత్వ జాబితాలో చేరాయి.


‘రామప్ప’కు ఇక కొత్త కళ!

భూపాలపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి):ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడంతో రామప్ప ఆలయం ఇక కొత్త కళ సంతరించుకోనుంది. శిథిలమవుతున్న అద్భుత శిల్ప సంపదను పరిరక్షించే అవకాశం కలగనుంది. ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు రావడంతోపాటు పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.  ఆలయ సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలుంటాయి. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి, సందర్శనకు వచ్చే భక్తులు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిచే వీలుంటుంది. తద్వారా ఆలయంతోపాటు స్థానికంగా వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి ఉండడం రామప్ప అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. రామప్పకు కేంద్ర పర్యాటక శాఖ నుంచి మరిన్ని నిధులు కేటాయించే వీలుంది. ఇక ప్రపంచ వారసత్వంగా గుర్తించినందున.. ఆలయ పరిరక్షణ బాధ్యత కూడా యునెస్కో తీసుకుంటుంది. ఆలయానికి ఏవైనా మరమ్మతులు చేయాల్సివస్తే అంతర్జాతీయ స్థాయిలో వనరులు లభిస్తాయి. 




Updated Date - 2021-07-26T07:37:34+05:30 IST