Advertisement

వైయక్తికంలో విశ్వజనీనం: లూయిస్‌ గ్లూక్‌ కవిత్వం

Jan 25 2021 @ 00:47AM

‘‘నిరాడంబరమైన సొగసు నిండిన కవితాస్వరంతో వ్యక్తి ఉనికిని ప్రపంచీకరించినందుకు’’గానూ లూయీస్‌ గ్లూక్‌కి 2020 సంవత్సరానికిసాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు. ఆమెకి నోబెల్‌ అకాడెమి నుండి ఫోన్‌ వస్తే, ‘‘నేను ప్రేమించేవారితో రోజువారి జీవితాన్ని కాపాడుకోవడంపై నాకు శ్రద్ధ. నా మార్నింగ్‌ కాఫీకి టైం అయ్యింది. రెండు నిముషాల మించి మాట్లాడలేను’’ అనడమే కాక, ‘‘మీకిచ్చిన రెండు నిముషాలూ అయిపోయాయి’’ అని గుర్తు చేసింది. ఈ ఉదాహరణ చాలు ఆమె వ్యక్తి ఉనికికీ, వ్యక్తిగతానికీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడా నికి. అందుకే ఆమె కవితా వస్తువులన్నీ ప్రేమ, మరణం, మోసం, తిరస్కారం, ఒంటరితనం, ద్వేషం వంటి ఆత్మ సంబంధమైన వస్తు వులే. వాటిని స్త్రీ దృష్టికోణంలో ఆవిష్కరించడం ఆమె కవిత్వ లక్షణం. 


గ్లూక్‌కి నోబెల్‌ ప్రైజ్‌ రావడంతో 27సంవత్సరాల వ్యవధి తరు వాత నోబెల్‌ బహుమతి వచ్చిన అమెరికన్‌ కవయిత్రి అయింది. బహుమతులు సాధించి పెట్టే కవిత్వపు మూసల్లోకి ఆమె కవిత్వం ఒదగదనీ, రాజకీయ ఒత్తిడులతో రాయబడే కవిత్వం కాదనీ, ఆమె తన కవిత్వంలో ఏ రకమైన ప్రబోధాలూ చేయదనీ, అందుకే ఆమె కవిత్వం కొత్త సౌరభాలు వెదజల్లుతుందని ఆమె పుస్తకాల ప్రచు రణకర్తల అభిప్రాయం. ‘ఫస్ట్‌ బోర్న్‌’ (1968)తో మొదలై, 50 ఏళ్ళకు పైగా సాగించిన కవితా ప్రస్థానంలో ఆమె 12 కవితా సంపుటాలు వెలువరించింది. కవిత్వం మీద సిద్ధాంత గ్రంథం కూడా రాసింది. 


గ్లూక్‌ కవిత్వంలోని భాష సామాన్యంగానూ, రోజువారి వాడుకకి దగ్గరగానూ ఉన్నా, ఆమె కవిత్వం లోని లయ, పునరుక్తి, తను ఎంచుకునే స్పష్టాస్పష్ట నుడికారాలు కవితకు దిటవు చేకూర్చి అసామాన్యం చేస్తాయి. ‘‘రాస్తున్నప్పుడు బతికున్నట్లు, లేనప్పుడు లేనట్లు’’ ఉంటుందని అంటుంది గ్లూక్‌. రాయడం పట్ల అంతటి నిబద్ధత తనది. రాయడం అంటే నన్ను నేను తెలుసుకోవడమే కాకుండా, దురదృష్టం, ఓటమి, బాధలు కలిగించే పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవడమే అంటుంది గ్లూక్‌.


నోబెల్‌ బహుమతికి ముందు ఆమెను ఎన్నో అవార్డులు వరిం చాయి. ‘ది వైల్డ్‌ ఐరిస్‌ (1992)’ అనే కవితా సంపుటానికి ప్రతి ష్టాత్మక పులిట్జర్‌ బహుమతి లభించింది. ఈ సంపుటిలోని కవిత లతో చదువరి తమ స్వగతాలపరంగానూ, మనసు లోతుల్లో ఉన్న భావాలపరంగానూ నేరుగా మమేకం అవడం చేత ఈ కవిత్వం చెరగని ముద్ర వేస్తుంది. ఈ పుస్తకం ఒక తోట నేపథ్యంలో మూడు భాగాలుగా పూవులు, తోటమాలి- కవి, సర్వవ్యాపితమైన ప్రభువు అనే మూడు గొంతుకలుగా రాసిన కవితల సమాహారం. మచ్చుకి ఈ పుస్తకంలోని ‘ది రెడ్‌ పాపీ’ అనే కవితకి స్వేచ్ఛానువాదం చూడవచ్చు: 


ఎర్ర గసగసాల పువ్వు 

మనసు లేకపోవటం

మంచిదైంది. ఉద్వేగాలా:

అవి మటుకు నాకున్నాయి; అవే నన్ను 

నడిపించేవి. నాకో

దేవుడున్నాడు స్వర్గంలో,

సూర్య దేవుడు, అతనికై

విప్పారి, అతనికి నివేదిస్తూ

నా హృదయంలో మండుతోంది అగ్ని, 

అతని సమక్షం లాంటి అగ్ని. 

అంతటి తేజస్సు హృదయానికిగాక 

మరి దేనికుంటుంది? ఓ నా సహోదరులారా,

గతంలో మీరూ నాలాగే కదూ, మీరు 

మనుషులుగాక మునుపు? మరి మిమ్మల్ని మీరు 

ఒక్కసారైనా తెరిచి నివేదించుకోగలిగారా, 

శాశ్వతంగా మూసుకుపోయేముందు? ఎందుకంటే 

ఇప్పుడు నేనూ మీలానే మాట్లాడుతున్నాను. 

పగిలి ముక్కలయ్యాను కాబట్టి మాట్లాడుతున్నాను.


ఆత్మనివేదనకి బుద్ధిమీరిన మాటలు కాదు, స్పందించే హృదయం కావాలనే తాత్విక చింతనను ఈ కవితలో ఎర్ర గసగసాల పువ్వు స్వగతంలాగ పలికించింది గ్లూక్‌. ఈ రూపేణా, గ్లూక్‌ తనలోని వికీర్ణతని కూడా సూచ్యంగా వ్యక్తపరచింది. 


ఎక్కువగా ఆత్మాశ్రయ కవిత్వం కావటం వల్ల ఆమె కవిత్వాన్ని కన్ఫెషనల్‌ పోయెట్రీ అని కొంతమంది విమర్శకులు వాదించినప్పటికీ, సున్నితమైన సన్నిహితమైన వైయక్తికాంశాలను విశ్వజనీనం చేయడమే ఆమె కవితా ప్రస్థాన సాఫల్యత. 

విప్పగుంట రామ మనోహర

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.