వర్సిటీలు ఖాళీ!

ABN , First Publish Date - 2021-01-05T05:43:16+05:30 IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు శాశ్వత ఆచార్యుల కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

వర్సిటీలు ఖాళీ!

శాశ్వత ఆచార్యులు లేక బోధన భారం 

పలు విభాగాల్లో ప్రొఫెసర్లు ఒకరిద్దరే 

కాంట్రాక్టు, గెస్ట్‌, కన్సల్టెంట్లతో కాలక్షేపం 

15ఏళ్లుగా నియామకాలు లేక అవస్థలు 

రూసా పథకానికి రాష్ట్ర వర్సిటీలకు అనర్హత 

ఆచార్యుల కొరతతో సాగని పరిశోధనలు 

రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లకు పొడిగించాలి 

సీనియర్‌ ఆచార్యులు, విద్యావేత్తల సూచనలు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు శాశ్వత ఆచార్యుల కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రానున్న రెండు, మూడు నెలల్లో పెద్దసంఖ్యలో అధ్యాపకులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో పలు వర్సిటీల్లో విభాగాలకు విభాగాలే ఖాళీ కానున్నాయి. కోర్టు కేసులు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయంలో సర్కారు వైపు నుంచి ఏమాత్రం చొరవ, చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ చేపట్టే వరకూ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65ఏళ్లకు పొడిగిస్తే బోధనా పరమైన సమస్యను కొంతమేరకు అధిగమించవచ్చని సీనియర్‌ ఆచార్యులు, విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు కేంద్ర వర్సిటీలు, జాతీయ ప్రాముఖ్యం కలిగిన కేంద్ర సంస్థల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది. 


యూజీసీ నిధులకు బ్రేక్‌ 

శాశ్వత అధ్యాపకుల కొరత కారణంగా యూజీసీ పథకం ‘రూసా’ నుంచి వర్సిటీలకు అందాల్సిన నిధులు ఆగిపోయాయి. అధ్యాపక ఖాళీల్లో 85శాతం భర్తీ చేస్తేనే ఈ నిధులకు అర్హత లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో శాశ్వత అధ్యాపకులు 50శాతం కంటే తక్కువ మంది ఉన్నారు. రానున్న ఐదేళ్లలో ఇది 25శాతానికి పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిశోధనా పథకాల నుంచి నిధులు మంజూరు కావాలన్నా ప్రతి విభాగంలో నిర్దేశిత సంఖ్యలో ఆచార్యులు ఉండాలి. కానీ వర్సిటీల్లో 15 ఏళ్లుగా విస్తృతస్థాయులో నియామకాలు చేపట్టలేదు. 1988 తర్వాత 2006లో మాత్రమే పోస్టులు భర్తీ చేశారు. దీంతో కాంట్రాక్టు, గెస్ట్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ కన్సల్టెంట్లపై ఆధారపడాల్సి వస్తోంది. అధ్యాపకుల లేమి పరిశోధనలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్సిటీలు కేవలం బోధనకు మాత్రమే పరిమితమయ్యే గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌పై కదలిక లేదు. స్ర్కీనింగ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చని కోర్టు తీర్పులో ఉన్నా ఆ దిశగా కనీసం ప్రయత్నం చేయడం లేదు. కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఆచార్యుల కొరత ఇలా... 

రాష్ట్రంలో 15వర్సిటీల్లోని చాలా విభాగాల్లో కేవలం ఒక్కరు లేదా ఇద్దరు శాశ్వత అధ్యాపకులతో నడుస్తున్నాయి. కొన్ని పెద్ద విభాగాల్లో సైతం ఒక్కరు కూడా లేరు. కేవలం కాంట్రాక్టు, గెస్ట్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ కన్సల్టెంట్లతోనే మమ అనిపిస్తున్నారు. 

- ఏయూలో 930 అధ్యాపక పోస్టులు ఉండగా ప్రస్తుతం 260మంది పని చేస్తున్నారు. ఆర్ట్స్‌, సైన్స్‌ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య మూడోవంతుకు పడిపోయింది. ఫిలాసఫీ విభాగంలో 10మందికి గాను ఒక్కరే ఉన్నారు. హిస్టరీ విభాగంలో ఒక్కరూ లేరు. 

- ఎస్వీయూలో 625 మందికి గాను 250 మంది టీచింగ్‌ స్టాఫ్‌ ఉన్నారు. తమిళం, హిందీ, ఉర్దూ విభాగాల్లో ఒకరిద్దరు, తెలుగులో ముగ్గురు మిగిలారు. 

- ఏఎన్‌యూలోని లా విభాగంలో ఒక్క శాశ్వత ప్రొఫెసర్‌ కూడా లేరు. అర్ధశాస్త్రం, కామర్స్‌ విభాగాల్లో ఏడుగురు చొప్పున శాశ్వత అధ్యాపకులు ఉండాలి. కానీ ఆయా విభాగాల పరిస్థితీ అలాగే ఉంది. 

- ఎస్‌కేయూలో మంజూరైన టీచింగ్‌ పోస్టులు 208 కాగా ప్రస్తుతం 50 మందికి లోపే పనిచేస్తున్నారు. 

- పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 150మందికి గాను 90మంది ఉన్నారు. ఎంబీఏ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, తెలుగు, ఉమెన్‌ స్టడీస్‌ విభాగాల్లో ఇద్దరు, ముగ్గురే మిగిలారు. 

- ద్రావిడ వర్సిటీలో 100 మందికి 85మంది ఉన్నారు. కామర్స్‌, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, ద్రవిడియన్‌ స్టడీస్‌ విభాగాల్లో ఒక్కొక్కరే ఉండగా మాథ్స్‌ విభాగంలో ఒక్కరూ లేరు. 

- వెటర్నరీ వర్సిటీలో 583 మందికి గాను 300 మంది మిగిలారు. ఇక్కడ 310 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు గాను 147 మంది, 129 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు గాను కేవలం 18 మంది పని చేస్తున్నారు. 87మంది ప్రొఫెసర్లకు గాను 78 మంది ఉన్నారు.

Updated Date - 2021-01-05T05:43:16+05:30 IST